Kapas Kisan App: కపాస్ కిసాన్ యాప్‌తో కౌలు రైతులకు కష్టాలు తప్పవని, వారిని ఈ యాప్ నుంచి రక్షించాలని పత్తి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ భూక్యా చందు నాయక్(Bhukya Chandu Nayak) డిమాండ్ చేశారు. శనివారం సంఘం ప్రతినిధులతో కలిసి లింగాల ఘనపురం మండలం కుందారం గ్రామంలో పత్తి(Cotton), వరి(Paddy), మొక్కజొన్న పంటలను పరిశీలించారు.
కొర్రిలు పెట్టే ప్రమాదం..
ఈ సందర్బంగా చందునాయక్ మాట్లాడుతూ కపాస్ కిసాన్ యాప్(Kapas Kisan App)తో కౌలు రైతుకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఈ యాప్‌లో భూమి పట్టాదారులు మాత్రమే ఉంటారని, కౌలు రైతుల నమోదు ఉండదన్నారు. దీంతో పండించిన పత్తిపంటను కౌలు రైతు అమ్ముకోవాలంటే భూమి పట్టాదారు వద్దకు వెళ్ళాలని, దీంతో పట్టాదారులు కొర్రిలు పెట్టే ప్రమాదం ఉందన్నారు. దీంతో కౌలు రైతులకు కష్టాలు తప్పవని ఆవేధన చెందారు. ఈ కపాస్ కిసాన్ యాప్‌ను తొలగించి నేరుగా పత్తిని రైతులు ఇష్టం వచ్చిన మిల్లులో అమ్ముకునే వెసులుబాటు ఇవ్వాలని అన్నారు.
Also Read: Gadwal District: ధర్మవరం బిసి హాస్టల్ లో ఫుడ్ పాయిజన్.. 52 మంది విద్యార్థులకు అస్వస్థత
నల్లగా మారిన పత్తి..
మొంథా తుఫాన్‌తో జిల్లా వ్యాప్తంగా 32వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. ఇప్పటికి ఇంకా అనేక పంటలు నీటిలోనే ఉన్నాయని, దీంతో పంటంతా నల్లగా మారిందన్నారు. పత్తి పంట రంగు మారిందన్నారు. మొక్కజొన్న, వరి ధాన్యం మొలకెత్తుతున్నాయని అన్నారు. నల్లగా మారిన పత్తిని సీసీఐ(CCI) అధికారులు మద్దతు ధరకు కొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. వరికి ఎకరాకు రూ.40వేలు, పత్తికి రూ.60వేలు, మొక్కజొన్నకు రూ.30వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పంట భీమా పథకాన్ని అమలు చేయాలన్నారు. యాసంగి సీజన్‌లోపే పరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
