Telangana Govt: రాష్ట్ర విద్యుత్ రంగంలో సరికొత్త సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మూడో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ జీవో 44ను జారీ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త డిస్కమ్ తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ కొత్త డిస్కమ్ ప్రధాన ఉద్దేశ్యం. వ్యవసాయం, గృహజ్యోతి (200 యూనిట్ల వరకు), ప్రభుత్వ విద్యా సంస్థలకు అందించే ఉచిత, రాయితీ విద్యుత్ సరఫరా లెక్కలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. దీనివల్ల పాత డిస్కమ్‌ల బ్యాలెన్స్ షీట్లు మెరుగుపడటమే కాకుండా, ఆర్థిక పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
విభాగాలు ఇవే
అగ్రికల్చర్ కనెక్షన్లు, డీటీఆర్‌లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బీ కనెక్షన్లు, మున్సిపల్ నీటి కనెక్షన్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలన్నీ ఉచిత, రాయితీ విద్యుత్ అందించే అన్ని పథకాలు ఇకపై కొత్త డిస్కమ్ పరిధిలోకి రానున్నాయి. కొత్త డిస్కమ్ నిర్వహణ కోసం ప్రస్తుతమున్న సంస్థల నుంచే సుమారు 2వేల మంది సిబ్బందిని బదిలీ చేయనున్నారు. ఇందులో 660 మంది ఇంజినీర్లు, వెయ్యి మంది ఓ అండ్ ఎం స్టాఫ్, 340 మంది అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ఉంటారు. అలాగే పాత డిస్కమ్‌ల నుంచి సుమారు రూ.4,929 కోట్ల విలువైన ఆస్తులను కొత్త సంస్థకు బదిలీ చేయనున్నారు.
భవిష్యత్తులో తక్కువ వడ్డీకి రుణాలు
సుమారు 2,792 అగ్రికల్చర్ డీటీఆర్‌లు, 2,137 ఎల్టీ లైన్లు కూడా దీని పరిధిలోకి రానున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచే ప్రణాళికలు ఏవీ లేవని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. వ్యవసాయం, పేదలకు ఇచ్చే ఉచిత విద్యుత్ యథావిధిగా కొనసాగుతుందని హామీ ఇచ్చింది. ఈ సంస్కరణల ద్వారా డిస్కమ్‌లు ఆర్థికంగా గట్టెక్కడంతో పాటు, భవిష్యత్తులో తక్కువ వడ్డీకి రుణాలు పొందే అవకాశం ఉంటుందని సర్కార్ యోచిస్తోంది.
Also Read: Telangana Govt: మత్స్యకారులకు ప్రభుత్వం పెద్దపీట.. గత ప్రభుత్వం కంటే రూ.30 కోట్లకు పైగా నిధుల పెంపు!

