India Pakistan Ceasefire: పహల్గాం ఉగ్రదాడి పరిణామాలతో భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఇందుకు ప్రతిగా పాక్ భారత్ పైకి డ్రోన్లు, యుద్ధ విమానాలు, మిసైళ్లు పంపడం.. దానిని మన రక్షణ వ్యవస్థ కుప్పకూల్చడం కొద్ది రోజులుగా నిరంతర ప్రక్రియగా మారిపోయింది. అయితే ఆదివారం రాత్రి అనూహ్యంగా సరిహద్దుల్లో నిశ్శబ్దం ఆవరించింది. అందుకు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
సరిహద్దుల్లో ప్రశాంతత
పహల్గాం దాడి తర్వాత నుంచి గత 19 రోజులుగా పాక్ సరిహద్దు ప్రాంతాల్లో అలజడి నెలకొని ఉంది. కాల్పుల మోత, షెల్లింగ్స్, పాక్ డ్రోన్ల చొరబాటు, బ్లాక్ ఔట్ లతో హడావిడిగా కనిపించింది. అయితే నియంత్రణ రేఖ వెంబడి ప్రాంతాలు ఆదివారం రాత్రి ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాయి. మే 11 రాత్రి 11 గం.ల నుండి ఎలాంటి కాల్పులు, ఉల్లంఘనలు చోటుచేసుకోలేదని భారత సైనిక వర్గాలు తెలిపాయి. గత కొన్నిరోజులుగా తుపాకుల శబ్దాలతో దద్దరిల్లిన పూంచ్ లోని సురాన్ కోట్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.
హాయిగా నిద్రపోయిన ప్రజలు
రెండ్రోజుల క్రితమే సూరన్ కోట్ లో భారీ బాంబు దాడి జరిగింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు.. అక్కడి నుంచి పారిపోయారు. సమీపంలోని కొండలు, గ్రామాలు, బంకర్లు, ఇతర సురక్షిత ప్రాంతాలకు తరళివెళ్లారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా పాక్ సైలెంట్ అయిపోవడంతో తిరిగి వారు తమ గ్రామానికి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే కేవలం కాశ్మీర్ లోనే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్ లోని ఏరియాల్లో ఆదివారం రాత్రి ప్రశాంత వాతావరణం కనిపించింది. దీంతో గత కొన్ని రోజులుగా కంటిమీద కునుకు లేకుండా గడిపిన ప్రజలు ఆదివారం హాయిగా నిద్రపోయినట్లు సమాచారం.
Also Read: Gold Rate Today : గోల్డ్ లవర్స్ కి బంగారం లాంటి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన రేట్స్
సైన్యం వార్నింగ్ వల్లే..
‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ తర్వాత తలెత్తిన సైనిక ఘర్షణను ఆపేందుకు భారత్-పాకిస్థాన్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని గంటలకే దాయాది దేశం పాక్ దాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది. ఈ నేపథ్యంలో ఆదివారం మీడియా ముందుకు వచ్చిన భారత త్రివిద దళాధిపతులు శత్రు దేశానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరోమారు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. దీంతో దాయాది దేశం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఫలితంగా జమ్మూకశ్మీర్‌లో నిన్న రాత్రి ఎలాంటి కాల్పులు జరగలేదని భారత సైన్యం స్పష్టం చేసింది.