SI Bribery Case: ఏసీబీకి చిక్కిన టేక్మాల్ ఎస్‌ఐ రాజేష్
గోడ తూకి పరారీ అయ్యేందుకు ప్రయత్నించిన ఎస్‌ఐ
హర్వెస్టర్ సామాగ్రి దొంగతనం కేసులో డబ్బులు డిమాండ్
రూ.30వేలు తీసుకుంటూ పట్టుబడిన ఎస్‌ఐ
పోలీస్‌స్టేషన్ ముందు మండల ప్రజల సంబరాలు
జోగిపేట, స్వేఛ్చ: మెదక్ జిల్లాలో అవినీతి ఖాకీ ఏసీబీ వలలో చిక్కింది. మెదక్ ఉమ్మడి జిల్లా ఏసీబీ డీఎస్‌పీ సుదర్శన్ నేతృత్వంలోని ఏసీబీ అధికారుల బృందం టేక్మాల్ ఎస్‌ఐ రాజేష్‌ను రెడ్‌హ్యండెడ్‌గా (SI Bribery Case) పట్టుకున్నారు. టేక్మాల్ ఎస్సైగా రాజేష్ గత 3 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. టేక్మాల్ మండలం గొల్లగూడెంకు చెందిన లింగం అనే వ్యక్తి కర్ణాటక నుండి హార్వెస్టర్ ను లీజుకు తీసుకొని నడిపిస్తున్నాడు. మండలం పరిధిలోని హసన్‌మహ్మద్ పల్లి తాండాకు చెందిన పాండు, పరుశురాం అనే వ్యక్తులు హర్వెస్టర్‌కు చెందిన సామాగ్రిని ఈనెల 1వ తేదిన దొంగిలించారు. ఈనెల 2వ తేదిన పోలీస్‌స్టేషన్‌లో హర్వెస్టర్ యజమాని ఫిర్యాదు చేసారు. ఎస్‌ఐ రాజేష్ విచారణ చేపట్టి పాండు, పరుశరాంలు దొంగిలించినట్లుగా గుర్తించారు. వీరిద్దరిని స్టేషన్‌కు పిలిపించి మీపై కేసు లేకుండా చూస్తానని యజమానితో సెటిల్ చేస్తానని చెప్పడంతో దొంగిలించిన సామాగ్రిని ఎస్‌ఐకి అప్పగించారు. దీంతో పాటు జరిమానా కింద రూ.18వేల నగదును యజమానికి గ్రామ పెద్దల సమక్షంలో అప్పగించారు. కేసు కాకుండా చేసేందుకు గాను స్టేషన్‌లో సీసీ కెమెరాల మరమ్మత్తుల కోసం రూ. 40వేలు ఇవ్వాలని పాండుకు ఎస్‌ఐ తెల్పడంతో అదే రోజున ఎస్‌ఐ సూచించిన నంబర్‌కు ఫోన్‌పే ద్వారా రూ. 10వేలు పాండు అనే వ్యక్తి పంపారు. ఆ తర్వాత ఎస్‌ఐ వారం రోజుల పాటు సెలవుపై వెళ్లడంతో తిరిగి ఇటీవల విధుల్లోకి చేరి మిగతా డబ్బుల కోసం పాండు, పరుశరాంలను వేదించడంతో వారు ఈనెల 13వ తేది ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
Read Also- Annadata Sukhibhava: ఏపీలో 46.86 లక్షల మంది రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. రేపే డబ్బులు జమ
పారిపోయేందుకు ఎస్‌ఐ ప్రయత్నం
పాండు, పరుశరాంలకు ఏసీబీ అధికారులు రూ.30వేలు ఇచ్చి పక్కా స్కెచ్ తో ఏసీబీ అధికారులు టేక్మాల్ ఎస్‌ఐపై వలపన్నారు. మంగళవారం టేక్మాల్ పోలీస్ స్టేషన్ లో బాధితుల ద్వారా రూ.30 వేల రూపాయలను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఒక్కసారిగా స్టేషన్ పై రైడ్ చేసి ఎస్‌ఐ రాజేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో ఏసీబీ అధికారులకు చిక్కకుండా తప్పించుకొని స్టేషన్ లోని భవనంపైకి ఎక్కి, ప్రహరీ గోడ దూకి పొలాల్లోకి పారిపోతుండగా సుమారుగా 20 నిమిషాల పాటు ఏసీబీ అధికారులు వెంబడించి ఎస్‌ఐ రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం స్టేషన్ కు తరలించి ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.
Read Also- Cyber Crime: రిటైర్డ్ ప్రొఫెసర్‌ను.. బురుడికొట్టించిన సైబర్ కేటుగాళ్లు.. రూ.78 లక్షలు లూటీ
బాణా సంచా కాల్చిన ప్రజలు
ఎస్‌ఐ రాజేష్‌పై ఏసీబీ దాడులు చేసిన విషయాన్ని తెలుసుకున్న టేక్మాల్ గ్రామస్థులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని స్టేషన్ ఎదుట టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఖాకీ రూపంలో టేక్మాల్ కు పట్టిన శని వదిలిందంటూ బహిరంగంగా వాఖ్యానించడం విశేషం. గతంలో 2015 వ సంవత్సరంలో ఇదే స్టేషన్ లో ఎస్‌ఐ గా విధులు నిర్వహించిన ప్రదీప్ కుమార్ కూడా ఏసీబీ అధికారులకు చిక్కడంతో గ్రామస్థులు సంబరాలు చేశారు.
