Police Misconduct: కొంతమంది పోలీసు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం (Police Misconduct) చేస్తున్నారు. పౌరుల గోప్యతను గౌరవించి, రక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్లే నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. అనైతికంగా వ్యక్తిగత వివరాలను తెలుసుకోవడం, వాటిని తమ స్వార్థం కోసం వాడుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటి మరో పోలీసు బాగోతం గురుగ్రామ్‌లో బయటపడింది. 50 ఏళ్ల వయసున్న ఓ మహిళా కంటెంట్ క్రియేటర్ కదలికలపై ఓ పోలీస్ ఆఫీసర్ నిఘా పెట్టాడు. ఆమె ఎక్కడికి వెళ్లేది, ఎంత సమయం గడిపేది.. ఇలా ప్రతి ఒక్క కదలికను గుర్తించాడు. కొంతకాలం గమనించిన తర్వాత వేధింపులు, అవాంఛిత చర్యలకు పాల్పడడం మొదలుపెట్టాడు. తనకు ఎదురైన పరిస్థితిపై సదరు ఇన్‌ఫ్లూయెన్సర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.
సెప్టెంబర్ 14న రాత్రి 12:45 సమయంలో తాను ఇంటికి తిరిగి వచ్చానని, ఆ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్‌కు ఓ వ్యక్తి కామెంట్ చేశాడని, తన కారు వివరాలు, రూట్, వచ్చిన దారి తెలుసంటూ చెప్పాడని శివాంగి వివరించారు. మొదట ఎవరో ఒక సాధారణ ఫాలోవర్ అనుకున్నానని, కానీ, కొంతసేపటి తర్వాత తనను తాను పోలీస్‌గా ఆ వ్యక్తి పరిచయం చేసుకున్నాడని ఆమె వివరించారు. తొలుత మహిళా పోలీసునని చెప్పిన అతడు, ఆ తర్వాత మగ పోలీస్ అని అంగీకరించాడని వివరించారు. ఒక మహిళగా ఫేక్ ఐడీని ఉపయోగిస్తున్నట్లు ఒప్పుకున్నాడని శివాంగి చెప్పారు.
‘‘ ఒక వ్యక్తి నా కారు, లోకేషన్, నేను ఎక్కడికి వెళ్తున్నానో అన్నింటినీ ట్రాక్ చేశాడు. మొదట పోలీస్ మహిళగా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత పురుష పోలీస్ అని చెప్పాడు. ఇంకా దారుణం ఏంటంటే, ఒక పోలీస్‌నని అంగీకరించి, ఇష్టపడడంతోనే నా వివరాలు ట్రాక్ చేస్తున్నట్టు మెసేజ్ చేశాడు’’ అని శివాంగ పేశ్వానీ వాపోయింది. 50 ఏళ్ల వయసున్న తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇక యువతుల సంగతి ఏంటి? అని ఆమె ప్రశ్నించారు. తనకు ఎదురైన పరిస్థితిపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వీడియో ద్వారా వివరించిన ఆమె, గురుగ్రామ్ సైబర్ పోలీసులను ట్యాగ్ చేస్తూ విషయాన్ని వివరించింది.
నిందిత పోలీస్ ఆఫీసర్ తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించాడని, ఒక ఫ్రెండ్‌గా ఉంటానంటూ దగ్గరయ్యే ప్రయత్నం చేశాడని శివాంగి వివరించింది. ఈ వ్యవహారంతో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని అన్నారు. నిందిత పోలీస్ చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను కూడా ఆధారాలుగా సమర్పించానని అన్నారు. ‘‘ ఫిర్యాదు ఆధారంగా కొన్ని రోజుల తర్వాత నిందిత పోలీస్‌ని ఉన్నతాధికారులు ట్రేస్ చేశారు. నిందితుడితో పాటు నన్ను కూడా స్టేషన్‌కు పిలిపించారు. అయితే, నిందిత పోలీస్‌కు ఎలాంటి చెడు ఉద్దేశం లేదన్నారు. కావాలంటే ఆ వ్యక్తిని బ్లాక్ చేసి ఉండొచ్చు కదా అని నాపైనే అనుమానాస్పదంగా స్పందించారు’’ అని వీడియోలో శివాంగి పేశ్వానీ వివరించారు.
Read Also- Norma Movie: అత్తతో అల్లుడి రహస్య బంధం.. ఊపేస్తున్న సినిమా.. సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్!
తన వయసులో ఉన్న మహిళలకే ఇలాంటివి పరిస్థితి ఎదురైతే, ఇక, యువతులు ఎంతటి భయంతో బతుకుతారు? అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తన వ్యక్తిగత వ్యవహారంగా చూడకుండా అధికార దుర్వినియోగానికి, మహిళలరగ భద్రత కల్పించాల్సిన అవసరానికి సంబంధించిన సమస్యగా చూడాలని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై అధికారికంగా ఫిర్యాదు నమోదయిందని, ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో ఉందని వివరించారు. కాగా, శివాంగి పేశ్వానీ పోస్టుపై గురుగ్రామ్ సైబర్ పోలీస్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.