Delimitation JAC meeting: నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలతో పాటు నష్టపోయే ఇతర రాష్ట్రాల హక్కులను కాపాడుకునే క్రమంలో రెండో సదస్సుకు హైదరాబాద్‌లో వేదికకానుంది. పునర్విభజనకు సంబంధించి చెన్నైలో శనివారం నిర్వహించిన సదస్సు ఈ మేరకు తీర్మానించింది. సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునర్విభజనతో నష్టపోనున్న రాష్ట్రాల ప్రజల అభిమతానికి అనుగుణంగా రెండో సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తామని, అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకు సదస్సులో పాల్గొన్నవారంతా మద్దతు తెలపడంతో పునర్విభజన సదస్సు, సభకు హైదరాబాద్ వేదికగా మారనుంది.
Also Read: Revanth Reddy – Delimitation: కేంద్రంపై పోరులో ‘తగ్గేదేలే’.. చెన్నైలో తేల్చేసిన సీఎం రేవంత్
పునర్విభజనతో నష్టపోయే రాష్ట్రాల హక్కుల రక్షణకు భారీ బహిరంగ సభ
పునర్విభజనపై దక్షిణాదితో పాటు నష్టపోయే ఇతర రాష్ట్రాల గళాన్ని బలంగా వినిపించేందుకు ఆయా రాష్ట్రాల్లోని అన్ని పార్టీల ఎంపీలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలోనే అన్ని రాజకీయ పరమైన నిర్ణయాలు జరుగుతాయని, ఈ నేపథ్యంలో అక్కడ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ..పరస్పరం సమన్వయం చేసుకుంటూ.. భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనకు ఎంపీలతో కూడిన కమిటీ పని చేయాలని, ఇందుకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకు సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రులు, నాయకులు అంగీకరించడంతో ఢిల్లీలో ఆ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
Also Read: TG Govt: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాబోయే నోటిఫికేషన్స్ ఇవే..
సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా రేవంత్ రెడ్డి..
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి చరిత్ర.. వర్తమాన పరిస్థితులతో పాటు జనాభా దామాషా, ప్రొరేట్ ప్రకారం పునర్విభజన జరిపితే దక్షిణాది రాష్ట్రాలు, పంజాబ్, ఒడిశా నష్టపోయే తీరును సీఎం రేవంత్ రెడ్డి వివరించడంతో సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ శ్రద్దగా విన్నారు. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినా లోక్‌సభ సీట్లు పెంచకుండా శాసనసభ సీట్లు పెంచుకునే అవకాశం రాష్ట్రాలకు కల్పించాలని సీఎం సూచించడం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. మహిళలకు 33 శాతం సీట్లు, ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపుపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనలు చాలా అర్ధవంతంగా ఉన్నాయని సదస్సులో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ Swetcha Daily Telugu Epaper – Swetcha daily Telangana లింక్ క్లిక్ చేయగలరు