Medical Scam: సత్తుపల్లిలో మెడికల్ సిండికేట్ వ్యవహారం రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. పార్ట్–2 కథనం వెలువడిన తర్వాత అధికార వర్గాల్లో కదలికలు కనిపిస్తున్నాయన్న సంకేతాలు ఉన్నప్పటికీ, ప్రజల ముందు మాత్రం స్పష్టమైన సమాధానాలు రావడం లేదు. ఈ మౌనమే మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది.
కాగితాల్లో చట్టం
డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం మెడికల్ షాపులు స్వతంత్రంగా పనిచేయాలి. కానీ సత్తుపల్లిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లైసెన్సులు ఉన్నప్పటికీ ఏ మందులు ఎక్కువగా ఉంచాలి. ఏ బ్రాండ్‌ను ప్రోత్సహించాలి ఏ డిస్ట్రిబ్యూటర్ వద్ద నుండి సరఫరా తీసుకోవాలి అన్న అంశాలు అనధికారంగా నిర్ణయించబడుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
డిస్ట్రిబ్యూటర్ ఒప్పందాల వెనుక నిజాలు?
కొన్ని మెడికల్ షాపులకు మాత్రమే నిర్దిష్ట డిస్ట్రిబ్యూటర్ల నుంచి ప్రత్యేక సౌకర్యాలు, క్రెడిట్ సదుపాయాలు, అధిక మార్జిన్లు లభిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీని వల్ల చిన్న వ్యాపారులు పోటీలో నిలబడలేక వెనక్కి తగ్గాల్సి వస్తోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. స్టాక్ రొటేషన్ పేరుతో కాలం చెల్లిన మందుల తిరిగి పంపకం అవసరం లేని మందుల బలవంతపు విక్రయం వంటివి జరుగుతున్నాయన్న ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. స్టాక్ రొటేషన్ పేరుతో కాలం చెల్లిన మందుల తిరిగి పంపకం అవసరం లేని మందుల బలవంతపు విక్రయం వంటివి జరుగుతున్నాయన్న ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
Also Read: Zarina Wahab: డార్లింగ్ అంటే ఏంటి? అని ప్రభాస్‌ను అడిగా! నా దృష్టిలో డార్లింగ్ అంటే..
తనిఖీలు ఎందుకు కనిపించడం లేదు?
డ్రగ్స్ కంట్రోల్ శాఖ తనిఖీలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయా? అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. చివరిసారి ఎప్పుడు సమగ్ర తనిఖీ జరిగింది? ఎన్ని మెడికల్ షాపులపై చర్యలు తీసుకున్నారు? ఎంతమంది లైసెన్సులు రద్దయ్యాయి? అన్న వివరాలు ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సమాచారం బయటకు వస్తేనే వ్యవస్థపై నమ్మకం ఋజువవుతుందన్నా అభిప్రాయం ప్రజలలో బలంగా వ్యక్తమవుతోంది.
భయమే ఆయుధంగా మారిందా?
సిండికేట్‌పై మాట్లాడే వారిపై తనిఖీలు పెడతాం సరఫరా నిలిపేస్తాం అంటూ ఒత్తిళ్లు వస్తున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇది కేవలం వ్యాపార దందా మాత్రమే కాకుండా, భయాన్ని ఆయుధంగా మార్చుకున్న వ్యవస్థగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అత్యంత నష్టపోతున్నది సామాన్య ప్రజలే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం, యాంటీబయాటిక్ దుర్వినియోగం, నిల్వ ప్రమాణాల లోపం – ఇవన్నీ ప్రజారోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం చట్ట ఉల్లంఘన కాదు, ప్రజల ప్రాణాలతో చెలగాటమేనన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది.
జిల్లా యంత్రాంగంవైపు ఎదురు చూపులు
ప్రజలు ఇప్పుడు జిల్లా యంత్రాంగం, డ్రగ్స్ కంట్రోల్ శాఖ, విజిలెన్స్, ఏసీబీ వైపు ఆశగా చూస్తున్నారు. స్వతంత్ర విచారణ జరిగితేనే డబ్బు ప్రవాహాలు ఒప్పందాల నిజ స్వరూపం అధికారుల పాత్ర బయటపడుతుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది. సత్తుపల్లి ప్రజానీకం మాటలు ఇప్పుడు మరింత ఘాటుగా మారుతున్నాయి. చట్టం నిజంగా అందరికీ సమానమా? లేక కొందరికే రక్షణా? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ వ్యవస్థపై నిజాలు ఎప్పుడు బయటపడతాయని, అధికారుల స్పందన వస్తుందా? లేక మౌనమే ఈ సిండికేట్‌కు అతి పెద్ద బలమవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రజలు వేచి చూస్తున్నారు.
Also Read: Uttam Kumar Reddy: హరీశ్ రావు చూపించిన లేఖను సీడబ్ల్యూసీ ఆమోదించలేదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!

