MD Amir Pasha: జమ్మికుంట మండలం, బిజీగిరి షరీఫ్ గ్రామానికి చెందిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్(MP Etela Rajender) వీరాభిమాని, చురుకైన కార్యకర్త అయిన ఎండీ అమీర్ పాషా(MD Amir Pasha) (35) గురువారం మధ్యాహ్నం తన ఇంట్లో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
స్థానిక ఎన్నికల్లో ప్రచారం
నిరుపేద కుటుంబానికి చెందిన దినసరి కూలీ అయిన అమీర్ పాషా(MD Amir Pasha), ఈటెల రాజేందర్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఆయనకు వీరాభిమానిగా ఉంటూ, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల గెలుపు కోసం రాత్రింబవళ్లు ప్రచారం చేసి తనదైన పాత్ర పోషించారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లోనూ ప్రచారంలో పాల్గొని అలసి ఇంటికి వచ్చిన తర్వాతే ఆయన గుండెపోటు(Heart attack)కు గురై మరణించారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన అమీర్ పాషా కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, వారికి ప్రభుత్వ సహాయంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఆర్థిక సహాయం అందేలా చూడాలని గ్రామ ప్రజలు, నాయకులు కోరారు.

