Zepto Free Delivery: Zepto పెద్ద నిర్ణయం – ఇకపై రూ.99 పైగా ఆర్డర్లకు ఉచిత డెలివరీ
భారతదేశంలోని ప్రముఖ “క్విక్ కామర్స్” ప్లాట్‌ఫారమ్ Zepto మరోసారి వినియోగదారులను ఆకట్టుకునే నిర్ణయం తీసుకుంది. కేవలం “10 నిమిషాల్లో డెలివరీ” అనే కొత్త కాన్సెప్ట్‌తో చిన్న స్టార్ట్‌ప్‌గా ప్రారంభమైన Zepto, ఇప్పుడు కోట్లాది భారతీయుల దైనందిన జీవితంలో ఒక భాగమైంది. గ్రోసరీలు, అవసరమైన వస్తువులు తక్షణమే ఇంటి వద్దకు చేరేలా చేసిన ఈ యాప్ ఇప్పుడు మరింత సౌకర్యాన్ని అందించబోతోంది.
కీలక నిర్ణయం తీసుకున్న Zepto
తాజాగా Zepto కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హ్యాండ్లింగ్ ఫీజులు, సర్జ్ ఛార్జీలు, రెయిన్ ఛార్జీలు వసూలు చేయబోమని అధికారికంగా ప్రకటించింది. అంటే, వినియోగదారులు ఆర్డర్ చేసే సమయంలో అదనపు రుసుముల భారం లేకుండా ఉత్పత్తులు అందుకోగలరు.
రూ.99 పైగా ఆర్డర్లకు ఉచిత డెలివరీ
Zepto చెప్పిన దాని ప్రకారం, ఇప్పుడు రూ.99 కంటే ఎక్కువ విలువ గల ఆర్డర్లు ఉచితంగా డెలివరీ చేస్తారు. అంటే పెద్ద ఆర్డర్ చేసేవారికి ఇకపై ఎలాంటి డెలివరీ ఛార్జీలు ఉండవు. అయితే రూ.99 కంటే తక్కువ విలువ గల ఆర్డర్లకు మాత్రం రూ.30 డెలివరీ ఫీజు వసూలు చేయనున్నారు.
పోటీదారులపై ఈ ప్రభావం పడుతుందా?
ఈ నిర్ణయం “10 నిమిషాల డెలివరీ మార్కెట్”లో గట్టి పోటీని తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే Blinkit, స్విగ్గీ ఇన్ స్టామార్ట్ , బిగ్ బాస్కెట్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లతో గట్టి పోటీని ఎదుర్కొంటున్న జెప్టో , వినియోగదారుల విశ్వాసాన్ని పెంచేందుకు ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
వినియోగదారులుకు ఇక లాభమే?
Zepto యాప్ ద్వారా తరచుగా ఆర్డర్ చేసే వినియోగదారులకు ఈ మార్పు పెద్ద ఊరటగా మారింది. గతంలో వర్షం లేదా ట్రాఫిక్ పరిస్థితుల్లో సర్జ్ లేదా రెయిన్ ఛార్జీలు కారణంగా బిల్లులు పెరగడం వినియోగదారులను అసంతృప్తికి గురి చేసేది. ఇకపై ఆ ఆందోళన అవసరం ఉండదు.
