BCCI Cash Reward: భారత ఉమెన్స్ క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలోనే నిలిచింది. మూడుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్‌ను గురువారం రాత్రి జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో సంచలనాత్మక రీతిలో ఓడించింది. జెమీమా రోడ్రిగేజ్, కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్ ఇద్దరూ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను ఫైనల్‌కు చేర్చారు. ఏకంగా 338 పరుగుల భారీ లక్ష్య చేధనలో గొప్ప పోరాటపటిమ కనబర్చారు. ఇక, ఆదివారం (నవంబర్ 2) నవీ ముంబై వేదికగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈసారి కప్ సాధించి చరిత్ర నెలకొల్పాలన్న గట్టి పట్టుదలతో భారత ప్లేయర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, హర్మన్‌ప్రీత్ కౌర్ సారధ్యంలోని జట్టు ఒక వరల్డ్ కప్ విజేతగా నిలిస్తే భారీ నజరానా దక్కడం ఖాయంగా (BCCI Cash Reward) కనిపిస్తోంది.
Read Also- Kasibugga Temple Tragedy: ప్రైవేటు ఆలయం అంటే ఏమిటి?, కాశీబుగ్గ తొక్కిసలాట ప్రభుత్వానికి సంబంధం లేదా?
భారీ మొత్తంలో నగదు బహుమతి అందించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. భారత ఉమెన్స్ జట్టు ట్రోఫీ సాధిస్తే, గతేడాది టీ20 మెన్స్ వరల్డ్ కప్ సాధించిన పురుషుల జట్టుతో సమానంగా రూ.125 కోట్ల రివార్డ్ ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. బీసీసీఐ మాజీ కార్యదర్శి, ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ జై షా ప్రతిపాదించిన ‘సమాన వేతనం’ (equal pay) విధానాన్ని అనుసరించి, భారీ నజరానా ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2017లో లార్డ్స్ వేదికగా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఉమెన్స్ చేతిలో భారత మహిళా జట్టు 9 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. అయినప్పటికీ బీసీసీఐ, ప్రతి క్రీడాకారిణికి రూ.50 లక్షల రివార్డ్ అందించింది. అప్పటి ప్రధాన కోచ్ తుషార్ ఆరోథే, ఇతర సహాయక కోచింగ్ సిబ్బందికి పెద్ద మొత్తంలో రికార్డులు ప్రకటించింది. భారత ఉమెన్స్ జట్టు ఒకవేళ వరల్డ్ కప్ గెలిచి, రూ.125 కోట్ల రివార్డ్ ప్రకటిస్తే, 2017తో పోల్చితే నజరానా ఏకంగా పది రెట్లు పెరిగినట్టు అవుతుంది.
Read Also- Champion teaser: ‘ఛాంపియన్’ టీజర్ లో శ్రీకాంత్ కొడుకు ఇరగదీశాడు.. చూశారా మరి..
మెన్స్ టీమ్‌కు రూ.125 కోట్లు
గతేడాది జరిగిన మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను భారత జట్టు ముద్దాడింది. ట్రోఫీలో గెలిచిన టీమ్‌లో భాగమైన ఆటగాళ్లు, కోచ్‌లు, వారి సహాయక సిబ్బంది అందరికీ కలిపి రూ.125 కోట్లు భారీ నజరానా అందించారు. పురుషుల టీమ్‌తో సమానంగా ఇప్పుడు అమ్మాయిలకు కూడా రివార్డు ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న ఓ ఉన్నతాధికారి స్పందిస్తూ, మెన్స్, ఉమెన్స్‌కు సమాన వేతనం చెల్లించడాన్ని సమర్థిస్తుందని స్పష్టం చేశారు. కాబట్టి, మన అమ్మాయిలు వరల్డ్ కప్ గెలిస్తే, వారికి అందించే రివార్డు మెన్స్ వరల్డ్ కప్ సాధించిన జట్టుకు సమానంగా ఉండాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. అయితే, కప్ గెలవక ముందే ఈ ప్రకటన చేయడం సరికాదని స్పష్టం చేశారు. దీనిని బట్టి ఉమెన్స్ జట్టు వరల్డ్ కప్ గెలిస్తే, రూ.125 కోట్ల నజరానా ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది.
