Israeli Military: ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చరిత్రలో తొలిసారి భారత్‌ను క్షమాపణ కోరింది. ఐడీఎఫ్ (Israel Defense Forces) ఇటీవల ఎక్స్‌లో పోస్టు చేసిన ఊహాజనిత వరల్డ్ మ్యాప్‌లో భారతదేశ అంతర్జాతీయ సరిహద్దులను తప్పుగా చూపించడమే ఇందుకు కారణమైంది. భారత్‌లో అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్‌ను పాకిస్థాన్ భూభాగంగా చిత్రపటంలో చూపించారు. ఇరాన్ ‘ప్రపంచ ముప్పు’ అని అభివర్ణిస్తూ ఇజ్రాయెల్ ఆర్మీ పోస్టు చేసిన మ్యాప్‌లో ఈ తప్పు దొర్లింది. ‘ఇరాన్ అంతిమ లక్ష్యం ఇజ్రాయెల్ మాత్రమే కాదు. అది ఆరంభం మాత్రమే. చర్యలు తీసుకోవడం మినహా మాకు వేరే ఆప్షన్ లేదు’’ అంటూ ఇజ్రాయెల్ ఆర్మీ ఒక మ్యాప్‌ను పోస్ట్ చేసింది. ఇరాన్ క్షిపణుల ముప్పు పరిధి ఎంత వరకు ఉంటుందో చూపిస్తూ ఈ మ్యాప్‌ను షేర్ చేసింది. అయితే, జమ్మూ కశ్మీర్‌ను తప్పుగా చూపించడంపై భారతీయులు మండిపడ్డారు.
దేశ సరిహద్దులను ఈ విధంగా తప్పుగా చూపించడాన్ని సోషల్ మీడియా వేదికగా భారతీయ నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాప్‌లోని లోపాలను ఎత్తిచూపుతూ ఇజ్రాయెల్ ఆర్మీతో పాటు ఆ దేశ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహును కూడా ట్యాగ్ చేశారు.
Read this- Politician: రాబోయే 3 నెలల్లో ప్రముఖ రాజకీయ నేత మృతి.. ఇంతకీ ఎవరది?
ఊహజనిత పటమే
భారతీయుల అభ్యంతరంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెంటనే స్పందించింది. క్షమాపణ చెబుతున్నామంటూ ప్రకటించింది. ఈ మ్యాప్‌లో కచ్చితమైన సరిహద్దులను చూపించడంలో విఫలమయ్యాయని, అయితే, అది కేవలం ఊహాజనిత మ్యాప్ మాత్రమేనని ఐడీఎఫ్ వివరణ ఇచ్చింది. ‘ఇండియన్ రైట్ వింగ్ కమ్యూనిటీ’ అనే ఎక్స్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేసి ఈ సమాధానం ఇచ్చింది. ‘‘ ఇరాన్ క్షిపణుల ప్రభావిత ప్రాంతానికి ఒక ఉదాహరణగా మాత్రమే ఈ పోస్ట్ పెట్టాం. కచ్చితమైన సరిహద్దులను చూపించడంలో ఈ మ్యాప్ విఫలమైంది. ఏదేమైనా జరిగిన తప్పుకి మేము క్షమాపణలు కోరుతున్నాం’’ అని వివరించింది. ఒరిజినట్ పోస్టు పెట్టిన 90 నిమిషాల తర్వాత ఈ సమాధానం ఇచ్చింది. కాగా, ఐడీఎఫ్ తప్పుడు మ్యాప్‌పై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.
Read this- Manchu Lakshmi: నేను క్షేమంగానే ఉన్నా.. ఎయిరిండియా ఘటనపై మంచు లక్ష్మీ వీడియో వైరల్!
అందుకే భారత్ తటస్థం
భారత సరిహద్దులను ఇజ్రాయెల్ ఆర్మీ తప్పుగా చూపించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇండియా ఎందుకు తటస్థంగా ఉంటుందో ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి. దౌత్యంలో మీకెవరూ నిజమైన మిత్రులు ఉండరు’’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. కాగా, జమ్మూ కశ్మీర్, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలను పాకిస్థాన్, చైనా ఆక్రమించాయని, అవి ఎప్పటికైనా తమ దేశ భూభాగంలో అంతర్భాగాలేనని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు.
కాగా, భారత్, ఇజ్రాయెల్ మధ్య చాలాకాలంగా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. బంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. 2017లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ దేశంలో పర్యటించారు. ఇజ్రాయెల్‌లో పర్యటించిన మొట్టమొదటి ప్రధానిగా ఆయన నిలిచారు. ఇక, ఆజ్రాయెల్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో భారత్ కూడా ఉంది. అమెరికా, యూకే, హాంకాంగ్, చైనా తర్వాత భారత్‌తోనే ఆ దేశం ఎక్కువ వాణిజ్యం చేస్తోంది. ఇజ్రాయెల్ మిలిటరీ పరికరాల కొనుగోలు చేసే కీలక దేశంగా భారత్ ఉంది. ఇంత స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ భారత్ సరిహద్దులను తప్పుగా చూపించడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది.