Sathupalli News: అధికారులను మచ్చిక చేసుకుని మెడికల్ రిటైల్ వ్యాపారంలో అడ్డగోలుగా ప్రజల వద్ద నుంచి డబ్బులు దండుకుంటున్న సిండికేట్ దందా సత్తుపల్లి నియోజకవర్గంలో యథేచ్ఛగా కొనసాగుతోందన్న ఆరోపణలు మరింత బలపడుతున్నాయి. ఈ దందాపై గతంలో ఎన్నిసార్లు మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి నుంచి పై అధికారుల వరకూ నామమాత్రపు చర్యలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా స్వేచ్ఛ పత్రికలో ప్రచురితమైన “ప్రాణాలతో చెలగాటం” శీర్షికకు స్పందించినట్టుగా చూపిస్తూ అధికారులు బుధవారం ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని సత్తుపల్లి పట్టణంలోని పలు రిటైల్ మెడికల్ దుకాణాలకు పంపారు. అయితే ఈ తనిఖీలు ప్రజల నమ్మకాన్ని పెంచే విధంగా కాకుండా, అనుమానాలను మరింత పెంచే రీతిలో జరిగాయన్న అభిప్రాయం క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతోంది.
షట్టర్లు దించుకొని మూసివేయడం
ఈ తనిఖీల్లో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే — అధికారుల బృందం తనిఖీలకు రానున్న విషయం ముందుగానే సత్తుపల్లి మెడికల్ సిండికేట్‌కు సమాచారం చేరిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ సమాచారం సిండికేట్ సభ్యుల ద్వారా ఇతర రిటైల్ మెడికల్ షాపులకు చేరడంతో, తనిఖీలు మొదలయ్యేలోపే కొన్ని దుకాణాలు షట్టర్లు దించుకొని మూసివేయడం, మరికొన్ని అప్రమత్తంగా వ్యవహరించడం జరిగిందన్న సమాచారం బయటకు వచ్చింది. అధికారులు రాకముందే సమాచారం ఎలా లీక్ అవుతోంది? ఎవరి ద్వారా ఈ హెచ్చరికలు వెళ్తున్నాయి? ఇది యాదృచ్ఛికమా, లేక ముందే ఏర్పాటైన అవగాహనల ఫలితమా? అన్న ప్రశ్నలు ఇప్పుడు నియోజకవర్గంలో తీవ్రమైన చర్చకు దారి తీస్తున్నాయి. తనిఖీలే ముందస్తు సమాచారంతో నిర్వీర్యమవుతున్నాయంటే, వ్యవస్థలో ఎక్కడో లోతైన లోపం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివరాలు కనిపించకపోవడం
మరోవైపు, తనిఖీలు పూర్తైన తర్వాత అధికారులు విలేకరులకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం విమర్శలకు దారితీసింది. ప్రజలకు మందులపై అవగాహన కల్పించే సూచనలు, మందులు కొనుగోలు చేసే సమయంలో సమస్యలు ఎదురైతే డ్రగ్ కంట్రోల్ శాఖను సంప్రదించేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు ప్రదర్శించాల్సిన బాధ్యత ఉన్నా, ఒక్క రిటైల్ మెడికల్ దుకాణం వద్ద కూడా అటువంటి వివరాలు కనిపించకపోవడం గమనార్హం. ఇది కేవలం తనిఖీల లోపమా? లేక ప్రజలకు సమాచారం తెలియకుండా ఉంచే ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమా? అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. “ఓ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సారు… మా సత్తుపల్లి రిటైల్ మెడికల్ దుకాణాల వైపు ఒకసారి చూడండి జరా..!”అన్న వ్యంగ్య వ్యాఖ్యలు వినిపించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
అప్పుల పాలైన కథనాలెన్నో..
ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే, ఇది వ్యక్తిగత తప్పిదాల సమాహారం కాదని, సిండికేట్ ఆధిపత్యంతో నడిచే క్రమబద్ధమైన దోపిడీ వ్యవస్థగా మారిందన్న భావన బలపడుతోంది. ఏ మందులు విక్రయించాలి, ఏ బ్రాండ్లను ప్రోత్సహించాలి, ఎవరు వ్యాపారంలో ఉండాలి అన్నది సిండికేట్ నిర్ణయిస్తున్న పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల చిన్న మెడికల్ వ్యాపారులు పోటీలో నిలబడలేక నలిగిపోతుండగా, అంతేకాక వర్గ వర్ణ బేధాలు చూపించడంతో ఈ చిరు వ్యాపారులు తమ వ్యాపారాలు వదులుకొని అప్పుల పాలైన కథనాలెన్నో మన కళ్ళముందే తారస పడుతుంటాయి. ఇది ఎలా ఉంటే మరి సామాన్య ప్రజలు ఖరీదైన మందుల భారం మోస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుది నష్టం సామాన్య ప్రజలకే అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. అవసరం లేని మందుల విక్రయం, యాంటీబయాటిక్ దుర్వినియోగం, నాణ్యతపై సందేహాలు — ఇవన్నీ ప్రజారోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది వ్యాపార లాభాల విషయం మాత్రమే కాకుండా, ప్రజల ఆరోగ్యాన్ని ప్రయోగశాలగా మార్చే దోపిడీ వ్యవస్థగా మారిందన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ముగ్గురు సిండికేట్ల ఆధిపత్యం
నియోజకవర్గంలో ఇప్పుడు వినిపిస్తున్న మాటలు మరింత గట్టిగా మారుతున్నాయి. ఈ ముగ్గురు సిండికేట్ల ఆధిపత్యంపై ఎప్పుడు స్పష్టత వస్తుంది? ఈ దోపిడీకి తెరపడేదెప్పుడు? సమగ్ర విచారణ ప్రారంభమయ్యేదెప్పుడు? ఈ వ్యవస్థను కాపాడుతున్న ఆ అజ్ఞాతవాసి ఎవరు? చట్టం కాగితాల్లోనేనా? లేక వాస్తవంగా అమలవుతుందా? ఈ మొత్తం వ్యవహారంపై అధికార యంత్రాంగం నుంచి కనిపిస్తున్న అస్పష్ట నిశ్శబ్దంనే సిండికేట్‌కు అతి పెద్ద రక్షణగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో దోపిడీపై లోతైన విశ్లేషణ, సిండికేట్ల–బ్రాండ్ సంబంధాల వెనుక ఉన్న వాస్తవాలు, విచారణ జరిగితే వెలుగులోకి వచ్చే సంచలన నిజాలు, సిండికేట్ కూలితే బయటపడే పేర్లపై త్వరలో మరో కీలక కథనంతో మీ ముందుకు రానుంది — మీ స్వేచ్ఛ.

