Adwait Kumar Singh: జిల్లాలో వరదలు, పరిశ్రమ ప్రమాదాల వంటి విపత్తులు సంభవించినప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎంఏ) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణా రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌ల నిర్వహణపై అధికారులకు పలు దిశానిర్దేశాలు చేశారు. విపత్తుల సమయంలో వేగంగా స్పందించడం, వివిధ శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఇటీవల వాతావరణ మార్పుల వల్ల ఆకస్మికంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు.
Also Read: Adwait Kumar Singh: రుణాల పంపిణీ వేగవంతం చేయాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
ప్రమాదాలు జరిగినప్పుడు పాటించాలి
వరదలు సంభవించినప్పుడు ముందస్తు హెచ్చరికల జారీ, కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు, పునరావాస కేంద్రాల నిర్వహణ మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై పటిష్టమైన కార్యాచరణ ఉండాలని సూచించారు. పరిశ్రమలలో సంభవించే ప్రమాదాలను నివారించడానికి ప్రతి పరిశ్రమలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు పాటించాల్సిన ప్రామాణిక నిబంధనలపై అధికారులకు అవగాహన ఉండాలని, త్వరలోనే జిల్లాలో మాక్ డ్రిల్స్ నిర్వహించి యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల్లో విపత్తుల నివారణకు శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, రెవెన్యూ అదనపు కలెక్టర్ కే అనిల్ కుమార్, డీఎస్పీ తిరుపతి రావు, ఆర్ అండ్ బి ఈఈ భీములా నాయక్, సీపీఓ అశోక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

