Modi announcement: యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi announcement) ఆదివారం సాయంత్రం 5 గంటలకు కీలకమైన ప్రకటన చేశారు. జీఎస్టీ సంస్కరణలు సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఈ మేరకు ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’ కార్యరూపం దాల్చుతుందని తెలిపారు. ‘జీఎస్టీ 2.O’ సంస్కరణలు దేశ ఆర్థిక వృద్ధికి ఊతం ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పాత పన్నుల విధానాలపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ, జీఎస్టీ చట్టం చారిత్రాత్మకమైనదని కొనియాడారు.
పేద, మధ్యతరగతివారికి లబ్ది
జీఎస్టీ సంస్కరణలు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వారికి గొప్ప ఉపశమనం కలిగిస్తాయని మోదీ చెప్పారు. ఈ సంస్కరణలు దేశాభివృద్ధి గాధను వేగవంతం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సంస్కరణలు దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేస్తాయని పేర్కొన్నారు. పెట్టుబడులు వెల్లువెత్తుతాయని, అభివృద్ధి విషయంలో అన్ని రాష్ట్రాలకు మద్దతుగా సంస్కరణలు ఉపయోగపడతాయని వివరించారు. జీఎస్టీ 2.0 విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీ సంస్కరణలతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) గణనీయంగా పెరుగుతాయన్నారు.
ఆదాయపు పన్ను (Income Tax), జీఎస్టీ (GST) సంస్కరణలతో దేశ ప్రజలకు సంవత్సరానికి సుమారు రూ.2.5 లక్షల కోట్ల మేర ఆదా అవుతుందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రగతిశీల భారత్ కోసం ఆత్మనిర్భర్ ఎంతో అవసరమని ప్రధాని మోదీ అన్నారు. ముఖ్యంగా, ఎంఎస్‌ఎంఈలు ముందుకు రావాలని, జీఎస్టీ సంస్కరణలతో ఎంఎస్ఎంఈలు ఎంతో లాభం పొందగలవని ఆయన ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
జీఎస్టీ సంస్కరణల ఫలితంగా చాలా గృహవినియోగ వస్తువుల రేట్లు తగ్గుతాయని చెప్పారు. రేట్లు తగ్గనున్న వస్తువులు 99 శాతం పేద, మధ్యతరగతివారు వాడేవేనని అన్నారు. రూ.12 లక్షల వార్షికాదాయంపై ఆదాయ పన్ను లేకపోవడం కూడా మధ్యతరగతి వర్గానికి అత్యధిక ప్రయోజనం చేకూర్చుతోందని ప్రస్తావించారు. గత 11 ఏళ్ల తన ప్రభుత్వ హయాంలో దేశంలో మొత్తం 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మేడిన్ ఇండియా ఉత్పత్తులు వాడండి
మేడిన్ ఇండియా ఉత్పత్తులను వినియోగించాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం స్వదేశీ పంథాన్ని అవలంభించడం, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేసి వినియోగించడం దేశానికి అవసరమని తన ప్రసంగంలో ఆయన స్పష్టం చేశారు. దేశప్రజలంతా భారతీయ ఉత్పత్తులను కొనాలని, ఉపయోగించాలని సూచించారు. స్వదేశీ వస్తువులనే వాడుతున్నామని ప్రజలు గర్వంగా చెప్పుకోవాలన్నారు. ఈ భావన అందరిలో కలగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ‘ఇది స్వదేశీ వస్తువు’ అని గర్వంగా చెప్పుకోవాలని అన్నారు. 2014లో జీఎస్టీ సంస్కరణలు తమ ప్రథమ ప్రాధాన్యత అని, తనను ప్రధానిగా ఎన్నుకున్న వెంటనే, జీఎస్టీ విధానాన్ని తీసుకొచ్చామని మోదీ గుర్తుచేశారు. 2017లో ‘వన్ నేషన్, వన్ ట్యాక్స్’ లక్ష్యం నెరవేరిందని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేసుకున్నారు.