Telangana Medical Corporation: మెడికల్ కార్పొరేషన్‌లో ఓ ఆఫీసర్ రూల్స్‌ను అతిక్రమిస్తున్నా వైద్య శాఖ ఉన్నతాధికారులు పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నారు. సెంట్రల్ సర్వీస్ నుంచి ఎఫ్‌ఎస్‌డీ పై వచ్చిన సదరు అధికారి గడువు ముగిసినా ఇంకా కార్పొరేషన్‌లోనే తిష్ట వేశారు. సొంత డిపార్ట్‌మెంట్‌కు రావాలని ఆదేశాలు వచ్చినా కార్పొరేషన్‌లో కుర్చీ వదిలేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎక్స్‌టెన్షన్ ఫైల్ సచివాలయంలో పెండింగ్‌లోనే ఉన్నప్పటికీ, దర్జాగా ఫైళ్లు క్లియర్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పైగా పాత డేట్‌లతో సంతకాలు చేస్తున్నట్లు తెలిసింది. అంతేగాక ఎండీ(MD) కూడా లీవ్‌లో ఉండడంతో తనను ఇంకా రిలీవ్ చేయలేదని ప్రచారం చేస్తూ కార్పొరేషన్ కుర్చీలోనే చక్రం తిప్పుతున్నారు. సదరు ఆఫీసర్‌కు కార్పొరేషన్ ఎండీ అండదండలు ఉన్నాయనే ప్రచారం కూడా డిపార్ట్‌మెంట్‌లోని ఉద్యోగులే ప్రచారం చేస్తున్నారు. దీంతోనే సదరు ఎఫ్‌ఎస్‌డీ అధికారి చెప్పేందే వేదం అన్నట్లుగా కార్పొరేషన్‌లో కొనసాగుతున్నదని సమాచారం. ఉన్నతాధికారుల పేర్లను కూడా వాడుతూ కమీషన్లకు పాల్పడుతున్నారనే చర్చ కూడా జరుగుతున్నది. కార్పొరేషన్‌ను భ్రష్టు పట్టిస్తున్నా హయ్యర్ ఆఫీసర్లు కూడా తమకేమీ తెలియనట్లు వ్యవహరించడం కొసమెరుపు.
తాజా బిల్లుల్లోనూ కమీషన్లే?
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖపై సమీక్షించారు. పెండింగ్ భవనాల నిర్మాణాలకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇందులో మెడికల్ కాలేజీల నిర్మాణాల నిమిత్తం రూ.400 కోట్లు ఆర్ అండ్ బీకి వెళ్లగా, వంద కోట్లు టీజీఎంఎస్ ఐడీసీకి వెళ్లాయి. ఇందులో దాదాపు రూ.67 కోట్లు పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు వాడాలని కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. అయితే, వీటిలోనూ కాంట్రాక్టర్ల నుంచి సదరు ఎఫ్‌ఎస్‌డీ ఆఫీసర్ కమీషన్ అడుగుతున్నట్లు తెలిసింది. బిల్లులు క్లియర్ చేయిస్తే తనకెంటి అని నేరుగా కాంట్రాక్టర్లను కోరుతున్ననట్లు సమాచారం. దీంతో వారు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
కమీషన్లు లేనిదే కనీసం..
వచ్చే కమీషన్‌లలో ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వ పెద్దలకు అందచేయాల్సి ఉంటుందని సదరు అధికారి ప్రచారం చేయడం ఆశ్చర్యకరంగా ఉన్నది. ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ తీసుకువస్తున్న ఈయన నుంచి ఇప్పటి వరకు ఉన్నతాధికారులు కనీసం వివరణ అడగ లేదంటేనే పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఇక ఫస్ట్ ఇన్(First in), ఫస్ట్ ఔట్(first out.) అనే విధానం అమల్లోనూ కమీషన్లు లేనిదే కనీసం ఎంట్రీ కూడా కావడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. నాలుగు శాతం పక్కాగా ఇవ్వాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో మెడికల్ కార్పొరేషన్‌లో ముగ్గురు ఎండీలు మారారు. ఇటీవల మరో ఎండీ వచ్చారు. కానీ, ఇప్పటికీ సదరు ఎఫ్‌ఎస్‌డీ ఆఫీసర్ చెప్పిందే ఎండీలు వినాల్సి వస్తున్నదట. అంటే ఏ స్థాయిలో చక్రం తిప్పుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతున్నది.
Also Read: Jubilee Hills By Election: పోలింగ్ ముగిసిన తర్వాత సర్వేలు రిలీజ్ చేసిన సంస్థలు.. ఎలా ఉన్నాయంటే..!
