Stock Markets Fall: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాల పరంపర (Stock Markets Fall) కొనసాగుతోంది. వరుసగా నాలుగు రోజైన గురువారం నాడు కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 780 పాయింట్లు, లేదా 0.92 శాతం మేర పతనమై 84,181 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ఇదే స్థాయిలో క్షీణించింది. నిఫ్టీ సూచీ 264 పాయింట్లు, లేదా 1.01 శాతం నష్టపోయి 25,877 పాయింట్ల వద్ద గురువారం సెషన్ ముగిసింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. సూచీలు గణనీయ నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ఈ స్థాయిలో కుప్పకూలడంతో గురువారం ఒక్కరోజే ఏకంగా రూ.8.1 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి అయ్యింది. బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.479.94 లక్షల కోట్ల నుంచి రూ.471.82 లక్షల కోట్లకు పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా వంటి పెద్ద కంపెనీల స్టాక్స్ కూడా క్షీణించాయి.
భయపెట్టావ్ కదయ్యా ట్రంప్..
రష్యా నుంచి ముడిచమురును కొనుగోలు చేసే దేశాలపై అమెరికా విధిస్తున్న సుంకాలను 500 శాతానికి పెంచవచ్చంటూ కథనాలు వెలువడడం దేశీయ స్టాక్ మార్కెట్లను ఆందోళనలకు గురిచేసింది. సుంకాల పెంపునకు వీలుగా ఒక బిల్లు తీసుకురానుండడం, దీనిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థిస్తూ ట్వీట్ చేయడంతో దేశీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ప్రతికూలంగా మారింది. దీంతో, మదుపర్లు ఒక్కసారిగా స్టాక్స్ విక్రయానికి మొగ్గుచూపారు. భారతీయ ఉత్పత్తులపై ఇప్పటికే 50 శాతం టారీఫ్‌లు కొనసాగుతుండడంతో, సుంకాలు పెరిగితే భారతీయ కంపెనీలు మరింత నష్టపోవాల్సి వస్తుందనే భయాలు మార్కెట్ల పతనానికి ప్రధాన కారణంగా ఉన్నాయి.
Read Also- Hyderabad Crime: తరుచూ ఫోన్ మాట్లాడటంపై.. ప్రశ్నించిన లవర్.. సూసైడ్ చేసుకున్న ప్రేయసి
ఇతర కారణాలు ఇవే
మార్కెట్ల పతనానికి ఇతర కారణాల విషయానికి వస్తే, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లను (FII) తమ పెట్టుబడులను పెద్ద ఎత్తున స్వీకరిస్తున్నారు. వరుసగా నాలుగవ రోజు కూడా ఇదే ధోరణి కనిపించింది. జనవరి నెలలో ఇప్పటివరకు ఏకంగా 694 మిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారంటూ ఎఫ్ఐఐ సెల్లింగ్ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఎలా పురోగతి కనిపించకపోవడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలు రౌండ్ల చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి లేకపోవడం ప్రతికూలంగా మారుతోంది. అసలు ఒప్పందం జరుగుతుందా?, లేదా? అనే గందరగోళం కూడా ఇన్వెస్టర్లలో నెలకొంది.
మరోవైపు, దిగ్గజ కంపెనీల స్టాక్స్‌లో ప్రస్తుతం సెల్లింగ్ కనిపిస్తోంది. మార్కెట్లు ఈ స్థాయిలో నష్టపోవడానికి ఇది కూడా ఒక కారణమని స్టాక్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కీలకమైన ఐటీ, మెటల్ స్టాక్స్ తీవ్ర నష్టాల్లో ముగియడం మరో కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, రానున్న రోజుల్లో కూడా అంతర్జాతీయ పరిణామాలు, యూఎస్ ట్రేడ్ పాలసీ, ఎఫ్ఐఐల తీరుని బట్టి మార్కెట్ల దిశా ఆధారపడి ఉంటుందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

