Delhi Red Fort Blast: రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో చోటుచేసుకున్న ఘోర కారు పేలుడు కేసులో దర్యాప్తు ఒక కీలక దశకు చేరుకుంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, పేలుడు సంభవించిన హ్యుందాయ్ i20 కారు పుల్వామాకు చెందిన వ్యక్తికి ఫేక్ పత్రాలతో విక్రయించబడిందని అనుమానిస్తున్నారు.
సోమవారం సాయంత్రం సుబాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ భయంకర ఘటన జరిగింది. సాయంత్రం 6:52 గంటలకు కారు భయంకరంగా పేలింది. దీనిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఇరవై మందికి పైగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతతో చుట్టుపక్కల పార్క్ చేసిన 22 వాహనాలు దెబ్బతిన్నాయి.
వాహనం యాజమాన్యంపై దర్యాప్తు
పేలిన హ్యుందాయ్ i20 (నంబర్: HR 26 7624)ను పేలుడు పదార్థాలతో రిగ్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు బృందాలు ఆ కారు యాజమాన్య హిస్టరీని ఒక్కొక్కదశగా ట్రేస్ చేస్తున్నాయి. ఈ కారు చివరిగా జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన తారిక్ అనే వ్యక్తికి అమ్మినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆయన ఫరీదాబాద్‌లో నివసిస్తున్నట్లు గుర్తించారు. ఈ కారు మొదట మొహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తి పేరు మీద నుంచి, తర్వాత నదీమ్, ఆ తర్వాత ఫరీదాబాద్‌లోని “రాయల్ కార్ జోన్” అనే యూజ్డ్ కార్ డీలర్ ద్వారా తారిక్కు చేరినట్లు తెలిసింది.
ఫేక్ పత్రాల కోణం
ఢిల్లీ పోలీస్ సీనియర్ అధికారులు “కారు విక్రయానికి నకిలీ ఐడెంటిటీ పేపర్లు, రిజిస్ట్రేషన్ వివరాలు ఉపయోగించి ఉండొచ్చనే అవకాశం ఉంది” అని తెలిపారు. ఈ లావాదేవీలకు సంబంధించిన అన్ని పత్రాలను పోలీసులు ప్రస్తుతం తీవ్రంగా పరిశీలిస్తున్నారు.
ఉగ్రవాద లింక్ అనుమానం
ఫరీదాబాద్‌లో నివసించే పుల్వామా వ్యక్తి పేరు ఈ కేసులో రావడంతో జాతీయ భద్రతా సంస్థలు అప్రమత్తం అయ్యాయి. దర్యాప్తు అధికారులు తారిక్‌కి ఇటీవల అరెస్టైన ముజమ్మిల్ షకీల్ అనే మరో పుల్వామా వ్యక్తితో సంబంధాలున్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. షకీల్ అరెస్టు సమయంలో 2,900 కిలోల IED తయారీ పదార్థం స్వాధీనం చేసుకున్నట్లు గత వారం వెల్లడించారు.
కారు ట్రావెల్ రూట్‌పై దర్యాప్తు
ప్రాథమిక వివరాల ప్రకారం, ఆ కారు చివరిసారిగా సెప్టెంబర్ 20న ఫరీదాబాద్‌లో టోల్, CCTV ఫుటేజ్‌లో కనిపించింది. అదే రోజు ఆ వాహనంపై వ్రాంగ్ పార్కింగ్ చలాన్ కూడా జారీ చేయబడింది. ప్రస్తుతం సాంకేతిక బృందాలు టోల్ రికార్డులు, సీసీటీవీ, మొబైల్ టవర్ డేటా ఆధారంగా కారు ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ప్రాంతానికి చేరే వరకు తీసుకున్న ఖచ్చిత మార్గాన్ని గుర్తించేందుకు విశ్లేషణ చేస్తున్నారు.
ఈ ఘటనకు వెనుక ఉన్న ఉగ్ర లింక్‌ను వెలికితీసే దిశగా NIA, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కలిసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నాయి.
