Viral News: ఈ ఫొటోను కాస్త నిశితంగా గమనించండి.. వావ్ అచ్చంగా పాములాగానే మెలికలు తిరిగి ఉంది కదూ..! బ్రిడ్జ్ మాత్రం అదిరిపోయింది కానీ.. అంతా తలనొప్పిగానే అనిపిస్తోంది కదా..! కానీ.. సెకన్లలోనే చచ్చిపోతారు అంతే. ఇప్పుడీ బ్రిడ్జ్ గురించే యావత్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన పరిస్థితి. ఇంతకీ ఈ వంతెనకు ఉన్న కథా కహానీ ఏమిటి? ఇప్పుడే ఎందుకు చర్చకు దారితీసింది..? ఎందుకనీ అస్తమాను వార్తల్లో నిలుస్తోంది..? ప్రమాదాలు జరగడం వెనుక కారణాలేంటి? ఇవన్నీ కాదు.. ఈ బ్రిడ్జ్ ఎక్కడుంది? ఎందుకు నిర్మించాల్సి వచ్చింది..? ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు స్వేచ్ఛ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం రండి..!
Read Also- Radha Manohar Das: లైవ్‌లో రచ్చ రచ్చ చేసిన రాధా మనోహర్.. నవ్వులే నవ్వులు!
ఇదీ అసలు సంగతి..
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఐష్‌బాగ్ స్టేడియం సమీపంలో నిర్మించిన 90 డిగ్రీల మలుపులతో కూడిన రైల్వే వంతెన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఈ వంతెన గురించి ప్రజలు, వాహనదారుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే దీని గురించి ప్రజలు ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే పాములా మెలికలు తిరిగిన మరో వంతెన వెలుగుచూసింది. సుభాష్ నగర్‌లోని ఈ వంతెన అంతకుమించే వివాదాస్పదమైంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో సుమారు రూ.40 కోట్ల వ్యయంతో వంతెనను నిర్మించారు. గత రెండేళ్లుగా వినియోగంలో ఉన్నప్పటికీ, దాని డిజైన్ లోపాలు నిత్యం ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఈ వంతెన ప్రారంభమైన తర్వాత కేవలం 8 గంటల్లోనే రెండు ప్రమాదాలు జరగడం గమనార్హం. ఇందుకు కారణం డివైడర్లు సరిగా లేకపోవడం, ఎత్తు తక్కువగా ఉండటమే అని స్థానికులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. డిజైన్, భద్రతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ డిజైన్లలో లోపం వల్లనే వాహనదారుల్లో గందరగోళాన్ని సృష్టించి, ప్రమాదాలకు దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లోపభూయిష్ట నిర్మాణాలతో ప్రభుత్వ ధనం వృథా అయ్యిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ మాత్రం ఉపయోగపడని లేదా ప్రమాదకరమైన వంతెనలను పునర్నిర్మించడం.. మార్పులు చేయడం మరింత వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడటానికి ప్రభుత్వం, సంబంధిత ఏజెన్సీలు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కామెంట్ల గురించి అయితే మాటల్లో చెప్పలేం.. రాతల్లో రాయలేం అలా ఉంది పరిస్థితి.
కారణాలేంటి..?
సుభాష్ నగర్ ఆర్‌వోబీ మైదా మిల్లు-ప్రభాత్ పెట్రోల్ పంప్ మధ్య కీలక లింక్‌గా ఈ బ్రిడ్జ్ ఉంది. భోపాల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు సైతం ఇదే మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ బ్రిడ్జి ట్రాఫిక్ రద్దీని తగ్గించినప్పటికీ.. ఇటీవలే జరిగిన కొన్ని సంఘటనలు బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదకరమైన లోపాలను వెలుగులోకి తెచ్చాయి. ఈ బ్రిడ్జ్ వరుసగా నాలుగు మెలికలు తిరిగి ఉండటంతో వాహనాలు సైతం కొన్ని నిమిషాల్లోనే పలుమార్లు మెలికలు తిరిగాల్సి వస్తోంది. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంత నిదానంగా వెళ్లినప్పటికీ మలుపుల వద్ద నియంత్రణకోల్పోయి ప్రమాదాల బారినపడుతున్నట్లు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. వేగంగా వెళ్తున్నప్పుడు ఈ మలుపుల వద్ద నియంత్రణ కోల్పోయే అవకాశాలు ఎక్కువ. ఇది వాహనదారులకు అకస్మాత్తుగా వచ్చే మార్పులు, వాటిని అంచనా వేయడం కష్టంగా మారుతున్నట్లుగా చెబుతున్నారు. వంతెనపై డివైడర్లను ప్రమాదకరమైన రీతిలో, ముఖ్యంగా వాహనదారులు గుర్తించలేని ప్రదేశాల్లో అమర్చడం.. వాటి ఎత్తు తక్కువగా ఉండటంతో రాత్రిపూట లేదా వర్షం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అవి కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికితోడు సరైన లైటింగ్ లేకపోవడం, హెచ్చరిక బోర్డులు సరిగా లేకపోవడంతో ఈ బ్రిడ్జ్ డిజైన్‌లో లోపాలు క్లియర్ కట్‌గా కనిపిస్తున్నాయి. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోతే సెకన్ల వ్యవధిలోనే చనిపోతారంటూ ప్రజలు, వాహనదారులు చర్చించుకుంటున్నారు.
Read Also- Weight Loss: బరువు తగ్గాలనుకునేవారికి కొత్త ట్రిక్.. పొట్ట మటుమాయం!
ప్రమాదాలు ఇలా..!
ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయనే విషయానికొస్తే.. ఒక కారు వేగంగా ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొని గాలిలో పల్టీలు కొట్టింది. ఇందులో కారులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ప్రమాదంలో స్కూల్ వ్యాన్ అదే డివైడర్‌ను ఢీకొని దెబ్బతింది. ఇది వర్షం కారణంగా డ్రైవర్‌కు డివైడర్ కనిపించకపోవడం వల్ల జరిగిందని వాహనదారులు చెబుతున్నారు. ఇలాంటి వంతెన డిజైన్లు అత్యంత ప్రమాదకరమని, వీటి నిర్మాణం వెనుక సరైన ప్రణాళిక, ఇంజినీరింగ్ ప్రమాణాలు కొరవడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ వ్యయంతో నిర్మించినప్పటికీ, ప్రజల భద్రతను విస్మరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఈ వివాదాస్పద వంతెనల విషయంలో విచారణకు ఆదేశించి, బాధ్యులపై చర్యలు తీసుకున్నప్పటికీ, భవిష్యత్తులో కూడా మరిన్ని ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా ప్రజాధనం వృథా కావడం, ప్రజల ప్రాణాలకు ముప్పు కలగడం తప్ప పైసా ప్రయోజనం లేదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ వంతెనలను తక్షణమే పునఃరూపకల్పన చేసి, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మార్చాల్సిన అత్యవసరం ఎంతైనా ఉన్నది. ప్రభుత్వం ఇకనైనా వీలైనంత త్వరగా మేల్కొని.. తక్షణ చర్యలు తీసుకుంటే ప్రజల ప్రాణాలను కాపాడినట్లుగా ఉంటుంది.
Read Also- CM Pushkar Dhami: వరి నాట్లేసిన ముఖ్యమంత్రి.. సడన్‌గా ఇలా మారిపోయారేంటి?