Urea Distribution: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న రైతులకు టోకెన్లు అందించారు. అక్కడి నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం (పిఎసిఎస్) యూరియా బస్తాలను పంపిణీ చేశారు. గత కొన్ని రోజులుగా మహబూబాబాద్ జిల్లా పోలీసులు చేస్తున్న కృషితోనే రైతులకు యూరియా బస్తాల పంపిణీ సాగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోజుకో టాస్క్ లక్ష్యంగా పెట్టుకుని పోలీసులు రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేస్తూ మన్ననలు పొందుతున్నారు. ఆదివారం సైతం మరో టాస్క్ ను ఎంచుకుని ఆ టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేశారు. గిరిజన భవన్ లో యూరియా బస్తాల కోసం రైతులకు టోకెన్లు అందించిన పోలీసులు జిల్లా కేంద్రంలోని పిఎసిఎస్ కేంద్రం వద్ద పంపిణీ చేసి ఆదివారం పెట్టుకున్న టాస్క్ ను మహబూబాబాద్ డిఎస్పి ఎన్.తిరుపతిరావు, మహబూబాబాద్ టౌన్ సిఐ గట్ల మహేందర్ రెడ్డి కంప్లీట్ చేశారు. మహబూబాబాద్, అనంతారం, గుమ్మడూరు, జమండ్లపల్లి కి చెందిన క్లస్టర్ వారీగా రైతులకు యూరియాను పంపిణీ చేశారు మొత్తం 222 యూరియా బస్తాలను రైతులకు అందించారు.
యూరియా బస్తాల పంపిణీలో పోలీసుల కృషి ప్రశంసనీయం
మహబూబాబాద్ జిల్లాలో రైతులు యూరియా కోసం నానా తంటా లు పడుతున్నారు. దీంతో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రైతులకు యూరియా బస్తాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వయంగా రంగంలోకి దిగి పిఎసిఎస్ కేంద్రాల వద్ద పర్యవేక్షించారు. చిన్నపాటి ఘర్షణలు సైతం జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. అదేవిధంగా రైతులు కూడా ఎక్కడ అసహనం వ్యక్తం చేయకుండా తగు సూచనలు చేస్తూ ఒప్పించి మెప్పించగలిగారు. ప్రస్తుతం యూరియా కొరత తప్పిందంటే అది కేవలం మహబూబాబాద్ పోలీసులు చేసిన ఘనతేనని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సకాలంలో సజావుగా యూరియా బస్తాలను అందించడంలో పోలీసుల కృషి అభినందనీయం, రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు రైతులు చెబుతున్నారు.
యూరియా బస్తాల కోసం క్యూ లైన్ లో వేచి ఉన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
ఆమె గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తన సొంత గ్రామం కురవి మండలం పెద్దతండ వద్ద వ్యవసాయం చేస్తూ ఉంటారు. తనకు కూడా వ్యవసాయం చేసేందుకు యూరియా బస్తాలు అవసరమయ్యాయి. దీంతో ఉదయం నుండే మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ రైతులతో కలిసి గుండ్రాతి మడుగు రైతు వేదిక వద్ద క్యూ లైన్ లో వేచి ఉన్నారు.