Anganwadi Salary Hike: అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 18000 ఇవ్వాలని ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సిహెచ్. సీతామహాలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేసినట్లు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సిహెచ్.సీతామహాలక్ష్మి తెలిపారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సచివాలయంలో అందజేసినట్లు సీతామహాలక్ష్మి తెలిపారు. ఎన్నికల హామీ మేరకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామని తెలిపినట్లు వివరించారు.
Also Read: Black Jaggery: అధికారుల సహకారంతో జోరుగా నల్ల బెల్లం దందా.. ఎక్కడంటే..?
ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి
సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగానే అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 18000 చెల్లిస్తామని వివరించినట్లుగా చెప్పారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టులకు సంబంధించిన ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని కోరినట్లు తెలిపారు. పిఎఫ్, ఈఎస్ఐ గ్రాడ్యుటీతో పాటు ప్రమాద బీమా అంగన్వాడి టీచర్లు, ఆయాలకు వర్తింపజేయాలని రూ. 10 లక్షలు చెల్లించాలని కోరామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు అయ్యర్ 5%, పి ఆర్ 30% శాతం చెల్లిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని గుర్తుచేసినట్లుగా చెప్పారు.
టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ. లక్ష
అంగన్వాడి సెంటర్లు అద్దెలు, కూరగాయల బిల్లులు అడ్వాన్సుగా ఇవ్వడంతో పాటు లబ్ధిదారులకు మెనూ చార్జీలు పెంచి నాణ్యమైన సరుకులు సకాలంలో అందించాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, డిఎల్ఓ డ్యూటీలు, అదనపు పనులు రద్దు చేయాలని డిమాండ్ చేశామని చెప్పారు. జీవో ప్రకారం టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ. లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ను తక్షణమే చెల్లించాలని విజ్ఞప్తి చేసినట్లుగా సీతామహాలక్ష్మి తెలిపారు. 2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 తేదీ వరకు 24 రోజులు సమ్మె కాలపు జీతం బకాయి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ మేరకు ఈ బకాయిల చెల్లింపు కు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేసినట్లుగా సీతామహాలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సాయిశ్వరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ననుండూరి కరుణ కుమారి పాల్గొన్నారు.
Also Read: Jatadhara Movie: సుధీర్ బాబు ‘జటాధర’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?