Bhongir Municipality: భువనగిరి మున్సిపల్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.రెండు రోజుల్లో మున్సిపల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండగా భువనగిరి మున్సిపల్ పీఠం కైవసం చేసుకునేందుకు అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రధాన పార్టీలు అధికార కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS), బిజెపి(BJP) పార్టీలు పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేశారు. 19 సంవత్సరాల తర్వాత మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ జనరల్ మహిళ కు రావడం కొన్ని వార్డులలో రిజర్వేషన్లు మారడంతో నాయకులు ఇతర వార్డులలో పోటీ చేసేందుకు అంతగా సుముఖత చూపకపోవడం గమనార్హం.. గ్రామపంచాయతీ ఎన్నికల సమరంలో ఆయా పార్టీల మద్దతుతో పోటీ చేసి ఓటమి పాలైన సర్పంచుల ఎంపికలో జరిగిన లోపాలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అనుకున్నంతగా సఫలీకృతంతో భువనగిరి మున్సిపల్ లో అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు లేకుండా గెలిచే వారికే అవకాశం కల్పించాలని భావిస్తోంది. ప్రజల మద్దతు ఉన్న అభ్యర్థులను బరిలో దింపడానికి రాజకీయ నేతలు అంతర్గతంగా సమీక్ష సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల జాబితా సిద్ధం చేస్తున్నారు. అంతర్గత విభేదాలకు పోకుంటే కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు సునాయాసంగా కనిపిస్తున్నాయి. గత మున్సిపల్ అవిశ్వాస సమయంలో చైర్మన్ పీఠం ఆశించిన ముగ్గురు బిసి బలమైన నాయకులలో ఒకరికి అవకాశం దక్కింది.. ఆ సమయంలో ఒక్కసారి అవకాశం కల్పించి మరోసారి ఇతరులకు అవకాశం కల్పిస్తామని చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఈసారి సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ మరో బీసీ నాయకుడికి అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది..
బిజెపి ఆశలు వికసించేనా..
భువనగిరి జిల్లాలో మరి ఎక్కడ లేనంతగా భువనగిరి పట్టణంలో బిజెపి పార్టీ బలంగా ఉంది. అయినప్పటికీ కొన్ని వార్డులలో బిజెపి అభ్యర్థులను వెతుక్కోవలసిన పరిస్థితి ఉందని వాదన వినిపిస్తోంది.. కచ్చితంగా పోటీలో ఉండాలనే ఉద్దేశంతో గెలుపు ఓటమి పక్కనపెట్టి అభ్యర్థి ఉంటే చాలని కొన్ని వార్డులలో పరిస్థితి కనిపిస్తుంది.. 2024 లో మున్సిపల్ అవిశ్వాసంలో బిజెపి వైస్ చైర్మన్ పీఠం దక్కించుకొని ఈసారి చైర్మన్ పీఠానికి గురి పెట్టింది.. భువనగిరి మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి బిజెపి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బిజెపి చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటుందా లేదా చూడాలి మరి.
Also Read: Purushaha: ఆస్కార్ విన్నర్ ఆలపించిన మగాళ్లపై సానుభూతి పాట.. జాలిపడేదెవ్వడు?
కారు గెలిచేనా..
భువనగిరి మున్సిపల్ చైర్మన్ పీఠం పై బిఆర్ఎస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. పలు వార్డులలో గతంలో బిఆర్ఎస్ పార్టీ పై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థులకు పోటీగా వాళ్ళ అనుచరులనే వ్యూహాత్మకంగా బరిలోకి దింపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాలు గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులలో జోష్ కనిపిస్తుంది. అధికార పార్టీ అభ్యర్థుల బలబలాలు పూర్తిగా తెలిసిన వారి అనుచరులను నిలబెట్టే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారా లేదా చూడాలి మరి…
సమిష్టి కృషితోనే గెలుపు: మంత్రి సీతక్క
టికెట్ ఎవరికి వచ్చినా అందరూ సమన్వయంతో పని చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. మొదటిసారి భువనగిరి పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జిగా నియామకమైన తర్వాత సమావేశంలో ఆమె పాల్గొన్నారు.గెలుపుపై అతి విశ్వాసం వద్దని, ప్రణాళికాబద్దంగా ప్రతి ఓటరును కలవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పోటీ చేసే అవకాశం రాని వారిని పార్టీ గుర్తు పెట్టుకుంటుందని, నామినేటేడ్ పదవుల భర్తీ విషయంలో స్థానం కల్పిస్తామని చెప్పారు.
అభివృద్ధి సంక్షేమాలే గెలిపిస్తాయి: ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సర్వే నిర్వహించి, గెలిచే అవకాశమున్న వారికే టికెట్లు ఇస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా పాలన రేవంత్ రెడ్డి సారథ్యంలో మునుపెన్నడు లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భువనగిరి మున్సిపాలిటీకి అత్యధిక నిధులు తీసుకురావడం జరిగిందని. భువనగిరి మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించి పనులు కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను చూసి అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

