Teenmar Mallanna: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ప్రముఖ జర్నలిస్ట్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ పేరుతో కొత్తపార్టీని స్థాపించారు. అలాగే తన పార్టీకి సంబంధించిన జెండాను సైతం ఆయన ఆవిష్కరించారు. జెండాలో ఒకవైపు వరి కంకులు, ఇంకోవైపు కార్మికుల గుర్తును ఉంచారు. కొత్త పార్టీ ఆవిష్కరణ అనంతరం.. రాష్ట్ర కమిటీని సైతం ప్రకటించారు.
బీసీల అభ్యున్నతి కోసం..
హైదరాబాద్ తాజ్ కృష్ణలో జరిగిన కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న తన కొత్త పార్టీని అనౌన్స్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన పార్టీ విధి విధానాలను ప్రకటించారు. ‘సెప్టెంబర్17, 1948లో తెలంగాణ ఈ భారత దేశంలో కలిసింది.. ఈ శుభ దినం పార్టీ మొదలు పెడుతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రొఫెసర్ మురళీ మనోహర్ తన జీవితాన్ని బీసీల కోసం త్యాగం చేశారు. తెలంగాణలో మెజారిటీ ప్రజల కోసం నా తల్లిదండ్రుల ఆశీస్సులతో రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నా’ అని మల్లన్న అన్నారు.
‘నా పార్టీలో టికెట్స్ ఉన్నాయ్’
చాలా మంది నాయకులు పార్టీ అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీనా అంటూ మన ఆలోచనలు మెుదట్లోనే తుంచేస్తున్నారని ఎమ్మెల్సీ మల్లన్న అన్నారు. ఇకపై పార్టీ టికెట్స్ కోసం గాంధీ భవన్, తెలంగాణ భవన్ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మన పార్టీలోనే టికెట్స్ ఉన్నాయని చెప్పారు. మండలిలో తాను మాట్లాడుతుంటే అందరూ అణచివేయాలని చూశారని మల్లన్న ఆరోపించారు. చాలా మంది నాయకులు.. తనను బీసీల కోసం ముందుకు రావొద్దని సూచించారని చెప్పారు. కానీ మా వర్గాలను అసెంబ్లీలో కూర్చోబెడతానని శపథం చేసి తాను వచ్చానని మల్లన్న పేర్కొన్నారు.
Also Read: Shocking News: చనిపోయాడని అంత్యక్రియలు నిర్వహిస్తే..16 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు!
బీసీల హక్కుల కోసం..
రాష్ట్రంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న బీసీలకు తమ హక్కులను న్యాయబద్దంగా అందించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని సూచించారు. తాము ఎవరి వాటా అడగట్లేదని.. తమకు హక్కుగా రావాల్సిందే కోరుకుంటున్నామని మల్లన్న పేర్కొన్నారు. మరోవైపు తాజ్ కృష్ణ బయట ఒక్క ప్లెక్సీ పెట్టనివ్వకుండా అధిపత్య కులానికి చెందిన అధికారి చింపేశారని మల్లన్న ఆరోపించారు. ‘మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. మా ఓట్లతో మిమ్మల్ని తొక్కేస్తాం’ అని హెచ్చరించారు.
Also Read: Uttar Pradesh: ఇదెక్కడి విచిత్రంరా బాబు.. ఒకే ఇంట్లో 4 వేలకు పైగా ఓటర్లు
ఏఐతో పనిచేసే వెబ్ సైట్ లాంచ్
అంతేకాదు తాజ్ కృష్ణలో హాల్ ఇవ్వకుండా చాలా మంది అడ్డుకున్నారని తీన్మార్ మల్లన్న అన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాజ్యాధికార ప్రతినిధిగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) పెట్టినట్లు తీన్మార్ మల్లన్న అన్నారు. ఏం అడిగినా వాస్తవాలను చెప్తుందని పేర్కొన్నారు. ఒక సామాన్యుడి చేత ఈ వెబ్ సైట్ ను ప్రారంభించడం విశేషం.