Collector Rizwan Basha: ప్రజాపాలనలో జనగామ జిల్లా ప్రజల హితం కోసమే అధికారులంతా కలిసి కట్టుగా పనిచేస్తున్నారని కలెక్టర్ రిజ్వాన్ భాషా (Collector Rizwan Basha) షేక్ అన్నారు. 77వ గణతంత్ర వేడుకల సంరద్భంగా ముందుగా జనగామ జిల్లా కలెక్టరెట్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం మినిస్టేడియంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, బన్ షాలోమ్, డీసీపీ రాజా మహేంద్ర నాయక్‌తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసులు పెరెడ్ నిర్వహించారు. పోలీసు వందనం స్వీకరించిన కలెక్టర్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. జిల్లాలో ఉత్తమ ఉద్యోగులు ఎంపికైనవారికి ప్రశంసాపత్రాలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ భాషా (Collector Rizwan Basha) షేక్ మాట్లాడుతూ జిల్లాను సమగ్రాభివృద్ధి చేసేందుకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. జనగామ జిల్లా అన్ని రంగాల్లో రాష్ట్రస్థాయిలో ముందు వరుసలో నిలిపేందుకు ప్రతి ఒక్కరు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. జిల్లాలో అన్ని విభాగాల అధికారులు శక్తి వంచన లేకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి ప్రథకాన్ని ప్రజలకు చేర్చేందుకు పనిచేస్తున్నారని తెలిపారు.
ఎన్నికల నిర్వహణలో అవార్డు
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లా అధికారులు చేసిన కృషి ఫలితంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులు మీదుగా అవార్డు అందుకున్నందుకు గర్వకారమన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీలు కొలువుదిరాయని, ప్రజలకు మరింత అభివృద్ధి ఫలాలు అందుతాయని అన్నారు. రాబోవు మున్సిపల్ ఎన్నికల్లోను అధికారులు కష్ట పనిచేసేందుకు సిద్దంగా ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో అధికారులు విజయం సాధించారని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 2,89,66,830 మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, తద్వారా ఆర్టీసికి రూ.140.63కోట్లు ఆదాయం సమకూరిందన్నారు. గృహజ్యోతిలో 94298కుటుంబాలకు రూ.25.83కోట్ల సబ్సీడీ రూపంలో జీరో బిల్లులు జారీ చేశారన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంలో 17346 మంది చికిత్స పొందారని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు యూరియా యాప్‌తో 57,449 మంది రైతులు 2 లక్షల యురియా బస్తాలను కొనుగోలు చేశారని కలెక్టర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకానికి తెలంగాణ రాష్ట్రం నుండి జనగామను ఎంపిక చేసిందన్నారు. దీంతో ఇక్కడి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని గుర్తు చేశారు. జిల్లాలో కొత్తగా 25 వేల రేషన్ కార్డులు జారీ చేయగా, 185358 కార్డుదారులకు 335 చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, 76448 కార్డుదారులకు మహలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే ఒక సిలిండర్ సరఫరా జరుగుతుందన్నారు.
జిల్లాకు అవార్డుల పంట
జిల్లాలో చేపట్టిన వివిధ పనులకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చాయని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. అధికారుల పనితీరుతో ఈ అవార్డులు రావడం జిల్లా ప్రజలకు గర్వకారమన్నారు. ఇంకుడు గుంతలు తవ్వించింనందుకు జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జల్ సంచయ్ జన్ భాగీదారీ 1.0 అవార్డు, జల్ ప్రహరీ సమ్మాన్ పురస్కారం వచ్చాయన్నారు. సమాచార హక్కు చట్టం దరఖాస్తులను త్వరిగతిన పరిష్కరించి, అమలులో ప్రతిభ చూపినందుకు జిల్లాకి ఉత్తమ జిల్లా అవార్డు, విద్యారంగంలో చేసిన కృషికి సీఎం రేవంత్ చేతుల మీదుగా అవార్డు, ఇటీవల గవర్నర్ చేత ఎన్నికల అవార్డు, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు, రైతులు నగదు జమలోనూ జిల్లా మొదటిస్థానం సంపాదించిందన్నారు. జిల్లాలోని అన్ని రంగాల్లోనూ ముందుందని, జిల్లా ప్రజలు అధికారులకు అందిస్తున్న సహాకారంలో ముందుకు పోతున్నామని అన్నారు.

