Widow Remarriage Case: భర్త చనిపోయాక రెండో పెళ్లి చేసుకున్నా.. కారుణ్య నియామకానికి భార్య అర్హురాలు కావొచ్చని కేరళ హైకోర్టు (Kerala High Court) కీలకమైన తీర్పు (Widow Remarriage Case) ఇచ్చింది. హైస్కూల్ అసిస్టెంట్‌గా (సోషల్ స్టడీస్) పనిచేస్తున్న ప్రభుత్వ టీచర్ చనిపోవడంతో, ఆయన భార్య ఒంటరిగా మారింది. ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తూ జీవిత భాగస్వామి చనిపోవడం, వారికి పిల్లలు లేకపోవడం, అప్పటికే తన తండ్రి కూడా చనిపోవడంతో ఆమె బాగోగులను చూసుకునేవారు ఎవరూలేక ఇబ్బందుల్లో పడ్డారు. పైగా, వృద్ధురాలైన తన తల్లి భారం కూడా ఆమె భుజాలపైనే పడింది. దిక్కుతోచని ఈ స్థితిలో సదరు మహిళ రెండో పెళ్లి చేసుకుంది. అయితే, మొదటి భర్త పనిచేసిన స్కూల్‌లో ఉపాధిని కల్పించాలంటూ కారుణ్య ఉద్యోగాన్ని కోరుతూ ఆమె దరఖాస్తు చేసుకోగా, యాజమాన్యం తిరస్కరించింది.
స్కూల్ యాజమాన్యం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సదరు మహిళ కోర్టును ఆశ్రయించింది. విచారణ పూర్తవ్వడంతో కేరళ హైకోర్టు ఈ కీలక తీర్పు ఇచ్చింది. కారుణ్య నియామకానికి సంబంధించి, దరఖాస్తుదారు నిర్దిష్ట విధంగానే ఉండాల్సిన అవసరం లేదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేరళ హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి భార్య రెండో వివాహం చేసుకుంటే కారుణ్య నియామకానికి అనర్హులు అవుతారా? అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న అని న్యాయస్థానం పేర్కొంది. కారుణ్య నియామకం ఒక హక్కు కాకపోయినప్పటికీ, ఒక ప్రభుత్వ ఉద్యోగి మరణం కారణంగా, అతడి కుటుంబం తీవ్ర కష్టాల పాలవుతుందని, అందుకే కారుణ్య నియామకాలకు అవకాశం ఉంటుందంటూ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా కేరళ హైకోర్టు న్యాయమూర్తులు ఊటంకించారు.
Read Also- CM Revanth on PM Modi: పేదలపై కక్షతో.. పథకాన్నే మార్చేస్తారా.. మోదీకి సీఎం రేవంత్ సూటి ప్రశ్న
అసలేంటీ కేసు?
పిటిషన్ వేసిన మహిళ భర్త పేరు మోహనసుందరం. ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తూ 2017 ఆగస్టు 17న ఆయన చనిపోయారు. వాళ్లకు పిల్లలు లేరు. దీంతో, మృతుడికి చట్టబద్ధ వారసులుగా భార్య మిగిలారు. దీంతో, తనకు అర్హతలు ఉండడంతో కారుణ్య నియామకాన్ని కోరుతూ 2017 డిసెంబర్ 18న ఆమె దరఖాస్తు పెట్టారు. భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా మారారని, తనను సంరక్షించడానికి ఎవరూ లేరని వివరించారు. ఆమె అప్లికేషన్‌ను స్కూల్ మేనేజర్ పరిగణనలోకి తీసుకున్నారు. అయితే, ప్రస్తుతం ఖాళీలు లేవని, వేకెన్సీ ఉన్నప్పుడు సమాచారం ఇస్తామంటూ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో 2018 సెప్టెంబర్ 16న ఆమె రెండో పెళ్లి చేసుకున్నారు. నేటి సమాజంలో మగతోడు లేని ఆడవాళ్ల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకొని, రెండో పెళ్లి చేసుకున్నానని ఆమె తెలిపారు. అయితే, రెండో పెళ్లి చేసుకోవడంతో కారుణ్య నియామకానికి అర్హతను కోల్పోయారంటూ స్కూల్ మేనేజర్ పేర్కొంటూ, ఉద్యోగాన్ని తిరస్కరించారు. 2024 మార్చి 31న స్కూళ్లలో వేకెన్సీ ఉన్నా ఆమెను పరిగణనలోకి తీసుకోలేదు.
అంతకంతకూ ఆలస్యమవుతుండడంతో ఆమె డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌ను కూడా కలిశారు. ఈ క్రమంలో, రెండో వివాహం చేసుకుంటే కారుణ్య నియామకానికి అర్హత కోల్పోయినట్టేనంటూ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌కు ‘ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యూకేషన్’ సమాచారం ఇస్తూ 2025 జనవరి 4న ఒక లేఖ రాసింది. ఈ లేఖను సూచిస్తూ సదురు మహిళకు ఉద్యోగాన్ని తిరస్కరిస్తూ స్కూల్ మేనేజర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సదరు మహిళ కేరళ హైకోర్టును ఆశ్రయించింది.
Read Also- YS Jagan on CM Chandrababu: స్వలాభం కోసం.. జన్మనిచ్చిన సీమకే అన్యాయం.. చంద్రబాబుపై జగన్ ఫైర్

