Illegal Medical Shops: తనిఖీ అంటే వచ్చి చూసి వెళ్లడమా?
ముందే లీక్ అవుతున్న సమాచారం..
సత్తుపల్లిలో మెడికల్ వ్యాపారం పేరుతో వ్యవస్థీకృత దోపిడీపై పెరుగుతున్న అనుమానాలు
లైసెన్స్ లేని షాపులకు సిండికేట్ అండ
నిబంధనలు పాటించే వ్యాపారులకు శిక్షలా మారిన దుస్థితి
సత్తుపల్లి, ఖమ్మం క్రైమ్, స్వేచ్ఛ: సత్తుపల్లి నియోజకవర్గంలో మెడికల్ రిటైల్ వ్యాపారం (Illegal Medical Shops) సాధారణ వాణిజ్య పరిధిని దాటి, లాభాల కోసం రూపొందించిన ఒక క్రమబద్ధమైన సిండికేట్ వ్యవస్థగా మారిందన్న ఆరోపణలు మరింత బలపడుతున్నాయి. వరుస కథనాలు వెలువడుతున్నా, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నా, అధికార యంత్రాంగం మాత్రం నామమాత్రపు తనిఖీలకే పరిమితమవుతుండటంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా జరిగిన డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్యటన ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. తనిఖీలకు ముందే సమాచారం లీక్ అయిందన్న ఆరోపణలు పట్టణంలో విస్తృతంగా వినిపిస్తున్నాయి. అధికారుల రాకకు ముందే కొన్ని మెడికల్ షాపులు షట్టర్లు దించుకోవడం, మరికొన్ని అప్రమత్తంగా వ్యవహరించడం యాదృచ్ఛికం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనిఖీలు ముందస్తు సమాచారంతో నిర్వీర్యమవుతున్నాయంటే, వ్యవస్థలో లోతైన లోపం ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు, అర్హతలు లేకుండా, లైసెన్సులు లేకుండానే నడుస్తున్న మెడికల్ షాపులకు సిండికేట్ పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం బాధ్యతగా వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తున్న చిన్న వ్యాపారులు మాత్రం ఈ అనధికార వ్యవస్థలో భాగం కాకపోవడంతో సిడికేట్ ఒత్తిళ్లకు నిలవలేక ఆర్థికంగా నష్టపోయే పరిస్థితికి నెట్టివేయబడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది స్వేచ్ఛా వ్యాపారానికి విరుద్ధమైన పరిస్థితిగా మారిందన్న వాదన వినిపిస్తోంది.
ఈ వ్యవస్థ పని తీరు యాదృచ్ఛికం కాదని, దశలవారీగా రూపొందించిన ఒక వ్యూహాత్మక సిండికేట్ మోడల్‌గా పనిచేస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మార్కెట్‌పై పట్టు సాధించడం, సరఫరాను నియంత్రించడం, ధరలను ప్రభావితం చేయడం, నిబంధనల ప్రకారం నడిచే వ్యాపారులను ఒత్తిడిలోకి నెట్టడం వంటి చర్యలు ఒకే దిశగా సాగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read Also- Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో పంట పొలాల్లో తిరుగుతున్న పోలీసులు.. ఎందుకో తెలుసా?
ఇదే క్రమంలో, సిండికేట్‌కు సంబంధించిన వ్యక్తులు హోల్‌సేల్–రిటైల్ మధ్య ఉండాల్సిన గీతలను చెరిపేసి, స్వయంగా రిటైల్ అమ్మకాలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా చర్చనీయాంశంగా మారాయి. దీని వల్ల ధరల పోటీ నిర్వీర్యమవుతూ, సిండికేట్ ఆధిపత్యం మరింత బలపడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
డ్రగ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ “హాస్పిటల్ మెడికల్ స్టోర్లన్నింటినీ చెక్ చేశాం… ఎక్కడా లోపాలు కనిపించలేదు” అని మాత్రమే చెప్పడం డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీల అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా వెళ్లిపోవడం, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం, కాలం చెల్లిన మందులపై ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఒక్క లోపం కూడా కనిపించలేదని చెప్పడం మరిన్ని ప్రశ్నలకు తావిస్తోంది.
Read Also- Seethakka Meets KCR: మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. కారణం ఏంటంటే?
“తనిఖీ అంటే వచ్చి చూసి వెళ్లడమా? లేక నిజాలను బయటకు తీసుకురావడమా?” అన్న ప్రశ్న ఇప్పుడు పట్టణమంతా వినిపిస్తోంది. ప్రజారోగ్యంతో నేరుగా సంబంధం ఉన్న శాఖ కావడంతో, డ్రగ్ కంట్రోల్ అధికారులు తీసుకునే ప్రతి చర్య పారదర్శకంగా ఉండాలీ… కానీ ఇక్కడ జరిగింది చూస్తే అంత భిన్నంగా ఉంది. ఇప్పటికైనా లైసెన్స్ లేని షాపుల వివరాలు, తనిఖీలకు ముందే లీకైన సమాచారంపై ఆధారాలు, బాధిత వ్యాపారుల వాంగ్మూలాలతో కూడిన సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి, స్వతంత్రంగా, పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సత్తుపల్లి ప్రజలు గట్టిగా కోరుతున్నారు.
‘సత్తుపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు ఎదురు చూపులు మరో తనిఖీపై కాదు – చట్టం నిజంగా పనిచేస్తుందన్న స్పష్టమైన, దృఢమైన చర్యలపైనే నిలిచాయి’ అని స్థానికులు అంటున్నారు. సత్తుపల్లిలో మెడికల్ షాపులు, హాస్పిటల్స్‌లో జరుగుతున్న అక్రమాలపై పెరుగుతున్న ఆరోపణలను సమగ్రంగా విచారించాలనే ఉద్దేశంతో ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని యోచిస్తున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలపై నెలకొన్న అనుమానాలు, ముందస్తు సమాచారం లీక్ ఆరోపణలు ఈ నిర్ణయానికి కారణంగా పేర్కొంటున్నారు.
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం జరుగుతోందన్న ఆరోపణలను ఫిర్యాదులో పొందుపరచనున్నారు. కాలం చెల్లిన మందులపై వచ్చిన ఫిర్యాదులను కూడా కలెక్టర్‌కు వివరించాలనుకుంటున్నారు. లైసెన్స్ లేని మెడికల్ షాపుల నిర్వహణపై విచారణ కోరనున్నారు. సత్తుపల్లిలో పనిచేస్తున్న మెడికల్ సిండికేట్ పాత్రపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సిండికేట్ ఆధారంగా నడుస్తున్న వ్యాపార వ్యవస్థను బయటపెట్టాలని కోరుతున్నారు. డ్రగ్స్ కంట్రోల్ శాఖ తనిఖీల రికార్డులను పరిశీలించాలని విజ్ఞప్తి చేయనున్నారు. విజిలెన్స్ లేదా ఏసీబీ స్థాయి విచారణ అవసరమని అభిప్రాయపడుతున్నారు.

