IPL Final 2025: ఐపీఎల్ 2025 (IPL 2025 Final) ట్రోఫీని ముద్దాడబోయే జట్టు ఏదనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. తుది పోరు కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు సర్వ సన్నద్ధమయ్యాయి. ఏ జట్టు గెలిచినా తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించనున్నాయి. తమ ఫేవరెట్ టీమ్ గెలవాలని ఇరు జట్ల అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులైతే, ఆర్సీబీ విక్టరీ కొట్టాలని దేవుళ్లను మొక్కుతున్నారు. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫ్యాన్స్‌కు యూకే మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ కూడా జత కలిశారు. ఆర్సీబీకి ఫుల్ సపోర్టు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు స్వయంగా మైదానానికి కూడా వస్తున్నట్టు రిషి సునాక్ వెల్లడించారు.
Read This, RCB Fan: కప్ కోసం ఎంతకు తెగించార్రా.. ఆర్‌సీబీ ఫ్యాన్ పనికి అవాక్కవాల్సిందే!
మద్దతు ఇచ్చేది అందుకే..
ఆర్సీబీకి మద్దతు తెలపడానికి గల ఆసక్తికర కారణాలను రిషి సునాక్ వెల్లడించారు. తన వ్యక్తిగత బంధాల దృష్ట్యా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తనకు సొంత జట్టు అని, పంజాబ్ కింగ్స్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవాలని తాను కోరుకుంటున్నట్టు ఆయన అన్నారు. బెంగళూరు కుటుంబానికి చెందిన అమ్మాయిని తాను వివాహం చేసుకున్నానని, అందుకే ఆర్సీబీ తనకు సొంత టీమ్ అని చెప్పారు. తన సతీమణి అక్షతా మూర్తికి కన్నడ భాషలోనే ప్రేమను వ్యక్తపరిచానని ఈ సందర్భంగా రిషి సునాక్ గుర్తుచేసుకున్నారు. తన పెళ్లి సమయంలో అత్తింటి తరపు బంధువులు ఆర్సీబీ జెర్సీని బహుమతిగా అందించారని, అప్పటినుంచి ఆర్సీబీపై అభిమానం మరింత పెరిగిందని, టీమ్‌ని మరింతగా ఫాలో అవుతున్నానని వివరించారు. చాలాకాలం క్రితం స్వయంగా ఆర్సీబీ మ్యాచ్‌లకు కూడా హాజరయ్యానని, తాను యూకే ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఆర్సీబీని ఉత్సాహపరిచే ప్రయత్నాలు చాలానే చేశానని ఆయన గుర్తుచేసుకున్నారు.
Read This, ipl final 2025: ఒకే ఒక్కడు.. ఫైనల్ వేళ అందరి దృష్టి అతడి పైనే!
కోహ్లీ నా ఫేవరెట్: రిషి సునాక్
కింగ్ విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ అని, అతడో లెజండ్ అని రిషి సునాక్ చెప్పారు. విరాట్ సంతకం చేసిన బ్యాట్‌ను భారత విదేశాంగ మంత్రి ఎస్.శంకర్ తనకు బహుకరించారని గర్వంగా చెప్పుకుంటానని పేర్కొన్నారు. తాను పదవిలో ఉన్నప్పుడు ప్రధాని కార్యాలయంలో ఆ బ్యాట్‌ను కూడా ఉంచేవాడినని గుర్తుచేసుకున్నారు. ఇక, ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో పాటు ఇంగ్లండ్ క్రికెటర్లు ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్ కూడా రాణించాలని సునాక్ ఆకాంక్షించారు. ఐపీఎల్ గురించి మాట్లాడుతూ, ప్రపంచ క్రికెట్ స్వరూపాన్నే మార్చివేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఏ దేశానికి చెందిన క్రికెటరైనా ఐపీఎల్ ఆడాలని కోరుకుంటున్నారని, కొంతమందైతే ఐపీఎల్‌నే కెరీర్‌గా ఎంచుకుంటున్నారని సునాక్ అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్ క్రికెటర్లు కూడా ఇక్కడ తమ ఆటను మెరుగుపరచుకుంటున్నారని కొనియాడారు. గతవారం ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చూశానని, ఆ మ్యాచ్‌లో అద్బుతంగా రాణించిన జాకబ్ బెతల్ ఐపీఎల్‌లోనే ఆట తీరుని మెరుగుపరుచుకున్నాడని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషి సునాక్ ఈ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం, ఆయన భారత పర్యటనలో ఉన్నారు.