Kasibugga-Stampede (Image source Twitter)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Kasibugga Temple Tragedy: ప్రైవేటు ఆలయం అంటే ఏమిటి?, కాశీబుగ్గ తొక్కిసలాట ప్రభుత్వానికి సంబంధం లేదా?

Kasibugga Temple Tragedy: ఒకటా.. రెండా.. హిందూ దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనలు జరిగి, ప్రాణాలు కోల్పోతున్న హైందవుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే, మాకెందుకులే అనుకుంటున్నారో?, లేక, ఏమీ కాదులే! అని భావిస్తున్నారో?, కానీ, లెక్కలెనన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్క 2025లోనే ఆంధ్రప్రదేశ్‌లోని రెండు పవిత్ర పుణ్య క్షేత్రాల్లో విషాదకర తొక్కిసలాటలు జరిగాయి. జనవరి 8న తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల కౌంటర్ వద్ద జరిగిన ఘోర తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం (నవంబర్ 1) కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 10 మందికిపై ప్రాణాలు (Kasibugga Temple Tragedy) కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ రెండు దుర్ఘటనలు శ్రీవారి ఆలయాల్లోనే, అందునా ముఖ్యమైన పర్వదినాల్లో జరిగాయి. ఏపీలోని ఆలయాల్లోనే కాదు, ఈ ఏడాది జూన్ నెలలో పూరీజగన్నాథ రథయాత్ర సందర్భంలో పూరీలో, మహాకుంభమేళా సందర్భంగా జనవరిలో ప్రయాగ్‌రాజ్‌లో, జులై నెలలో హరిద్వార్‌లో ఉన్న మానస దేవి ఆలయంలో.. ఇవన్నీ 2025లో జరిగినవే. అన్ని తొక్కిసలాటల్లోనూ భక్తులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కళ్ల ముందే ఇన్ని ప్రమాదాలు జరిగినా, జరుగుతున్నా?, పాలకులు, ప్రభుత్వాలు ఏమైనా నేర్చుకున్నాయా?, ఏం చర్యలు తీసుకుంటున్నాయన్న ప్రశ్న, ‘కాశీబుగ్గ విషాదం’ వేళ మరోసారి తలెత్తుతోంది.

ప్రభుత్వానికి సమాచారం లేదు..

ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయానికి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. భక్తులు కిక్కిరిసిపోవడం ఈ తొక్కిసలాటకు కారణమైంది. మృతుల్లో దాదాపు అందరూ మహిళలే. అయితే, ఈ దుర్ఘటన ఒక ప్రైవేటు ఆలయంలో జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చాలా స్పష్టమైన ప్రకటన చేసింది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందిస్తూ, ప్రమాదం జరిగిన ఆలయం ప్రభుత్వ నిర్వహణలో లేదన్నారు. ఈ ప్రైవేట్ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో లేదని, హరిముకుంద్‌పండా అనే ఒక వ్యక్తి తన 12 ఎకరాల సొంత భూమిలో, సొంత డబ్బుతో నిర్మించుకున్న ప్రైవేటు దేవాలయమని విడమర్చి చెప్పారు. ఏకాదశి సందర్భంగా భక్తులు పెరిగారని, అయితే, తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం కానీ, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం సదరు వ్యక్తి చేయలేదంటూ.. ప్రభుత్వానికి సంబంధం లేదంటూ ఆమడ దూరం జరిగారు.

Read Also- Jubliee Hills Bypoll: కాంగ్రెస్‌ను గెలిపించండి.. బీఆర్ఎస్ చెంప చెల్లుమనాలి.. మంత్రి పొంగులేటి

చేతులు దులుపుకున్న చంద్రబాబు, పవన్?

ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ఆలయానికి భక్తుల రద్దీ విషయంపై పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే బందోబస్తు పెట్టేవాళ్లమని ప్రకటన చేశారు. ఇక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఈ ఆలయంలో చోటుచేసుకున్న విషాదకర ఘటనపై ప్రభుత్వం విచారణ చేపడుతుందని అన్నారు. ఈ స్పందన బట్టి చూస్తే, కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన నింద ప్రభుత్వంపై పడకుండా చూసుకోవడం, ఎలాంటి సంబంధం లేదనే అభిప్రాయం చెప్పకనే చెప్పినట్టు అయింది. ఇదొక ప్రైవేటు ఆలయం అంటూ కూటమి పార్టీల శ్రేణుల సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Read Also- LPG price 01 November 2025: సామాన్యులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన సిలిండర్ ధరలు.. ఎంత తగ్గిందంటే?

ప్రైవేటు ఆలయం అంటే ఏంటి?

ఒక కుటుంబం, లేదా ఓ ప్రైవేటు వ్యక్తి సొంతంగా నిర్మించి, ప్రధానంగా తమ కుటుంబ పూజా కార్యక్రమాల కోసం ఉపయోగించే ఆలయాలను ప్రైవేటు ఆలయాలు, లేదా ఫ్యామిలీ ఆలయాలు అని అంటారు. అలాంటి ఆలయాల నిర్వహణను సాధారణంగా సంబంధిత వ్యక్తులే చూసుకుంటారు. అయితే, కొన్ని పరిస్థితుల్లో ప్రైవేటు ఆలయాలు కూడా ప్రభుత్వ పర్యవేక్షణకు లోబడి ఉండాల్సి ఉంటుంది. ప్రైవేటు ఆలయాలే అయినప్పటికీ, భక్తుల దర్శనం కోసం నిర్మించినవారు అనుమతి ఇస్తే, అక్కడ శాంతిభద్రతలు, పౌర చట్టాలు అమలును ప్రభుత్వమే చూసుకోవాల్సి ఉంటుందని చట్టాలు చెబుతున్నాయి. ఆలయం వద్ద శాంతిభద్రతలు చట్టాలకు లోబడే ఉండాలి. అయితే, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పెద్ద ఆలయాల మాదిరిగా రోజువారీ పాలన, నిధుల వినియోగం, అర్చకుల నియామకాలు వంటి అంశాల విషయంలో ప్రభుత్వానికి ప్రత్యక్ష నియంత్రణ ఉండదు.

ఏకాదశి వేళ భక్తుల రద్దీ తెలియదా?

ఏకాదశి సందర్భంగా భక్తులు ఎంత పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలి వెళతారో ప్రభుత్వానికి తెలియదా? అనే ప్రశ్న కూటమి ప్రభుత్వానికి ఎదురవుతోంది. కార్తీక మాసం వేళ రాష్ట్రంలోని ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువయ్యిందన్నది అందరికీ తెలుసు. మాసంలో అత్యంత పవిత్రమైన ఏకాదశి నాడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు తీసుకోవాలి కదా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయం మే నెలలోనే ప్రారంభమైందంటూ ప్రభుత్వాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారనే మాట విమర్శ కూడా వినిపిస్తోంది. కాశీబుగ్గ తొక్కిసలాట తర్వాతైనా, ఒక్క ఏపీ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలు, ఇతర మతాలకు చెందిన ప్రార్థనా మందిరాల వద్ద పకడ్బందీ చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మరి, ప్రభుత్వాలు, పాలకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి!.

Just In

01

MLA Kadiyam Srihari: మొంథా ఎఫెక్ట్ పై జిల్లాస్ధాయి స‌మీక్ష‌.. కీలక అంశాలపై ఎమ్మల్యే కడియం చర్చ

KK survey: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కేకే సర్వే వచ్చేసింది.. గెలుపు ఎవరిదంటే?

Yadadri Collector: జిల్లా కలెక్టర్‌ చిత్రపటానికి పాలాభిషేకం.. ఆయన చేసిన మంచిపని ఏంటో తెలుసా?

Biker First Lap: ‘గెలవడం గొప్ప కాదు.. చివరిదాకా పోరాడటం గొప్ప’.. ‘బైకర్’ గ్లింప్స్ ఎలా ఉందంటే?

Khammam District: ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తలదూర్చరా?.. అధిష్టానం పై క్యాడర్ అలక