CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా, నీళ్లు కావాలా అని అడిగితే తాను నీళ్లే కావాలని కోరుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. వివాదం కావాలా, పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారం కావాలని కోరుకుంటానని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ – సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని, రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.
చంద్రబాబుకు సూచన
మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ( Ap Cm Chandrababu Naidu) ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా అని, కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతుల అడ్డంకులు పెట్టకండి, అడ్డంకులతో కేంద్ర ప్రభుత్వ నిధులు రావడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతున్నదని, తాము వివాదం కోరుకోవడం లేదు, పరిష్కారం కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాలు కాదు ప్రజల ప్రయోజనాల కోసం, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నామని అన్నారు. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం ఉండాలని చెప్పారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని, ఇందుకోసం చర్చలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రాలతో తాము వివాదాలు కోరుకోవడం లేదని అది ఏపీ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, మహారాష్ట్ర అయినా పరస్పర సహకారమే కోరుకుంటున్నామని అన్నారు.
Also Read: CM Revanth Reddy: పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై.. సీఎం కీలక నిర్ణయం!
భావితరాల కోసం ఫ్యూచర్ సిటీ
రాబోయే పదేళ్లలో భారత్ ఫ్యూచర్ సిటీలో ఉంటున్నామని గర్వంగా చెప్పుకునేలా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ ((CM Revanth Reddy)) తెలిపారు. 1995 నుంచి 2025 వరకు 30 ఏళ్ల నిరంతర శ్రమ వల్లే హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడగలుగుతున్నదని వివరించారు. జర్మన్ టెక్నాలజీతో దక్షిణ భారత దేశంలోనే ఐవీ ఫ్లూయిడ్స్ తయారీలో గొప్ప సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో భాగంగా సుజెన్ మెడికేర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉన్నదన్నారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ పాలసీ డాక్యుమెంట్‌ను విడుదల చేశామని తెలిపారు. క్యూర్, ప్యూర్, రేర్ మూడు భాగాలుగా తెలంగాణ అభివృద్ధి ఉంటుందని అన్నారు.
గొప్ప నగరాలతో హైదరాబాద్ పోటీ
2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్యూర్, ప్యూర్‌పై ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రపంచంలోని గొప్ప నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుందని చెప్పారు. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూయార్క్‌లకు ధీటుగా ఎదుగుతుందని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే యువ పారిశ్రామిక వేత్తలు ప్రారంభించే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. దేశంలో ఉత్పత్తి చేసే బల్క్ మెడిసిన్స్‌లో 40 శాతం తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. ప్రపంచమే మనవైపు చూసేలా ఫార్మా రంగంలో రాణిస్తున్నామని, మన దగ్గర చదువుకుని వెళ్లిన వారు గ్లోబల్ కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారని తెలిపారు. ఇది ఎంతో గర్వకారణంగా పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read:CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గౌరవ మర్యాదలకు భంగం కలగనివ్వం: సీఎం రేవంత్

