Revanth Reddy – Delimitation: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation)తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని గత కొన్ని రోజులుగా తమిళనాడు ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ అడుగు ముందుకేసిన సీఎం స్టాలిన్ ప్రభుత్వం.. డీఎంకే ఆధ్వర్యంలో తాజాగా చెన్నైలో అఖిలపక్ష భేటిని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. అలాగే కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అఖిలపక్ష భేటిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ ఏమన్నారంటే
కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ను తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అఖిలపక్ష భేటిలో మరోమారు స్పష్టం చేశారు. భారీ ఎత్తున పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్నా తిరిగి తక్కువ మెుత్తంలోనే పొందుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి చెల్లిస్తే.. తెలంగాణకు తిరిగి 42 పైసలే వస్తున్నాయని సీఎం అన్నారు. అదే సమయంలో తమిళనాడుకు 26 పైసలు, కర్ణాటకకు 16 పైసలు, కేరళకు 49 పైసలు వస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో బిహార్ కు ఒక రూపాయికి రూ.6.06, యూపీకి రూ.2.03. మధ్యప్రదేశ్ కు రూ.1.73 మేర లబ్ది చేకూరుతున్నట్లు తెలిపారు.
రాజకీయ అసమానత్వం
దేశంలో రాణిస్తున్న రాష్ట్రాలకు రాజకీయ పరిమితులు విఘాతం సృషిస్తున్నాయని సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. పక్షపాతంగా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీని కట్టడి చేయాల్సిన అవసరముందని రేవంత్ స్పష్టం చేశారు. 1976లో లోక్ సభ సీట్లు పెంచకుండానే డీ లిమిటేషన్ చేశారన్న రేవంత్.. ప్రధాని మోదీ సైతం ఆ తరహాలోనే లోక్ సభ సీట్లు పెంచకుండా దానిని చెపట్టాలని పట్టుబట్టారు. జనాభా ఆధారంగానే డీలిమిటేషన్ చేస్తే సౌత్ రాష్ట్రాలు తమ రాజకీయ గొంతుకను కోల్పోతాయని అన్నారు. తద్వారా సౌత్ ను సెకండరీ సిటిజన్లుగా ఉత్తరాది మారుస్తుందని ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జనాభా ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ ను అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ అన్నారు.
Also Read: KTR – Miss World 2025: మిస్ వరల్డ్ 2025 vs ఫార్ములా ఈ రేస్.. రెండింట్లో రాష్ట్రానికి ఏది బెటర్?
రాజకీయ ఉనికి కోల్పోతాం: సీఎం స్టాలిన్
అఖిల పక్ష భేటిలో మాట్లాడిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin).. ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ప్రస్తుత జనాభా పరంగా డీలిమిటేషన్ జరగకూడదన్న ఆయన దానిని తీవ్రంగా వ్యతిరేకించాలని ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు సూచించారు. పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గితే మన అభిప్రాయాలను వ్యక్తీకరించే బలం కూడా సన్నగిల్లుతుందని సీఎం స్టాలిన్ అన్నారు. అప్పుడు మన అనుమతి లేకుండానే చట్టాలు రూపొందుతాయని పేర్కొన్నారు. సొంత దేశంలోనే రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామని ఆందోళన వ్యక్తం చేశారు.
మన వాటా కోల్పోతాం: కేరళ సీఎం
అఖిల పక్ష భేటిలో పాల్గొన్న కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) మాట్లాడుతూ.. తాను కూడా డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎలాంటి చర్చలు లేకుండానే నియోజక వర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం భావిస్తోందన్న ఆయన.. అదే జరిగితే మనం డేంజర్ లో పడ్డట్లేనని అన్నారు. దేశ సంపదలో వాటాను కోల్పోతామని హెచ్చరించారు. కాబట్టి డీలిమిటేషన్ ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని అన్నారు.