Norma Movie: సినీ ఇండస్ట్రీలో ట్రెండ్‌లు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేక్షకుల అభిరుచులు, సరికొత్త టెక్నాలజీ హంగులను అందిపుచ్చుకొని ఆడియెన్స్‌ను మెప్పించే సినిమాల కోసం మేకర్స్ పరితపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సరళ కనిపిస్తోంది. ఈక్రమంలో, దక్షిణాసియా దేశమైన ఇండోనేషియాలో ఈ మధ్యకాలంలో సరికొత్త ట్రెండ్ మొదలైంది. సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా, ట్రెండింగ్‌గా మారి జనాల్లో చర్చనీయాంశమైన కథనాలు.. సినిమా కథలుగా మారిపోయి తెరకెక్కుతున్నాయి. ఆ కోవకు చెందుతుంది ‘నోర్మా’ (Norma Movie) అనే ఇండోనేషియా మూవీ. కొన్ని నెలలక్రితం విడుదలైన ఈ సినిమా ఇండోనేషియా సినీ అభిమానులను ఊపేస్తోంది. దేశమంతా ఈ మూవీ గురించి చర్చించుకుంటున్నారు. సినీ అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్న ‘నోర్మా’ సినిమా 2022లో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా చక్కర్లు కొట్టిన ఓ నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. సంతోషంగా సాగిపోతున్న ఓ జంట దాంపత్య జీవితంలో అల్లుడు, అత్త (భార్య తల్లి) మధ్య ఏర్పడిన రహస్య సంబంధం చిచ్చుపెడుతుంది. బాధితురాలైన భార్య ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంది అనేది సినిమా కథ.
వైరల్‌గా మారిన యదార్థ ఘటన
సాధారణంగా అయితే ఇలాంటి డ్రామాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. వారు సినిమాను ఆదరిస్తారు. కానీ, దేశవ్యాప్తంగా ‘నోర్మా’ సినిమా చర్చనీయాంశంగా మారడానికి యధార్థ ఘటన కావడం, అందులోనూ సోషల్ మీడియాలో వైరల్‌గా నిలిచిన కథాంశం కావడం సంచలనంగా మారడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. 2022లో ఇండోనేషియాలోని జావా ద్వీపంలోని ఈ యధార్థ ఘటన జరిగింది. సెరాంగ్ సిటీకి చెందిన నోర్మా రిస్మా అనే యువతి, తన భర్త, తల్లి మధ్య ఉన్న శారీరక సంబంధాన్ని ‘టిక్‌టాక్’ వీడియో ద్వారా బయటపెట్టింది. గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోకు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. వార్తల్లో కూడా మార్మోగిపోయింది. చివరకు నోర్మాకు సినిమా ఆఫర్ కూడా దక్కింది. ఒక్క ఇండోనేసియాలోనే కాకుండా దక్షిణాసియా అంతటా ఈ మూవీ దుమ్మురేపుతోంది. నోర్మా సినిమా ఈ ఏడాది మార్చి నెలలో థియేటర్లలో విడుదలైంది. ఆగస్టు నెలలో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది. ఇండోనేషియాతో పాటు మలేషియా, సింగపూర్ వంటి మలయ్, ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశాల్లో విపరీతమైన ప్రేక్షక ఆదరణ పొందుతోంది.
డైరెక్టర్లకు సక్సెస్ ఫార్ములా
నోర్మా సినిమా హిట్ సరళని పసిగట్టిన ఇండోనేషియన్ దర్శకులు సినిమాల విజయాలకు ఒక సరికొత్త సక్సెస్ ఫార్ములాను గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన స్కాండల్స్ (తప్పుడు పనులు) ఆధారంగా సినిమాలు చిత్రీకరించడమే వారి విజయమంత్రంగా మారిపోయింది. ఈ ఏడాది జూన్ నెల వరకు ఇండోనేషియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిన ‘కేకేఎన్ డి డెసా పెనరి’ (KKN di Desa Penari”) కూడా యధార్థ ఘటన ఆధారంగా చిత్రీకరించారు. 2022లో ఆరుగురు యూనివర్సిటీ విద్యార్థులను పీడించే ప్రేతాత్మ కథ ఆధారంగా హర్రర్ సినిమాగా దీనిని తెరకెక్కించారు. 2022లో ఈ వార్త ఎక్కువగా ఎక్స్‌లో వైరల్ అయింది. ఇక, ఎక్స్‌లోనే 2003లో వైరల్ అయిన మరో కథనం ఆధారంగా ‘సెవు డినో’ (Sewu Dino) అనే మరో హార్రర్ మూవీ సినిమాగా రూపుదిద్దుకుంది. ఒక్క హర్రర్ జోనర్ మాత్రమే కాదు, వివాహేతర సంబంధాల వంటి సంచలనాత్మక వ్యవహారాలపై రూపొందిన సినిమాలు కూడా విపరీతమైన ప్రేక్షక ఆధరణ పొందుతున్నాయి. ఒక వ్యక్తి తన భార్య చెల్లెలితో పెట్టుకున్న రహస్య సంబంధంపై తీసిన ‘ఇపర్ అదాలహ్ మౌత్ (2024), మోసపూరిత భర్త కారణంగా చిన్నాభిన్నమైన కుటుంబ కథాంశంతో రూపొందిన ‘లయంగ్ పుటస్’ (Layangan Putus-2022) డ్రామా సిరీస్ కూడా ఓ టిక్‌టాక్ కథనం నుంచే స్ఫూర్తి పొందింది.
మొత్తంగా నిషిద్ధ కట్టుబాట్లకు సంబంధించిన యధార్థ ఘటనలు ఇండోనేషియా సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారి విజయాలు సాధిస్తున్నాయి. నిజానికి ఇలాంటి చర్యలు ఇండోనేషియాలో నేరం కింద పరిగణిస్తారు. జైలుశిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి ఇండోనేసియాలో కొత్త క్రిమినల్ కోడ్ అమల్లోకి రానుంది. అత్యంత సంప్రదాయబద్ధంగా ఉండే కొన్ని ప్రావిన్సుల్లో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న జంటలను బహిరంగంగా దోషిగా గుర్తించి కొట్టే (public flogging) శిక్షలు కూడా అమలులో ఉన్నాయి.
Read Also- Swiggy New Features: పండుగ సీజన్‌లో రైలు ప్రయాణాలు చేసేవారికి స్విగ్గీ గుడ్‌న్యూస్
ఇంతకీ నోర్మా కథనం ఏంటంటే..
నోర్మా మూవీలో బాధితురాలు అయిన భార్య కోణంలో సినిమా కథనం కొనసాగుతుంది. నిజజీవితం మాదిరిగానే నోర్మా తన స్వస్థలమైన సెరాంగ్ నగరంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తుంటుంది. తన భర్త, తల్లి మధ్య సంబంధాన్ని గుర్తించాక ఆమె ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంది అనేది కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమాలో, యధార్థ ఘటనలో నోర్మా భర్తకు (ఇప్పుడు మాజీ భర్త) 9 నెలలు, తల్లి రిహానాకు 8 నెలల జైలుశిక్ష పడింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో నోర్మా మాట్లాడుతూ, తన దగ్గరుండే వ్యక్తులే తనన ఎలా మోసం చేస్తున్నారని బాధపడ్డానని చెప్పారు. ఇలాంటి బాధ తనకు మాత్రమే వచ్చిందా? అని అనుకున్నానని, కానీ, తన కథ చెప్పగానే, ఇదే అనుభవం ఎదురైన ఎంతోమంది ఉన్నారని తెలిసిందని ఆమె పేర్కొన్నారు. జీవితంలో భర్తలు మోసం చేసిన మహిళలకు ఈ సినిమా ద్వారా ఆమె సందేశం, ధైర్యం ఇచ్చారు. మహిళలు తమకు ఎదురయ్యే వైవాహిక సంబంధాల హింసపై బహిరంగంగా మాట్లాడే దిశగా ఒక చిన్న అడుగు అని సినిమా డైరెక్టర్ వ్యాఖ్యానించారు. ఈ తరహా సినిమాల ధోరణి సరికాదని మరికొందరు నిపుణులు సూచిస్తున్నారు. సమాజంపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.