Minister Ponguleti: రాబోయే రోజుల్లో ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన (రోల్ మోడల్) మున్సిపాలిటీగా తీర్చుదిద్దడమే తన లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో సుమారు రూ. 2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సి.సి. రోడ్లు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
నంద్యాతండాలో..
ఈ పర్యటనలో భాగంగా మంత్రి పొంగులేటి కోట నారాయణపురంలో రూ. 22.6 లక్షలతో సి.సి. డ్రైను నిర్మాణానికి, ఎస్సీ బీసీ కాలనీలో రూ. 72 లక్షల వ్యయంతో అంతర్గత సి.సి. రోడ్లు, డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే గుదిమళ్ళలో రూ. 44.55 లక్షలతో, ఇందిరమ్మ కాలనీ-1లో రూ. 75.85 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సి.సి. రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. వీటితో పాటు నంద్యాతండాలో రూ. 26.55 లక్షల వ్యయంతో డ్రైన్లు, జంగాల కాలనీలో రూ. 14.10 లక్షలతో సి.సి. రోడ్లు, డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే పూర్తి బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
Also Read: Bhongir Municipality: భువనగిరి మున్సిపల్ ఏం చెబుతోంది.. హస్తానికి చైర్మన్ పీఠం దక్కేనా..!
ప్రతి పేదవానికీ ఇళ్లతో పాటు..
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన సభల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి ఘాటు విమర్శలు చేశారు. “కాళేశ్వరం ప్రాజెక్టు కడితే లక్షల కోట్ల కమీషన్లు వస్తాయనే ఆశతోనే గత పాలకులు దానిపై దృష్టి పెట్టారు. కానీ పేదలకు ఇళ్లు కడితే కమీషన్లు రావనే సాకుతో ఆ పథకాన్ని పూర్తిగా విస్మరించారు” అని మండిపడ్డారు. పేదవారి కష్టం తెలిసిన ప్రభుత్వం తమదని, అందుకే అర్హులైన ప్రతి పేదవానికీ ఇళ్లతో పాటు ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామని ప్రకటించారు. సంక్షేమ పథకాల అమలులో ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. గత ప్రభుత్వం రైతు బంధు కింద రూ. 10 వేలు మాత్రమే ఇస్తే, తమ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ. 12 వేలు అందిస్తూ రైతులకు అండగా నిలుస్తోందని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ప్రజల దీవెనలు తమ ప్రభుత్వంపై ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

