తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: GHMC Fine: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ ఖజానా నింపేందుకు అధికారులు అందుబాటులో ఉన్న ప్రతి ఆదాయ మార్గాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంట్లో పోగైన చెత్తను బయట పారవేసేందుకు వచ్చిన మీరు మిమ్మల్ని ఎవరూ చూడటం లేదని రోడ్లపై నాలాలు, చెరువుల్లో చెత్తను వేశారో మీరు అడ్డంగా బుక్ అయినట్టే. మొదటి సారి పట్టుబడితే రూ. 25 వేలు, రెండోసారి అయితే రూ.50 వేలు, ఇక మూడో సారైతే ఏకంగా రూ. లక్ష రూపాయలు చెల్లించాల్సిందే.
మీరు చెత్త వేసి వెళ్లిన తర్వాత సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీనీ జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలిస్తారు. లేదంటే ఆ ఏరియా శానిటేషన్ సిబ్బంది రంగంలో దిగి క్షణాల్లో చెత్తను వేసిన వారిని గుర్తిస్తారు. అదే మీరు భవన నిర్మాణ వ్యర్థాలను వేశారంటే టౌన్ ప్లానింగ్ సిబ్బంది రంగంలో దిగి మిమ్మల్ని కనిపెట్టడం, మీరు భారీ జరిమానా విధించటం ఖాయం. అందుకే మహానగరవాసులారా తస్మాత్ జాగ్రత్త. చెత్తే కదా ఎక్కడ వేస్తే ఏమిటీ అని భావించొద్దు. ఈ రకంగా నిర్లక్ష్యంగా చెత్తను రోడ్లపై , నాలాల్లో, చెరువుల్లో వేసిన వారిని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటి వరకు రూ.259 జరిమానాలు విధించారు.
Also read: Delimitation JAC meeting:హైదరాబాద్‌లో రెండో సదస్సు.. రానున్న దక్షిణాది సీఎంలు!
చెత్త వేసిన వారి నుంచి ఇప్పటి వరకు రూ.5 లక్షల 41 వేలను, అలాగే భవన నిర్మాణ వ్యర్థాలను వేసిన వారి నుంచి మరో రూ.5 లక్షల 50 వేల వరకు జరిమానాలు విధించారు. ఈ జరిమానాలను పారదర్శకంగా వసూలు చేసేందుకు ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు సీసీఎంఏ సిస్టమ్ తో పాటు జరిమానాల వసూల్లకు ప్రత్యేక యాప్ ను రూపొందించిన సంగతి తెల్సిందే. ఈ సిస్టమ్ పై శానిటేషన్, టౌన్ ప్లానింగ్ సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చిన అధికారులు మున్ముందు ఈ ప్రక్రియను మరింత ముమ్మరం చేసేందుకు సిద్దమవుతున్నారు. అంతేగాక, ఈ జరిమానాలు విధించే నియమించిన సిబ్బందికి రోజువారీ జరిమానాలు టార్గెట్లు కూడా విధించనున్నట్లు సమాచారం.
Also read: Trading Fraud Hyderabad: కోట్ల ట్రేడింగ్ ఫ్రాడ్.. థాయ్ లాండ్ నుంచి ఆపరేషన్
డస్ట్ బిన్ లేకపోయినా జరిమానా చెల్లించాల్సిందే
ప్రజల్లో శానిటేషన్ పట్ల అవగాహన పెంపొందించేందుకు చెత్త, భవన నిర్మాణా వ్యర్థాలను వేసే వారి నుంచి జరిమానాలు వసూలు చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది వ్యాపార సంస్థలపై కూడా దృష్టి సారించింది. ప్రతి వ్యాపార సంస్థలో పోగైన చెత్తను వేసేందుకు తడి,పొడి చెత్తలను వేర్వేరుగా వేసేందుకు రెండు డస్ట్ బిన్లను పెట్టుకోవాల్సిందే. డస్ట్ బిన్లు లేని వ్యాపార సంస్థలను గుర్తించి, వారి నుంచి భారీగా జరిమానాలను వసూలు చేసేందుకు కూడా రంగం సిద్దం చేసినట్లు సమాచారం.
Also read: Viral: ఐపీఎల్ ఎఫెక్ట్.. ఉద్యోగమే ఊడింది.. మరీ ఇంత పిచ్చా!
తడి చెత్త బిన్ లేకపోతే ఒక రకమైన జరిమానా, పొడి చెత్త బిన్ లేకపోతే మరో రకమైన జరిమానాలు విధించాలని అధికారులు భావిస్తున్నారు. తొలుత నామమాత్రపు జరిమానాలు విధించి, వ్యాపారులకు అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత బిన్లు లేకపోతే వరుసగా మూడుసార్లు జరిమానాలు విధించి, ఆ తర్వాత తప్పిదం అలాగే పునరావృతమైతే ఏకంగా సదరు వ్యాపార సంస్థ ట్రేడ్ లైసెన్స్ ను కూడా రద్దు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. మున్ముందు వ్యాపార సంస్థ ల పేర్లతో ఏర్పాటు చేసే బోర్డులకు కూడా అడ్వర్ టైజ్ మెంట్ ఛార్జీలను వసూలు చేసే దిశగా అధికారులు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/