LPG Gas Scam: హుజూరాబాద్ పట్టణంలో ప్రభుత్వ సబ్సిడీ ఎల్‌పీజీ(LPG) సిలిండర్ల అక్రమ మళ్లింపు పేట్రేగిపోతుంది. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తిన వైఖరితో, పేద ప్రజల కోసం ఉద్దేశించిన గ్యాస్‌ను హోటళ్లు(Hotels), రెస్టారెంట్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వంటి వ్యాపార సంస్థలు యథేచ్ఛగా వినియోగిస్తున్నాయి. ఈ అక్రమ దందా వెనుక గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది, సరఫరాదారుల హస్తం దాగి ఉందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
పేదల సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు..
గ్యాస్ ఏజెన్సీల సిబ్బంది, సరఫరాదారులు పేద, మధ్యతరగతి గృహ వినియోగదారులకు కేటాయించిన సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నారు. ఈ సిలిండర్లను బస్టాండ్, కరీంనగర్ రోడ్ వంటి ప్రధాన ప్రాంతాల్లోని భోజనశాలలకు, హోటల్ మాఫియాకు అధిక ధరకు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటూ జేబులు నింపుకొంటున్నారు. ఈ అక్రమ మళ్లింపు కారణంగా, అసలు లబ్ధిదారులు సకాలంలో గ్యాస్‌ను పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది పేదల పొట్ట కొట్టడమేనని లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: YS Jagan on AP Govt: అరటి రైతులకు అండగా జగన్.. కూటమి సర్కార్‌కు స్ట్రాంగ్ వార్నింగ్..!
అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం
ప్రభుత్వ ధనాన్ని, ప్రజల హక్కును నిస్సిగ్గుగా దోచుకుంటున్న ఈ మాఫియాపై సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు కళ్లు మూసుకుని కూర్చోవడం వల్లే ఈ అక్రమ మార్పిడి హద్దులు దాటి విస్తరిస్తుందని బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ధర్మాన్ని కాలరాస్తున్న ఈ అక్రమ దందాపై అధికారులు తక్షణమే దృష్టి సారించాలని హుజూరాబాద్ ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
