India-US Trade Deal: ప్రధాని మోదీ (PM Modi)పై అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ (Howard Lutnick) చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump)కు ప్రధాని మోదీ ఫోన్ చేయకపోవడం వల్లే దీర్ఘకాలంగా చర్చించబడుతున్న వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చలేదన్న ఆరోపణలను తప్పుబట్టింది. చర్చల దశలో ఉన్న వాణిజ్య ఒప్పందంపై లుట్నిక్ ఇచ్చిన వివరణ సరైనది కాదని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) స్పష్టం చేశారు.
ఏడాది కాలంగా చర్చలు..
భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఏడాది కాలంగా ఇరుదేశాలు చర్చల్లో నిమగ్నమై ఉన్నాయని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గతేడాది ఫిబ్రవరి 13 నాటికే వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో పరస్పర ప్రయోజనకరమైన ఫలితాన్ని చేరుకునే లక్ష్యంతో అనేక రౌండ్ల చర్చలు జరిగినట్లు జైస్వాల్ స్పష్టం చేశారు. అనేక సందర్భాల్లో తాము ఒప్పందానికి అతి దగ్గరగా వచ్చామని పేర్కొన్నారు. కానీ అమెరికా వెనక్కితగ్గడంతో చర్చలు మరింత జాప్యంగా మారుతున్నాయని ఆయన పరోక్షంగా చురకలు అంటించారు.
ఏడాది కాలంలో 8 ఫోన్ కాల్స్..
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన రెండు దేశాల మధ్య పరస్పరం అమోదయోగ్యమైన వాణిజ్య ఒప్పందం కోసం తాము ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నట్లు విదేశాంగ ప్రతినిధి అన్నారు. మరోవైపు ప్రధాని మోదీ ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడలేదన్న హోవార్డ్ లుట్నిక్ వ్యాఖ్యలపైనా రణధీర్ జైస్వాల్ కౌంటర్ ఇచ్చారు. ఏడాది కాలంలో ఇరువురు దేశాధినేతలు 8 సార్లు ఫోన్ లో మాట్లాడుకున్నారని ఆయన స్పష్టం చేశారు. అమెరికాతో తమ బలమైన భాగస్వామ్యానికి సంబంధించి వివిధ అంశాలపై ట్రంప్ తో మోదీ చర్చించారని చెప్పారు.
Also Read: Telangana Rising 2047: దావోస్ వేదికగా తెలంగాణ రైజింగ్ 2047.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!
అసలు లుట్నిక్ ఏమన్నారంటే..
అమెరికాకు చెందిన ఓ పాడ్ కాస్ట్ లో ఆ దేశ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ భారత్ పై విమర్శలు చేశారు. వాషింగ్టన్ ఇతర దేశాలతో జరుపుతున్న వాణిజ్య చర్చలు తుది దశకు చేరుతుండగా.. భారత్ తో మాత్రం ముంగింపునకు రాలేదని వ్యాఖ్యానించారు. ట్రంప్ వాణిజ్య ఒప్పందాన్ని వివిధ దశలుగా చూస్తున్నారని.. తొలిదశ లోనే ఒప్పందం కుదుర్చుకున్న దేశాలకు నామమాత్రపు నిబంధనలతో పాటు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. చర్చల దశలు మారే కొద్ది ఆ స్థాయి అత్యుత్తమైన ప్రయోజనాలను ఇతర దేశాలు పొందలేవని పరోక్షంగా భారత్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చివరిగా జరిగిన వాణిజ్య ఒప్పంద చర్చలో మోదీ, ట్రంప్ మధ్య సంభాషణ జరుగుతాయని అమెరికన్ అధికారులు భావించారని.. కానీ అలా జరగలేదన్నారు. ట్రంప్ నకు మోదీ ఫోన్ చేయకపోవడం వల్ల చాలా అసౌకర్యంగా భావించామన్నారు.

