Gas Subsidy: వంట గ్యాస్ వినియోగదారులు తమ కనెక్షన్ల క్రమబద్ధీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన బయోమెట్రిక్(Biometric) ఆధార్(Adaar) ప్రామాణీకరణ(e-KYC) ప్రక్రియను ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని తెలంగాణ వంట గ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి పి.వి. మదన్ మోహన్ రావు(Madhan Mohan rao) కోరారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీఎల్(IOCL), బీపీసీఎల్(BPCL), హెచ్‌పీసీఎల్(HPCL) కంపెనీల వినియోగదారులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులతో పాటు సాధారణ గ్యాస్ వినియోగదారులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి డిసెంబర్ 31 నాటికే గడువు ముగిసినప్పటికీ, భారీ సంఖ్యలో కస్టమర్లు ఇంకా కేవైసీ పూర్తి చేయని కారణంగా ఆయిల్ కంపెనీలు జనవరి 31 వరకు మరో వెసులుబాటు కల్పించాయని తెలిపారు.
వినియోగదారులు నేరుగా..
నిర్ణీత సమయంలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో గ్యాస్ రాయితీలు నిలిచిపోవడమే కాకుండా, కనెక్షన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం మూడు రకాల మార్గాలను అందుబాటులోకి తెచ్చిందని ఆయన వివరించారు. వినియోగదారులు నేరుగా తమ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి బయోమెట్రిక్ యంత్రం ద్వారా గానీ, లేదా సిలిండర్ సరఫరా చేసే డెలివరీ సిబ్బంది వద్ద ఉండే ఆధార్ ప్రామాణీకరణ పరికరాల ద్వారా గానీ ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు ఆయిల్ కంపెనీల మొబైల్ యాప్‌ల ద్వారా, ఆధార్ ముఖ గుర్తింపు (Face RD) సదుపాయంతో ఇంట్లోనే కూర్చుని సులభంగా కేవైసీ చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా pmuy.gov.in వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచిందని, వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 18002333555ను సంప్రదించాలని సూచించారు.
Also Read: DK Aruna: ఉపాధి హామీ పథకం కేవలం కరువు కాలంలో ఆదుకుంటే సరిపోదు: ఎంపీ డీకే అరుణ
కాలపరిమితి కేవలం ఐదు సంవత్సరాలు
గ్యాస్ వినియోగంలో భద్రతా ప్రమాణాల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని మదన్ మోహన్ రావు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. గ్యాస్ ప్రమాదాల నివారణకు ఆయిల్ కంపెనీలు ఆమోదించిన ‘సురక్ష’ రబ్బరు ట్యూబులనే వాడాలని, ఐఎస్ఐ (ISI) ముద్ర లేని లోకల్ పైపులను వాడటం వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు. సురక్ష పైపుల కాలపరిమితి కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటుందని, ఐదేళ్లు దాటిన పాత పైపులను వెంటనే మార్చాలని కోరారు. నాణ్యత లేని ట్యూబులను వాడి ప్రమాదం సంభవిస్తే ఇన్సూరెన్స్ వర్తించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అగ్ని ప్రమాద సమయంలో సురక్ష పైపులు మంటలకు చెలరేగవని, కావున భద్రత దృష్ట్యా వినియోగదారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
Also Read: Mahabubabad SP: మహిళల రక్షణ, భద్రత కోసమే షీ టీంలు పని చేస్తున్నాయి : ఎస్పీ శబరీష్!

