Bunker Buster Bomb: ఇజ్రాయెల్ – ఇరాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు రోజు రోజుకు మరింత ముదురుతున్నాయి. అణ్వస్త్ర దేశంగా ఇరాన్ (Iran)ను మారనీయబోమంటూ ఆ దేశంలోని అణు స్థావరాలపై ఇజ్రెయల్ విరుచుకుపడుతోంది. క్షిపణులను ప్రయోగిస్తూ వాటిని నాశనం చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఎన్ని మిసైళ్లు ప్రయోగించినప్పటికీ ఇరాన్ లో పర్వతం కింద 200 అడుగుల లోతులో ఉన్న ఫోర్డో యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ ప్లాంట్‌ని మాత్రం దెబ్బతీయలేకపోయింది. దీంతో దానిని ధ్వంసం చేసేందుకు అమెరికా సాయాన్ని ఇజ్రాయెల్ కోరుతోంది.
ఒక్క అమెరికాకే సాధ్యం!
భూమి ఉపరితలం నుంచి బాగా లోతులో ఉన్న ప్లాంట్ ను ఛేదించగల బాంబ్ ఇజ్రాయెల్ వద్ద లేదు. ఒక్క అమెరికా వద్ద మాత్రమే ప్రపంచంలోనే శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబు ‘మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ (MOP) ఉంది. ప్రస్తుతం ఆ బాంబ్ ను తమకు ఇవ్వాలంటూ అమెరికాను ఇజ్రాయెల్ కోరుతోంది. దీంతో యావత్ ప్రపంచం దృష్టి MOPపై పడింది. ఈ నేపథ్యంలో ఆ బాంబు శక్తి సామర్థ్యాలు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.
బంకర్ బాంబ్ సామర్థ్యాలు
అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ.. యూఎస్ ఎయిర్ ఫోర్స్ కోసం శక్తివంతమైన మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ (MOP) లేదా GBU-57 బంకర్ బస్టర్ బాంబ్ ను తయారు చేసింది. ఈ బాంబ్ బరువు ఏకంగా 14,000 కిలోలు (30,000 పౌండ్లు). అమెరికా సైన్యంలో అత్యంత శక్తివంతమైన నాన్ – న్యూక్లియర్ బాంబుగా GBU-57 గుర్తింపు పొందింది. 61 మీటర్ల (200 అడుగులు) రీఇన్‌ఫోర్స్డ్ కాంక్రీట్ లేదా రాతిని చొచ్చుకుంటూ పోగల సామర్థ్యం ఈ బంకర్ బస్టర్ బాంబుకు ఉంది. ఈ బాంబ్ లోతైన లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు.
ఎలా పనిచేస్తుంది?
GBU-57 బంకర్ బస్టర్ బాంబ్.. జీపీఎస్ (GPS), ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ (INS)తో అనుసంధానం చేయబడి ఉంది. జీపీఎస్ ఆధారంగా అత్యంత కచ్చితత్వంతో ఈ బాంబ్ లక్ష్యాలను ఢీకొట్టగలదు. అయితే అత్యంత శక్తివంతమైన ఈ బాంబును మోసుకెళ్లగల సామర్థ్యం ఒకే ఒక విమానానికి ఉంది. అమెరికా నౌకాదళంలోని బీ-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ (B-2 Stealth Bomber)కు మాత్రమే GBU-57 బంకర్ బస్టర్ బాంబ్ మోసుకెళ్లగల సత్తా ఉంది. ప్రతీ బీ-2 విమానం రెండు GBU-57 బాంబులను తీసుకెళ్లగలదు. ఇది శత్రు రాడార్‌లను తప్పించుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి.
Also Read: Bigg Boss Couple: ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. తిరుమలలో బిగ్ బాస్ జంట.. పెళ్లి చేసుకోవడానికే వెళ్ళారా?
విధ్వంసమంతా లోతులోనే!
అయితే సాధారణంగా ఏ బాంబ్ అయినా.. భూమిని ఢీకొట్టగానే పేలిపోతాయి. కానీ GBU-57 బాంబు ఇందుకు పూర్తి భిన్నం. ఇది భూమిని బలంగా తాకినప్పటికీ పేలిపోదు. భూమి లోతుల్లోని నిర్ధిష్టమైన లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మాత్రమే బ్లాస్ట్ అయ్యేలా దీనిని డిజైన్ చేశారు. కాబట్టి ఉపరితలంపై వీలైనంత వరకూ నష్టాన్ని నివారిస్తుందని అమెరికాకు చెందిన రిటైర్డ్ కల్నల్ స్టీవ్ గన్యార్డ్ తెలిపారు. GBU-57 విధ్వంసక శక్తి ఉన్నప్పటికీ ఇప్పటివరకూ అమెరికా దానిని ప్రయోగించలేదని ఆయన తెలిపారు. 2009లో వైట్ సాండ్స్ క్షిపణి శ్రేణిలో దీనిని విజయవంతంగా పరీక్షించారని.. 2012లో అప్ గ్రేడ్ కూడా చేశారని ఆయన వివరించారు.