Virat Kohli retirement: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ సైతం టెస్టులకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ సైతం టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడం అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. అయితే యువకులకు అవకాశం ఇవ్వాలన్న లక్ష్యంతోనే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా భారత్ తరపున ఇప్పటివరకూ 123 టెస్టులు (210 ఇన్నింగ్స్) ఆడిన కోహ్లీ.. మెుత్తం 9230 పరుగులు చేశాడు. అందులో 31 అర్ధ సెంచరీలు, 30 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు ఉన్నాయి. అందులో 254 పరుగులు హై స్కోర్ గా ఉంది. 2014-19 మధ్య టీమిండియా టెస్ట్ కెప్టెన్ గానూ విరాట్ వ్యవహరించారు. భారత్ తరపున 68 టెస్టులకు కోహ్లీ నాయకత్వం వహించాడు. అయితే 10 వేల పరుగులు మైలురాయికి కొద్ది దూరంలోనే నిలిచి.. రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానుల్లో ఆవేదన కలిగిస్తోంది.
Also Read: MLC Kavitha: జైల్లో ఉన్నది సరిపోదా.. నన్ను ఇంకా కష్టపెడతారా.. కవిత ఆవేదన!
తన రిటైర్మెంట్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కోహ్లీ ప్రకటించారు. ఈ సందర్భంగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. 14 ఏళ్ల క్రితం తొలిసారి టెస్ట్ క్రికెట్ జెర్సీ ధరించానన్న కోహ్లీ.. ఈ ఫార్మాట్ తనను ఇంత దూరం తీసుకెళ్తుందని అసలు అనుకోలేదని తెలిపారు. తెల్ల జెర్సీలో ఆడటంతో తన మనసుకు ఎంతో ప్రత్యేకమైందని చెప్పారు. అలాంటి టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకోవడం అంత తేలికైన విషయం కాదన్న కోహ్లీ.. అయితే తనది సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. మనుసు నిండా సంతృప్తితో వైదొలుగుతున్నట్లు చెప్పారు. తన టెస్ట్ కెరీర్ ను వెనక్కి తిరిగి చూసుకుంటే తన ముఖంలో చిరునవ్వు కనిపిస్తున్నట్లు కోహ్లీ అన్నారు. ‘ప్రేమతో ఇక సైనింగ్ ఆఫ్’ అంటూ పోస్ట్ ను కోహ్లీ ముగించాడు.