Cinnamon benefits: బాలీవుడ్ నటుడు హర్షవర్థన్ రానే (Harshvardhan Rane) ఎంత ఫిట్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కండలు తిరిగిన దేహంతో.. ఈ జనరేషన్ యూత్ కు అతడు ఆదర్శనీయంగా నిలుస్తుంటాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హర్షవర్ధన్.. తన బరువు తగ్గించిన సీక్రెట్ ‘దాల్చిన చెక్క’ అని చెప్పారు. దీంతో ఆయన అభిమానులతో పాటు ఈ నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దాల్చిన చెక్కతో అంత ఈజీగా బరువు తగ్గొచ్చా? అంటూ సందేహాలు వ్యక్తం చేశారు. అయితే దీని గురించి.. ప్రముఖ ఆర్ధో సర్జన్ డాక్టర్ మను బోరా (Ortho surgeon, Dr Manu Bora) స్పందించారు. దాల్చిన చెక్క ప్రయోజనాలతో పాటు.. దానిని తీసుకునే క్రమంలో సాధారణంగా జరిగే తప్పిదాలను వివరించారు.
దాల్చిన చెక్క బరువు తగ్గిస్తుందా?
ఒక ఇంటర్వ్యూలో నటుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ ‘నేను దాల్చిన చెక్క తింటాను. అది నా కొవ్వును కరిగించే సాధనం’ అని అన్నారు. దాల్చిన చెక్కతో పాటు రోజువారీ వెయిట్ లిఫ్టింగ్, వారంలో రెండు స్ప్రింట్ క్లాసులు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం వంటి కఠిన ఆహార నియమాలను పాటిస్తానని చెప్పారు. ‘నేను ట్రెండింగ్ ఫుడ్ అస్సలు తినను. నిజమైన, సహజమైన ఆహారాలను మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నిస్తాను’ అని నటుడు స్ఫష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలపై ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మను స్పందిస్తూ ‘దాల్చిన చెక్క అత్యంత సహజంగా శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. మీ శరీరంలో కొవ్వు చాలా వేగంగా తగ్గిందేకు సహాయ పడుతుంది’ అని చెప్పుకొచ్చారు.
View this post on Instagram
ఆ తప్పు చేస్తున్నారా?
భారతీయ వంటకాల్లో దాల్చిన చెక్కను విరివిగా వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో సాధారణంగా చాలా మంది చేస్తున్న ఒక చిన్న తప్పును డాక్టర్ మను ఎత్తి చూపారు. ‘భారతీయ ఆహారంలో కొందరు నేరుగా దాల్చిన చెక్క గుళికలను ఉపయోగిస్తారు. అందులో మంచి ఔషధ విలువలు ఉన్నప్పటికీ కేవలం ఆహారం ఫ్లేవర్ కోసమే దాల్చిన చెక్కను ఉపయోగిస్తుంటారు. తినే ఆహారంలో దాల్చిన చెక్క తగలగానే పక్కన పెట్టేస్తుంటారు. దీని వల్ల రుచి మాత్రమే వంటకు వస్తుంది తప్పా.. దాల్చిన చెక్క శరీరంలోకి వెళ్లదు. కాబట్టి దాల్చిన చెక్కను పౌడర్ చేసుకొని వినియోగిస్తే.. దాని ప్రయోజనాలు శరీరానికి అందుతాయి’ అంటూ చెప్పుకొచ్చారు.
Also Read: Kriti Sanon: లగ్జరీ బోట్‌లో మహేష్ బ్యూటీ.. బాయ్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తోందా?
స్టడీ ఏం చెబుతుందంటే?
2019 ఫిబ్రవరిలో క్లినికల్ న్యూట్రిషన్ జర్నల్ ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం… దాల్చిన చెక్క బరువు తగ్గడానికి ఉపయోగపడుతున్నట్లు తేలింది. దాల్చిన చెక్క తీసుకున్న వ్యక్తులు.. తీసుకోని వారితో పోలిస్తే సగటున ఒక కేజీ బరువు తగ్గారు. వారి నడుము పరిమాణం దాదాపు 2.4 సెం.మీ తగ్గింది. శరీర కొవ్వులో స్వల్ప తగ్గుదలను సైతం గుర్తించినట్లు అధ్యయనం పేర్కొంది. 50 ఏళ్ల లోపు లేదా అధిక బరువు ఉన్న వారిలో ఈ ప్రభావాలు స్పష్టంగా కనిపించాయని స్టడీ పేర్కొంది. కనీసం 12 వారాల పాటు ప్రతీ రోజూ 2 గ్రాములు అంతకంటే ఎక్కువ దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు వచ్చినట్లు అధ్యయనం తేల్చింది.