ICC Women’s World Cup 2025 Final: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీ (ICC Women’s Cricket World Cup 2025) తుది అంకానికి చేరుకుంది. ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా.. ఆదివారం జరిగే ఫైనల్స్ లో దక్షిణాఫ్రికా (South Africa) జట్టుతో తలపడబోతోంది. ముంబయిలోని డి.వై. పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఈ తుదిపోరు జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫైనల్స్ లో తలపడబోయే జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి? ఈ జట్ల గత రికార్డులు ఏం చెబుతున్నాయి? టీమిండియాకు కలిసొచ్చే అంశాలేంటి? ఇప్పుడు చూద్దాం.
వరల్డ్ కప్ హిస్టరీ..
సెమీస్ లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 338 లక్ష్యాన్ని.. భారత మహిళల జట్టు విరోచితంగా ఛేదించింది. జెమిమా రోడ్రిగ్స్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ (127*) ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో భారత్ ఫైనల్స్ లో అడుగుపెట్టింది. మహిళల ప్రపంచ కప్ లో ఫైనల్స్ కు చేరడం భారత్ కు ఇది మూడోసారి. 2005, 2017లో టీమిండియా ఫైనల్స్ ఆడింది. కానీ ట్రోఫీని గెలవడంలో విఫలమైంది. దీంతో ఈసారి ఎలాగైన భారత్ కు తొలి కప్పు ఇవ్వాలని పట్టుదలగా ఉన్నారు. సౌతాఫ్రికా విషయానికి వస్తే.. ఆ జట్టు మెుదటిసారి ఫైనల్ ఆడబోతోంది. వారు గువాహటిలో జరిగిన సెమీ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ పై 125 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టారు.
హాట్ ఫేవరెట్‌గా టీమిండియా..
ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. స్వదేశంలో ఫైనల్స్ జరుగుతుండటం భారత్ కు ప్రధాన బలంగా చెప్పవచ్చు. దక్షిణాఫ్రికాతో పోలిస్తే పిచ్ పరిస్థితులు భారత్ కే కొద్దిగా అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. దీనికి తోడు ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం సాధించడం ద్వారా.. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టులో విశ్వాసం అమాంతం పెరిగిపోయింది. అయితే దక్షిణాఫ్రికా సైతం చాలా బలంగా కనిపిస్తోంది. లీగ్ దశలో భారత్ ను ఓడించడం ఆ జట్టుకు అడ్వాంటేజ్. మెుత్తంగా రేపు జరిగే ఫైనల్స్ రసవత్తరంగా ఉంటుందనడంలో సందేహం లేదని క్రీడా నిపుణులు చెబుతున్నారు.
గత వన్డే రికార్డులు
భారత్, దక్షిణాఫ్రికా ఇప్పటివరకూ 34 వన్డేల్లో ముఖాముఖీగా తలపడ్డాయి. అందులో భారత్ 20 మ్యాచుల్లో విజయం సాధించగా.. దక్షిణాఫ్రికా 13 గెలిచింది. ఒక మ్యాచ్ మాత్రం ఫలితం రాకుండా డ్రాగా ముగిసింది. దక్షిణాఫ్రికాతో చివరిగా ఆడిన లీగ్ దశ మ్యాచ్ లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా 252 పరుగులు లక్ష్యాన్ని 3 వికెట్ల తేడాతో ఛేజ్ చేసింది. సౌతాఫ్రికా కెప్టెన్ నడీన్ డి క్లెర్క్ 54 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
గత 5 మ్యాచ్‌ల ప్రదర్శన
వరల్డ్ కప్ లో గత 5 మ్యాచ్ ల ప్రదర్శన చూస్తే దక్షిణాఫ్రికాదే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. భారత్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లపై విజయం సాధించింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా (లీగ్ దశలో) ఓటమి పాలైంది. బంగ్లాదేశ్ మ్యాచ్ లో వర్షం కారణంగా ఫలితం రాలేదు. ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే.. ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లపై ఆ జట్టు గెలుపొందింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో మాత్రం 7 వికెట్ల తేడాలో ఓటమిపాలైంది. అయితే దక్షిణాఫ్రికాకు చెక్ పెట్టిన ఆసీస్ ను ఓడించి.. భారత్ ఫైనల్లో అడుగుపెట్టడం విశేషం.
Also Read: LPG price 01 November 2025: సామాన్యులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన సిలిండర్ ధరలు.. ఎంత తగ్గిందంటే?
ఫైనల్లో విజయం ఎవరిది?
ఫైనల్స్ లో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ చేస్తే.. 260-290 పరుగులు సాధించే అవకాశం కనిపిస్తోంది. అదే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తే.. 270-300 పరుగులు చేయవచ్చని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఫామ్, హోమ్ కండిషన్స్ ను బట్టి ఈ మ్యాచ్ లో భారత్ 4-5 వికెట్లు తేడాతో లేదా 25-35 పరుగుల డిఫరెన్స్ తో గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు క్రీడా వర్గాలు అంచనా వస్తున్నాయి. మరి ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				