Telangana Govt: మత్స్యకారులకు ప్రభుత్వం పెద్దపీట..
Telangana Govt ( image credit: swetcha reporter)
Telangana News

Telangana Govt: మత్స్యకారులకు ప్రభుత్వం పెద్దపీట.. గత ప్రభుత్వం కంటే రూ.30 కోట్లకు పైగా నిధుల పెంపు!

Telangana Govt: రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉచితంగా చేప పిల్లల పంపిణీని చేపడుతున్నది. ఈ ఏడాది రూ.93.62 కోట్లతో 84.62కోట్ల చేప పిల్లలను వంద శాతం గ్రాంటుపై ఉచితంగా పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే సుమారు 90 శాతం వరకు చేప పిల్లల పంపిణీ అధికారులు చేపట్టారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉన్న 26,324 చెరువులు, కుంటలు, ప్రాజెక్టులలో వదిలారు. తొలిసారి రూ.28.60 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలను ఎంపిక చేసి 300 నీటి వనరులలో పంపిణీ చేస్తున్నారు.

చేపల ఉత్పత్తి పెంచడమే లక్ష్యం

రాష్ట్రంలో చేపల ఉత్పత్తి, ఉత్పాదకతను గణనీయంగా పెంచడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో 6,152 మత్స్యకార సంఘాల్లోని 4.21 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నది. పరోక్షంగా 10 లక్షల మందికి ఆదాయం పెరగడంతో పాటు జీవనోపాధి కలిగేలా చూస్తున్నది. అంతేకాదు మత్స్యకారులకు ఎప్పటికప్పుడు చేపల పెంపకంపై శిక్షణ తరగతులు సైతం ఇస్తున్నది. గతంలో చేప పిల్లల సరఫరాలో జరిగిన లోటుపాట్లు పునరావృతం కాకుండా పారదర్శకత, జవాబుదారీతనం, మధ్యవర్తుల జోక్యం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. 2016 – 17 నుంచి 2024 – 25 వరకు రూ.646.17 కోట్లతో 520.43 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేశారు. 2025 – 26లో 84 కోట్ల చేప పిల్లలను నీటిలో వదిలారు. 386 రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో రూ.87.09 కోట్లతో 37.70 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేశారు. 2025 – 26లో 10 కోట్లతో రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్నారు.

నిధులు పెంచిన ప్రభుత్వం

బీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్య శాఖకు తక్కువ నిధులు కేటాయించింది. దీంతో కొంత చేప పిల్లల్లో నాణ్యత కొరవడిందని, చెరువులు కుంటల్లో పోసినా నెలలు గడిచినా ఎదగలేదని మత్స్యకారులు బహిరంగంగానే పేర్కొన్నారు. కొన్ని చోట్ల ఆందోళనలు సైతం జరిగాయి. ప్రతి ఏటా రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం కేటాయించింది. అయితే, ఈసారి నాణ్యమైన చేప పిల్లల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.122 కోట్లు కేటాయించింది. అంటే, గత ప్రభుత్వం కంటే రూ.30 కోట్లకు పైగా అధికంగా నిధులు కేటాయించినట్లు అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. శాశ్వత నీటి వనరుల్లో బొచ్చె 40 శాతం, రవ్వ 50 శాతం, మరిగల 10 శాతంను 80 నుంచి 100 ఎంఎం సైజ్‌లో పోస్తున్నారు. కాలానుగుణంగా నీటి వనరులు ఉన్న చెరువులు, కుంటల్లో బొచ్చె 35 శాతం, రవ్వ 35 శాతం, బంగారు తీగ 30 శాతంను 35 నుంచి 40 ఎంఎం సైజ్ ఉన్న చేప పిల్లలను పోస్తున్నారు.

మత్స్యకారులకు కిసాన్ కార్డులు

రైతుల మాదిరిగా మత్స్యకారులు సైతం కిసాన్ క్రెడిట్ కార్డు మాదిరిగా(కేసీసీ)ఫిషరీస్ స్కీం కింద రూ.2 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా తీసుకోవచ్చు. ఈ కార్డు వాలిడిటీ ఐదేళ్ల వరకు ఉంటుంది. ఏడాదికి 4 శాతం మాత్రమే వడ్డీ రేటు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో 66 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్‌ల సరఫరా చేస్తున్నారు. మహిళా స్వయం సహాయక బృందాలు, సభ్యులకు రూ.10.00 లక్షల యూనిట్ ఖర్చుతో అందజేస్తున్నారు.

కరీంనగర్‌లో కొర్రమీను ఉత్పత్తి ఫామింగ్

రాష్ట్రంలో తొలిసారి కరీంనగర్ జిల్లాలో కొర్రమీను ఉత్పత్తి ఫామింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రూ.2.5 కోట్లతో ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ప్రారంభమైతే రాష్ట్రంలో కొర్రమీను ఉత్పత్తి పెరుగుతుంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద చేపల విత్తన కేంద్రాలకు స్థలాలు ఇవ్వాలని లేఖలు రాయగా, త్వరలోనే ఆమోదం వస్తుందని, 10 కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభించబోతున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా రంగారెడ్డి జిల్లాలోని కోహెడలో రూ.47.03 కోట్లతో అత్యాధునిక ఎగుమతి, ప్రధాన చేపల హోల్ సెల్ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నారు. శేరిగూడ, అర్సపల్లిలో ఒక్కొక్కటి రూ.2 కోట్లతో ఆధునిక చేపల హోల్ సెల్ మార్కెట్ల నిర్మాణం చేస్తున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌తో విలువ ఆధిక్యం, వంటకాల తయారీ, మార్కెటింగ్‌పై శిక్షణ ఇవ్వబోతున్నారు. 2025 – 26 సంవత్సరానికి 4.21 లక్షల క్రియాశీల మత్స్యకారులకు బీమా వర్తింపజేస్తున్నారు. ప్రమాదవశాత్తూ మృతి చెందినా, శాశ్వత వైకల్యం కలిగిన మత్స్సకారులకు రూ.5 లక్షల బీమా, పాక్షిక వైకల్యం కింద రూ.2.5 లక్షలు, ప్రమాద కారణంగా ఆసుపత్రి పాలైతే రూ.25 వేలు అందజేయడం జరుగుతుందని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ నిఖిల తెలిపారు.

నేడు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

రాజేంద్రనగర్‌లోని రూరల్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో ఇవాళ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిధిగా మంత్రి వాకిటి శ్రీహరి హాజరవుతున్నారు. మత్స్యకారులపై రూపొందించిన పాటను రిలీజ్ చేయబోతున్నట్లు మత్స్య శాఖ డైరెక్టర్ నిఖిల తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న సహకారాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Also ReadTelangana Govt: టీచింగ్ సిబ్బందికి తీరనున్న భారం.. రాష్ట్ర విద్యాశాఖ సమాలోచనలు

Just In

01

Google Pixel 10: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. భారీ డిస్కౌంట్ తో పిక్సెల్ 10 ఫోన్

CPR to Snake: పాముకు కరెంట్ షాక్.. నోట్లో నోరు పెట్టి ఊపిరిపోసిన వ్యక్తి.. రియల్లీ గ్రేట్!

Kids Mobile: చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసా?

Indigo flight: సౌదీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీగా అహ్మదాబాద్ మళ్లింపు

Loan Apps Ban: కేంద్రం మరో సంచలనం.. 87 లోన్ యాప్స్‌పై నిషేధం.. లోక్‌సభ వేదికగా ప్రకటన