Jubliee Hills Bypoll: పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతిన్న బీఆర్ఎస్ నాయకులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా శనివారం శివమ్మ, పాపిరెడ్డి హిల్స్‌లో మంత్రి పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గతంలో పీజేఆర్ ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత ఇంతవరకు మళ్లీ అటువంటి అభివృద్దే లేదని అన్నారు. ధనిక తెలంగాణాను అప్పుల్లో ముంచిన గత పాలకులు.. పేదలకు ఇండ్లు కట్టిస్తే కమీషన్లు రావని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చేపట్టారని ఆరోపించారు.
పదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది చేయలేని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కేవలం 20 నెలల్లో కాంగ్రెస్ ఏమీ చేయలేదంటూ సరిపోల్చుతున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. వారి అజ్ఞానానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత తాను ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చి పేదలకు ఇండ్లపట్టాలు, ఇండ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు విడతల్లో పేదలకు ఇండ్లు మంజూరు చేస్తూ ఇండ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల చొప్పున అందజేస్తుందని తెలిపారు. పదేళ్లు రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గాన్ని దోచుకుతిన్న బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదని, బిఆర్ఎస్ బిజెపి ఒకతాను ముక్కలేనని అన్నారు.
Also Read: ICC Women’s World Cup 2025 Final: రేపే ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్.. దక్షిణాఫ్రికాతో టీమిండియా ఢీ.. బలాబలాలలో ఎవరిది పైచేయి!
గత పార్లమెంటు ఎన్నికల నుంచి బీఆర్ఎస్ – బీజేపీ మధ్య పొత్తు ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు తధ్యమని అందువల్లే బీఆర్ఎస్ మాజీ మంత్రులు అక్కసుతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆ మాజీ మంత్రులు భాషను సంస్కరించుకోవాలని పొంగులేటి హితవు పలికారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతల చెంప చెళ్లుమనేలా కాంగ్రెస్ అభ్యర్ధికి మెజార్టీ ఇవ్వాలని కోరారు. ఎన్నికలు తర్వాత ఈ నియోజకవర్గానికి తిరిగి వస్తానని.. సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి పొంగిలేటి హామీ ఇచ్చారు. ఈ పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను తీరుస్తామని భరోసా కల్పించారు.
