Chinese Manja: చైనా మాంజ వాడొద్దని ప్రభుత్వ పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నా వాటి వాడకం కానీ, అమ్మకాలు కానీ అదుపులోకి వచ్చినట్లు కనబడటం లేదు. దీంతో ఇప్పటికే పలువురు సామాన్యులు గాయాలపాలయ్యారు. తాజాగా ఈ చైనా మాంజ మెడకు చుట్టుకుని ఓ పోలీసుకు తీవ్ర గాయమైంది. నల్లకుంట పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఏఎస్ఐ నాగరాజ్ విధుల్లో భాగంగా ఎగ్జిబిషన్ డ్యూటీ కి ఉప్పల్ లోని తన ఇంటి నుండి బయలుదేరారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ దగ్గర చైనా మాంజ గొంతుకు చుట్టుకుంది. దీంతో మెడకు తీవ్రగాయం అయింది. స్పందించిన స్థానికులు గాయపడిన పోలీసును హుటాహుటీన ఎల్బీనగర్ లోని కామినేని హాస్పిటల్ జాయిన్ చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని వైద్య సిబ్బంది తెలిపారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read also-Maternity Kit: రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..?
ఇప్పటికే మాయదారి చైనా మాంజా కారణంగా 70 ఏళ్ల వృద్దురాలు కాలు తెగి తీవ్రంగా గాయపడిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. మహేశ్వరం నియోజకవర్గం లోని అల్మాస్ గూడ హనుమాన్ ఆలయం వద్ద నడుచు కుంటు వెళ్తున్న 70 ఏళ్ల వృద్దురాలు యాదమ్మ కాలికి చైనా మాంజా చుట్టుకొని తీవ్రంగా గాయపడింది. దీంతో తీవ్రంగా గాయపడిన వృద్దురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
7లక్షల చైసే మాంజా స్వాధీనం
ఇప్పటికే వరకూ చైనా మాంజ అమ్ముతున్న వారిని అరెస్టులు చేసినా.. అమ్మకాలు మాత్రం ఆగడంలేదు. నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి 7 లక్షల రూపాయల విలువ చేసే మాంజాను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ మహ్మద్ ఇక్భాల్ సిద్దిఖీ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వట్టేపల్లి ప్రాంత వాస్తవ్యుడైన మహ్మద్ షాజైబ్ (42) గాలిపటాల వ్యాపారి. సంక్రాంతి పండుగ సమీపించిన నేపథ్యంలో హర్యానా రాష్ట్రం కర్నల్ ప్రాంత నివాసి విక్రమ్ మెహతా నుంచి పెద్ద ఎత్తున చైనా మాంజా బబూన్లు తెప్పించుకున్నాడు. ఒక్కో బబూన్ ను 2వేల రూపాయలకు విక్రయిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ సీఐ యదేంధర్, ఎస్ఐ సందీప్ రెడ్డితోపాటు సిబ్బందితో కలిసి అతని షాపుపై దాడి చేశారు. తనిఖీలు జరిపి 345 బబూన్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

