Gadwal District: ప్రభుత్వ హాస్టల్ లో రాత్రి భోజనం వికటించి 52 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురైన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం ధర్మవరం బిసి బాలుర హాస్టల్ లో చోటు చేసుకుంది. వసతి గృహంలో రోజువారి మాదిరిగా మెనూ ప్రకారం విద్యార్థులకు శుక్రవారం రాత్రి భోజనంలో కాలిఫ్లవర్ తో పాటు సాంబార్ అందించారు. అనంతరం 52 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడడాన్ని హాస్టల్ సిబ్బంది గమనించారు. హాస్టల్స్ సిబ్బంది సమాచారంతో మూడు అంబులెన్స్ లతో పాటు పలు ప్రైవేట్ వాహనాలలో 32 మంది విద్యార్థులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య బృందం విద్యార్థుల ఆరోగ్య స్థితిని పరీక్షించారు. ఆరోగ్యం నిలకడగా ఉన్న విద్యార్థులకు స్థానిక వైద్యులతో వసతి గృహంలోనే చికిత్స అందించారు. జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్ సంతోష్ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నారు.
Also Read: Gadwal District: సెటిల్మెంట్లు అక్రమ వసూళ్లకు కేరాఫ్‌గా కేటిదొడ్డి పోలీస్ స్టేషన్.. ఎక్కడంటే..!
ఆసుపత్రిని సందర్శించిన అదనపు కలెక్టర్ నర్సింగ రావు, ఆర్డిఓ అలివేలు
బీసీ హాస్టల్ లో మెనూలో క్యాబేజీ సాంబార్ తో భోజనం చేసిన తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వెంటనే అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు, ఆర్డిఓ అలివేలు ఆసుపత్రిని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య స్థితిపై వాకబు చేశారు. రాత్రి భోజనంలో అపరిశుభ్రంగా ఉండిన క్యాబేజీ కర్రీ వల్లే విద్యార్థులకు అస్వస్థత చోటుచేసుకుందని విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
ఆహార నాణ్యతపై దృష్టి సారించని హాస్టల్ వార్డెన్ తో పాటు సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.డాక్టర్ నవీన్ చంద్ర, అశోక్ తదితరులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని, ప్రస్తుతం వారి కండిషన్ స్టేబుల్ గా ఉందని తెలిపారు. ఆరోగ్యం మెరుగైన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.
విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలి -ఏబీవీపీ నాయకులు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నాయకులు జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలో ఉన్న ధర్మవరం పాఠశాల బీసీ హాస్టల్ లో ఉన్న విద్యార్థుల్లో 52 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది. వెంటనే గద్వాలలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కు విద్యార్థులను తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి పరిషత్ నాయకులు వెంకటేష్, నరేష్, శ్రీహరి అక్కడికి వెళ్లి విద్యార్థుల పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది .
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
ఈ ఘటనకు సంబంధించి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మాట్లాడుతూ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడవక ముందే గురుకులాల్లో కావచ్చు వివిధ హాస్టల్లో కావచ్చు ఎంతోమంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్లు జరిగి వందమందికి పైగా విద్యార్థులు చనిపోయిన ప్రభుత్వం ఇప్పటివరకు సోయి లేకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతూనే ఉన్నారు. ఇప్పుడు గద్వాల జిల్లాలో జరిగిన ఫుడ్ పాయిజన్ లో విద్యార్థులకు జరగరానిది ఏదైనా జరిగితే దానికి కారణం స్థానిక వార్డెన్ సిబ్బందిదే. ఈ సమస్య పైన వెంటనే స్పందించి ఫుడ్ పాయిజన్ లాంటి సమస్యలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
