ipl final 2025: అతడో గ్లోబల్ స్టార్ క్రికెటర్.. ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక మంది అభిమానులను సంపాదించుకున్న దిగ్గజ ప్లేయర్. ఎందరో యువ క్రికెటర్లకు ఇన్స్పిరేషన్. ఇప్పటికే దాదాపు అన్ని ఐసీసీ టైటిల్స్‌ను ముద్దాడిన అతడికి ఐపీఎల్ టైటిల్ మాత్రం ఇంకా అందని ద్రాక్ష గానే మిగిలింది. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఇంకా ఆడుతూనే ఉన్నా.. మూడుసార్లు ఫైనల్స్ ఆడినా, ఇప్పటికీ ట్రోఫీని తాకలేకపోయాడు. ఆ ఆటగాడు ఎవరో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది.. అతడే ‘కింగ్’ విరాట్ కోహ్లీ. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ వేళ (ipl final 2025) క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు అందరి కళ్లు ఈ ‘పరుగుల యంత్రం’పైనే పడ్డాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడేందుకు సర్వం సన్నద్ధమయ్యాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు అద్భుతంగా రాణించి ఫైనల్ పోరుకు అర్హత సాధించాయి. తుది పోరులో ఏ జట్టు గెలిచినా తొలిసారి టైటిల్ సాధించి చరిత్ర నెలకొల్పుతాయి. అయితే, కీలకమైన టైటిల్ పోరుకు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం విరాట్ కోహ్లీపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘జట్టు భారాన్ని తన భుజాలపై మోశాడు, సుదీర్ఘ పయనం చేశాడు, సంక్లిష్ట పరిస్థితుల్లోనూ రాణించాడు. ఇప్పుడు, ధైర్యంగా ఆడాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని వ్యాఖ్యానించింది. ఎక్స్ వేదికగా ఆర్సీబీ అఫీషియల్ అకౌంట్ నుంచి ఈ పోస్ట్ షేర్ చేసింది. విరాట్ కోహ్లీ పిక్‌ను కూడా ఈ సందర్భంగా ఈ పోస్టుకు జత చేసింది.
Read Also- IPL Final Closing Ceremony: ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. ఈసారి ముగింపు వేడుకలు ధూమ్ ధామే!
18వ సీజన్‌లో కల నెరవేరేనా?
ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్న అతికొద్దిమంది ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు. ఆసక్తికరంగా విరాట్ జెర్సీ నంబర్ 18 కాగా, ఈ ఏడాది ఐపీఎల్ ఎడిషన్ కూడా 18వది కావడం యాదృచ్ఛికం. మరి, ఈ ఏడాదైనా కోహ్లీ డ్రీమ్ నెరవేరుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. విరాట్ ఇప్పటివరకు అన్ని ఐపీఎల్ సీజన్లలోనూ ఆడగా, అతడి జట్టు మూడుసార్లు ఫైనల్ చేరినా కప్ కలగానే మిగిలింది. ఈ ఏడాదైనా ఆ కల నెరవేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక, కోహ్లీ ఐపీఎల్ ట్రాక్ రికార్డు పరిశీలిస్తే, టోర్నమెంట్‌లో ఇప్పటివరకు (ఫైనల్‌కు ముందు) 8,618 పరుగులు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా అతడు అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా కోహ్లీ కొనసాగుతున్నాడు. 2016 సీజన్‌లో ఏకంగా 973 పరుగులు బాదాడు. అంతేకాదు, ఐదుసార్లు కంటే ఎక్కువసార్లు 600లకు పైగా పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్‌గా కూడా అతడు ఈ మధ్యే రికార్డు సృష్టించాడు.
Read Also- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?