RBI Governor:
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanth Reddy) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ (RBI Governor) సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) గురువారం నాడు మర్యాద పూర్వకంగా కలిశారు. బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆర్బీఐ గవర్నర్, జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు విభాగాల్లో అమలు చేస్తున్న సంస్కరణలను ఆర్బీఐ గవర్నర్‌కి రేవంత్ రెడ్డి వివరించారు.
విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటు వంటి అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వినియోగం పెంచే దిశగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు. మరిన్ని సంస్కరణలు, ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అలాగే, తెలంగాణలో బడ్స్ (BUDS – Banning of Unregulated Deposit Schemes) యాక్ట్‌ను నోటిఫై చేయాలని ఆర్బీఐ గవర్నర్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ విషయంలో ఆర్బీఐ తీసుకుంటున్న చొరవతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు డిపాజిట్ల క్లెయిమ్ క్యాంపెయినింగ్ తదితర అంశాలను వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also- Gin Movie: టికెట్ డబ్బులకు సరిపడా వినోదం పక్కా అందిస్తాం..‘జిన్’ చిత్ర దర్శకుడు చిన్మయ్ రామ్

