Khammam News: భర్తపై చర్యలకు భార్య డిమాండ్
ఖమ్మం టౌన్, స్వేచ్ఛ: మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని, మొదటి భార్యనైన తనను, తన పిల్లలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వివాహేతర సంబంధం పెట్టుకొని తమను రోడ్డుపాలు చేశాడని, తన భర్త షేక్ ఇబ్రహీంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఖమ్మం శ్రీనివాస్ నగర్‌కు చెందిన షేక్ కరిమున్నీసా విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో (Khammam News) గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Read Also- Stock Markets Fall: బాబోయ్.. ఇన్వెస్టర్లకు ఒకే రోజు రూ.8.1 లక్షల కోట్లు నష్టం.. అంతా ట్రంప్ వల్లే!
షేక్ ఇబ్రహీంతో తనకు 30 ఏళ్ల క్రితం వివాహం జరిగిందని, తనకు పెళ్లీడుకొచ్చిన కొడుకు, కూతురు ఉన్నారని కరీమున్నీసా చెప్పారు. తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని మరోచోట కాపురం పెట్టాడని, తనను, తమ పిల్లలను పట్టించుకోవడంలేదని వెల్లడించారు. పెళ్లయిన నాటి నుంచి శ్రీనివాస్ నగర్‌లోనే ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నామని, తాము నివాసం ఉంటున్న గృహానికి కొంతమంది వ్యక్తులు వచ్చి బలవంతంగా తమ సామాన్లను రోడ్డుపై వేసి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
తన భర్తకు వారసత్వంగా వచ్చిన ఇంట్లో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, అయితే, తన భర్త వేరే మహిళతో కాపురం ఉంటుండడంతో తాము ఎక్కడ ఉండాలంటూ కరీమున్నీసా ఆవేదన వ్యక్తం చేశారు. సిటిజన్ యాక్ట్‌లో తన మామ ఫిర్యాదు చేసి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని, తాము నివాసం ఉంటున్న ఇంటిని తమ పిల్లలకు చెందకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పోలీసులకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుందని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. తనను, తన పిల్లలను రోడ్డుపాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్, ఇతర అధికారులను ఆమె వేడుకున్నారు.
Read Also- Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో పంట పొలాల్లో తిరుగుతున్న పోలీసులు.. ఎందుకో తెలుసా?

