OP Rising Lion: ఇరాన్ అణు ప్రణాళికలను సమూలంగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట ఇజ్రాయెల్ భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. గురు, శుక్రవారం కీలకమైన అణు కేంద్రాలను ధ్వంసం చేసింది. ఇరాన్ ముఖ్య అణు శాస్త్రవేత్తలను సైతం మట్టుబెట్టింది. శుక్రవారం తెల్లవారుజామున నటాంజ్‌లోని ప్రధాన అణు కేంద్రాన్ని కూడా ధ్వంసం చేసింది. తద్వారా ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఇజ్రాయెల్ దెబ్బతీసినట్టు అయ్యింది. దీంతో, పశ్చిమాసియాలో ఒక్కసారిగా ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘర్షణ పూర్తి స్థాయి యుద్ధంగా మారుతుందేమోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Read this –Israel Secret Plan: బయటపడిన ఇజ్రాయెల్ రహస్యం.. గుట్టుచప్పుడు కాకుండా..
రైజింగ్ లయన్ ఇప్పుడే ఎందుకు?
ఇరాన్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో సైనిక వ్యవస్థల బలోపేతం కోసం భారీగా పెట్టుబడులు పెట్టింది. విస్తృతంగా రహస్య అణ్వాయుధ కార్యక్రమాన్ని ప్రోత్సహించింది. ఈ పరిణామంపై అగ్రరాజ్యం అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇదే సమయంలో, తమ దేశాన్ని నాశనం చేసేందుకే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందని ఇజ్రాయెల్ కలవరం చెందింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థలోని (IAEA) గవర్నర్ల బోర్డు కూడా ఇరాన్ అణు కార్యకలాపాలను వ్యతిరేకించింది. 20 ఏళ్ల తర్వాత తొలిసారి ఐఏఈఏ ఇన్స్‌స్పెక్టర్లతో కలిసి ఇరాన్ పనిచేయడంలేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ అధిక మొత్తంలో అత్యంత నాణ్యమైన యురేనియంను సేకరించుకుందంటూ కథనాలు కూడా వెలువడ్డాయి. ఇదివరకే పెద్ద మొత్తంలో యూరేనియం నిల్వలు ఉండగా, గత మూడు నెలల్లో మరింత పెంచుకోవడంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
అందుకే, అణు కార్యక్రమాన్ని నిలపివేయాలంటూ అమెరికా పదేపదే కోరుతోంది. చర్చలకు రావాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పలుమార్లు ఆహ్వానించారు. అందుకు, ఇరాన్ అధినేత ససేమిరా అన్నారు. దీంతో, ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయడానికి ఎంతో దూరంలో లేదని, సైనిక లక్ష్యాలే ఆ దేశ అణు కార్యక్రమ లక్ష్యాలు కావొచ్చనే విశ్లేషణలు వెలువడ్డాయి. దీంతో, ఇజ్రాయెల్ సేనలు రంగంలోకి దిగాయి. ఇంతకుమించి ఎక్కువ సమయం వేచిచూడకూదని భావించి ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను చేపట్టి అణు కేంద్రాలను నాశనం చేశాయి.
Read this –Israeli Military: భారత్‌కు ఇజ్రాయెల్ ఆర్మీ ‘సారీ’.. ఎందుకంటే?
తొమ్మిది అణుబాంబులు
ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమ్యాన్ నెతన్యాహు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తొమ్మిది అణు బాంబులకు సరిపడా అత్యంత నాణ్యమైన యురేనియంను సేకరించిందని అన్నారు. ఈ యురేనియంను ఆయుధంగా మార్చుతూ ఇరాన్ ఈ తరహా చర్యలకు దిగడం తాము ఇదివరకు ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ‘‘ఇప్పుడు గనుక ఆపకపోతే, ఇరాన్ చాలా తక్కువ సమయంలోనే అణ్వాయుధాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకు, ఒక సంవత్సరం పట్టొచ్చు. ఒక ఏడాది కంటే తక్కువ సమయంలోనే కావొచ్చు. ఇరాన్ అణ్వాయుధాలు ఇజ్రాయెల్ మనుగడకు సుస్పష్టమైన ముప్పు, ప్రమాదకరం’’ అని నెతన్యాహు పేర్కొన్నారు. 80 ఏళ్ల క్రితం, నాజీ పాలనలో యూదు ప్రజలు హోలోకాస్ట్ (మారణహోమం) బాధితులని, అయితే, అణు హోలోకాస్ట్ బాధితులుగా మారేందుకు సిద్ధంగాలేదని నెతన్యాహు స్పష్టంగా వ్యాఖ్యానించారు.
Read this- Politician: రాబోయే 3 నెలల్లో ప్రముఖ రాజకీయ నేత మృతి.. ఇంతకీ ఎవరది?
ఆత్మ రక్షణ కోసమే..
ఇరాన్ సైనిక లక్ష్యాలు, అణ్వాయుధ కేంద్రాలను లక్ష్యం చేసుకొని దాడులు జరిపిన ఇజ్రాయెల్ ‘ఆత్మరక్షణ’ కోసమని చెబుతోంది. ఇరాన్ ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం లేదని, ఇజ్రాయెల్‌ను విధ్వంసం చేస్తామంటూ బహిరంగంగా పిలుపునిచ్చిన ఇరాన్ నిరంకుశుల పాలకులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని నెతన్యాహు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘మమ్మల్ని మేము రక్షించుకునేందుకు సింహాల మాదిరిగా లేచాం. శత్రువులు మిమ్మల్ని నాశనం చేస్తామని శపథం చేసినప్పుడు వారి మాటలను నమ్మాల్సిందే. మారణహోమం కోసం శత్రువులు ఆయుధాలను తయారు చేస్తే వాటిని నిలువరించాలి’’ అని ఒక ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు.