Khammam District: మెడికల్ దందాపై ఏసీబీ విచారణ జరపాలి
Khammam District (imagecredit:twitter)
ఖమ్మం

Khammam District: సత్తుపల్లి మెడికల్ దందాపై.. ఏసీబీ విచారణ జరపాలని ప్రజలు డిమాండ్!

Khammam District: ప్రజల ఆరోగ్యంతో నేరుగా ముడిపడి ఉన్న మెడికల్ స్టోర్లు, హాస్పిటల్స్ నిర్వహణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నియమ నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇది సాధారణ వ్యాపారం కాదని, ప్రజల ప్రాణాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన సేవ అని చట్టమే స్పష్టం చేస్తోంది. అందుకే మెడికల్ రంగానికి ప్రత్యేక చట్టాలు, నియంత్రణలు తీసుకొచ్చారు.

డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం – 1940

డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలు – 1945 ప్రకారం డ్రగ్ లైసెన్స్ లేకుండా మెడికల్ స్టోర్ నడపడం పూర్తిగా చట్టవిరుద్ధం. రిటైల్ మెడికల్ షాపు నిర్వహించాలంటే తప్పనిసరిగా రిటైల్ డ్రగ్ లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేకుండా మందులు విక్రయించినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేసినా షాపు మూసివేతతో పాటు లైసెన్స్ రద్దు, క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని చట్టం స్పష్టం చేస్తోంది. ప్రతి మెడికల్ స్టోర్‌లో పూర్తి సమయ రిజిస్టర్డ్ ఫార్మాసిస్ట్ ఉండటం చట్టపరంగా తప్పనిసరి. ఫార్మాసిస్ట్ లేకుండా మందులు అమ్మడం నేరంగా పరిగణిస్తారు. ఫార్మసీ డిగ్రీ లేదా డిప్లొమా లేని యజమానులు తప్పనిసరిగా రిజిస్టర్డ్ ఫార్మాసిస్ట్‌ను నియమించాలి. ఫార్మాసిస్ట్ డాక్టర్ పాత్రలో వ్యవహరించడం, రోగ నిర్ధారణ చేయడం, మందుల మోతాదు మార్చడం వంటి చర్యలు పూర్తిగా నిషేధించబడ్డవని అధికారులు హెచ్చరిస్తున్నారు. మెడికల్ స్టోర్ భవనానికి సంబంధించి కూడా స్పష్టమైన నియమాలు ఉన్నాయి. రిటైల్ మెడికల్ షాపు కనీసం 10 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండాలి. రిటైల్‌తో పాటు హోల్‌సేల్ వ్యాపారం చేస్తే కనీసం 15 చదరపు మీటర్ల విస్తీర్ణం తప్పనిసరి. షాపులో సరైన గాలి, వెలుతురు, శుభ్రత ఉండాలి. మందుల నిల్వకు తగిన షెల్వింగ్ ఏర్పాటు చేయాలి. ఇన్సులిన్, వ్యాక్సిన్లు వంటి సున్నితమైన మందుల కోసం ఫ్రిజ్ లేదా కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి.

ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించడం

మందుల విక్రయానికి సంబంధించి కూడా చట్టం కఠిన నియంత్రణలు విధించింది. సాధారణ జ్వరం, నొప్పి నివారణ, విటమిన్లు వంటి కొన్ని ఓవర్ ద కౌంటర్ మందులు మాత్రమే స్వేచ్ఛగా విక్రయించడానికి అనుమతి ఉంది. అయితే షెడ్యూల్–హెచ్, షెడ్యూల్–హెచ్1, షెడ్యూల్–ఎక్స్ కింద ఉన్న మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించరాదని చట్టం స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా యాంటీబయాటిక్స్, నిద్రమాత్రలు, మత్తు ప్రభావం కలిగించే మందులను ఇష్టం వచ్చినట్టు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. షెడ్యూల్–హెచ్1, షెడ్యూల్–ఎక్స్ మందుల విక్రయానికి ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించడం తప్పనిసరి. ప్రతి విక్రయం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా జరగాలని నిబంధనలు చెబుతున్నాయి. డాక్టర్ సలహా లేకుండా ఇంజెక్షన్లు వేయడం, యాంటీబయాటిక్స్ ఇవ్వడం, మందుల మోతాదు మార్చడం, రోగులకు వైద్య సూచనలు ఇవ్వడం వంటి పనులు మెడికల్ స్టోర్ నిర్వాహకులు చేయకూడదని చట్టం స్పష్టంగా పేర్కొంటోంది. మెడికల్ షాప్ పాత్ర మందుల సరఫరాకు మాత్రమే పరిమితం కావాలని అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నారు.

Also Read: India-US Trade Deal: మళ్లీ నోరుపారేసుకున్న అమెరికా.. ఈసారి గట్టిగా ఇచ్చిపడేసిన భారత్!

ప్రజల ప్రాణాలతో చెలగాటం

హాస్పిటల్స్ నిర్వహణకు కూడా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. సరైన అనుమతులు, నమోదు ధృవపత్రాలు, అర్హత కలిగిన డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పరిశుభ్రత, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, అత్యవసర సేవల ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలి. ఇవి పాటించకుండా హాస్పిటల్ నడపడం ప్రజల ప్రాణాలతో చెలగాటం చేయడమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి మెడికల్ స్టోర్, హాస్పిటల్ మందుల కొనుగోలు, విక్రయాలకు సంబంధించి సరైన బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు నిర్వహించాలి. డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు పాటిస్తున్నారా లేదా పరిశీలించాల్సిన బాధ్యత ఉంది. లోపాలు గుర్తిస్తే షోకాజ్ నోటీసులు, మందుల స్వాధీనం, షాపు లేదా హాస్పిటల్ సీజ్ చేయడం, లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకునే అధికారం చట్టం కల్పించింది. మొత్తంగా మెడికల్ స్టోర్ అయినా, హాస్పిటల్ అయినా అది సాధారణ వ్యాపారం కాదు. ఇది ప్రజల ప్రాణాలతో ముడిపడిన అత్యంత కీలక సేవ. చట్టపరమైన నియమ నిబంధనలు పూర్తిగా పాటించినప్పుడే ఈ రంగంలో పనిచేయడానికి అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎలాంటి రాజీ ఉండదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

మీడియాతో మాట్లాడిన డ్రగ్ ఇన్స్పెక్టర్

ఈ క్రమంలో సత్తుపల్లిలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇటీవల పర్యటించి కొన్ని మెడికల్ షాపులు, హాస్పిటల్స్‌లో అరాకొరగా తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. షాపుల్లో లైసెన్సులు, ఫార్మాసిస్ట్ హాజరు, స్టాక్ రిజిస్టర్లు, మందుల నిల్వలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. మెడికల్ షాపులు, హాస్పిటల్స్ పాటించాల్సిన నియమ నిబంధనలను నిర్వాహకులకు గుర్తు చేసిన డీఐ, చట్టప్రకారం లైసెన్సులు, సిబ్బంది, రికార్డులు ఉండాల్సిందేనని సూచించినట్లు తెలిసింది. తనిఖీల అనంతరం మీడియాతో మాట్లాడిన డ్రగ్ ఇన్స్పెక్టర్ “పరిశీలించిన మేరకు అన్ని సక్రమంగానే ఉన్నాయి” అని చెప్పి వెళ్లారు. అయితే లోపాలేమీ లేవన్న ఈ వ్యాఖ్యలు ఇప్పటికే వినిపిస్తున్న ఆరోపణల నేపథ్యంలో మరిన్ని సందేహాలకు తావిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనిఖీలు జరిగాయని చెప్పడానికే పరిమితమయ్యాయా? అన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలు, వినియోగదారుల సంఘాలు ఈ వ్యవహారంపై విజిలెన్స్, ఏసీబీ స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంక్ లావాదేవీలు, డిస్ట్రిబ్యూటర్ ఒప్పందాలు, తనిఖీల రికార్డులను సమగ్రంగా పరిశీలిస్తే అసలు నిజం బయటపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే..

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ వ్యవస్థపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారు? ఈ దందాకు తెరపడుతుందా? అరకోరా తనిఖీలు చేసి ప్రజల నోళ్ళు మూయించే ఉద్దేశ్యంలో ఉందా ? ఈ ప్రశ్నలకు తెరపడాలంటే వాస్తవాలు, బయటపెట్టాల్సిందే, నిజాల నిగ్గు తేల్చాల్సిందె అంటున్నారు సత్తుపల్లి ప్రాంత ప్రజలు. ఈ సిండికేట్ వ్యవస్థను కూల్చకపోతే ప్రజల ప్రాణలకే ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. ఈ వ్యవహారంపై మరిన్ని సంచలన నిజాలతో ‘స్వేచ్ఛ’ త్వరలో మరో స్ట్రింగ్ ఆపరేషన్ కథనాన్ని తీసుకురానున్నట్లు సమాచారం.

Also Read: The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మొదటి రోజు కింగ్ సైజ్ కలెక్షన్స్ ఎంతంటే?.. అఫిషియల్..

Just In

01

Audience Mindset: ప్రేక్షకులు సినిమా చూసే కోణం మారుతుందా?.. వారు ఏం కోరుకుంటున్నారు?

Anvesh Controversy: నా అన్వేష్ ఆడియో లీక్ చేసిన ఏయ్ జూడ్.. సనాతన ధర్మాన్ని అలా అన్నాడా?

Jana Sena: జనసేన ఊహించని నిర్ణయం.. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పోటీకి సై

Ponguleti Srinivas Reddy: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. గతం కంటే ఎక్కువ అక్రిడిటేషన్ కార్డులు

Cyber Fraud: రిటైర్డ్ ఐపీఎస్​ భార్యకు సైబర్ మోసగాళ్ల టోకరా.. ఎంత పని చేశార్రా!