DA Hike: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను, పెన్షనర్లకు డీఆర్‌ను 3.64 శాతం పెంచుతూ ఆర్థిక శాఖ సోమవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా పెంపుతో ప్రస్తుతం 30.03 శాతంగా ఉన్న కరువు భత్యం 33.67 శాతానికి చేరింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. పెరిగిన డీఏ 2023 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అయితే, పెరిగిన డీఏ మొత్తాన్ని నగదు రూపంలో 2026 జనవరి నెల జీతం (ఫిబ్రవరి 1న చెల్లించేది)తో కలిపి ఉద్యోగులకు అందజేస్తారు. ఇక 2023 జూలై 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను ప్రభుత్వం 30 సమాన వాయిదాల్లో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనుంది. సాధారణ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాలు ఉన్న ఉద్యోగులకు ఈ బకాయిలను వారి జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు.
రిటైర్‌మెంట్ ఉద్యోగుల బెన్‌ఫిట్‌లో ఛేంజ్…
మరో వైపు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పరిధిలో ఉన్న ఉద్యోగులకు బకాయిల చెల్లింపులోనూ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. బకాయిల్లోని 10 శాతాన్ని వారి ప్రాన్ ఖాతాకు జమ చేసి, మిగిలిన 90 శాతాన్ని 30 సమాన వాయిదాల్లో నగదు రూపంలో చెల్లిస్తారు. అలాగే, 2026 ఏప్రిల్ 30లోపు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు బకాయిల విషయంలో మినహాయింపు ఇచ్చారు. వారికి జీపీఎఫ్ నిబంధనల నుంచి సడలింపు ఇస్తూ, బకాయిలను వాయిదాల్లో కాకుండా ఏకమొత్తంలో చెల్లించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫుల్ టైమ్ కంటింజెంట్ ఉద్యోగులకు కూడా 30 వాయిదాల్లో బకాయిలు చెల్లించనున్నారు.
Also Read: Kodanda Reddy: నకిలీ విత్తనాలు అరికట్టడంలో.. గత ప్రభుత్వం విఫలమైంది.. కోదండ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
డీఆర్ కూడా.. వీళ్లందరికీ పెంపు..
రాష్ట్రంలోని పెన్షనర్లకు కూడా ప్రభుత్వం 3.64 శాతం మేర డీఆర్ పెంచింది. పెన్షనర్లకు కూడా 2023 జూలై 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుంది. పెరిగిన మొత్తాన్ని 2026 జనవరి పెన్షన్‌తో కలిపి ఫిబ్రవరిలో చెల్లిస్తారు. పెన్షనర్లకు సంబంధించిన బకాయిలను (2023 జూలై నుంచి 2025 డిసెంబర్ వరకు) మిగతా ఉద్యోగుల మాదిరిగానే 30 సమాన వాయిదాల్లో చెల్లించనున్నారు. సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, ప్రొవిజనల్ పెన్షనర్లు తదితర అన్ని వర్గాల వారికి ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పాటు 2020 రివైజ్డ్ పే స్కేల్స్ కాకుండా, ఇంకా 2015 పే స్కేల్స్‌లోనే కొనసాగుతున్న ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏను 68.628 శాతం నుంచి 73.344 శాతానికి పెంచారు. అలాగే, యూజీసీ/ ఏఐసీటీఈ 2016 పే స్కేల్స్ పొందుతున్న యూనివర్సిటీ, కాలేజీల అధ్యాపకులకు డీఏను 42 శాతం నుంచి 46 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2006 యూజీసీ స్కేల్స్ ఉన్నవారికి 221 శాతం నుంచి 230 శాతానికి డీఏ పెరిగింది. మరోవైపు పార్ట్ టైమ్ అసిస్టెంట్లు, వీఆర్ఏలకు నెలకు రూ.100 చొప్పున అడ్-హాక్ పెంపును వర్తింపజేశారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎయిడెడ్ విద్యాసంస్థలు, వర్క్ చార్జ్డ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఉద్యోగులందరికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ఆర్థిక శాఖ తెలిపింది.
Also Read: Water Sharing Issue: ఏళ్లపాటు ప్రాజెక్టుపై కొనసాగుతున్న విచారణలు.. ఇప్పుడు ఏం చేద్దాం..?

