Shreyas Iyer: ఫామ్‌లో ఉన్న స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌ను (Shreyas Iyer) ఆసియా కప్-2025కు (Asia Cup 2025) ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో, బీసీసీఐ అందరినీ ఆశ్చర్యపరిచే ప్రకటన చేసింది. ఈ నెలలో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో భారత్-ఏ జట్టు ఆడబోయే రెండు టెస్ట్ మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ మేరకు ఇండియా-ఏ టీమ్‌ను శనివారం ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
శ్రేయస్ అయ్యర్‌తో పాటు, మరికొందరు సీనియర్ క్రికెటర్లు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ధ్రువ్ జురెల్, సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ కూడా టీమ్‌లో ఉన్నారు. ధ్రువ్ జురెల్‌ను వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇటీవల దేశీయ క్రికెట్‌లో రాణించిన పలువురు యువక్రికెటర్లకు కూడా ఇండియా-ఏ జట్టులో అవకాశం లభించింది. ఈ జాబితాలో అయూష్ బదోని, తనుష్ కోటియన్, హర్ష్ దూబే, మనవ్ సుతార్, ఎన్.జగదీశన్, గుర్నూర్ బ్రార్ ఉన్నారు. ఆస్ట్రేలియా-ఏ జట్టుతో ఆడబోయే ఈ మ్యాచ్‌ల్లో సీనియర్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ కూడా భాగం కానున్నారని, ఈ మేరకు జట్టులో చేరతారని బీసీసీఐ ప్రకటించింది. గాయంతో బాధపడుతున్నందున సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కలేదు.
కాగా, ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరగబోయే ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో మొదటిది సెప్టెంబర్ 16న, రెండో మ్యాచ్ 23న ప్రారంభం కానున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు లక్నో వేదికగా జరగనున్నాయి. అనంతరం, సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, అక్టోబర్ 5 తేదీల్లో కాన్పూర్‌లో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో భారత్-ఏ జట్టు మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. అందుకే, వన్డే జట్టు ప్లేయర్లు ఎవర్నీ ఎంపిక చేయలేదు. సరిగ్గా ఇదే సమయంలో టీమిండియా ఆసియా కప్ టోర్నమెంట్‌లో పాల్గొంటుంది.
Read Also- Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం
శ్రేయస్ అయ్యర్‌కి చోటు దక్కింది సీనియర్ జట్టులో కాకపోయినప్పటికీ, టెస్ట్ ఫార్మాట్‌లో తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు చక్కటి అవకాశం లభించినట్టు అయ్యిందని మాజీ క్రికెటర్లు, అభిమానులు భావిస్తున్నారు. అక్టోబర్ ప్రారంభంలో వెస్టిండీస్‌తో జరగనున్న 2 టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రస్తుతం ఇండియా-ఏ జట్టు తరపున మ్యాచ్‌లు ఆడనుండటంతో విండీస్ సిరీస్ ద్వారా మళ్లీ సీనియర్ జట్టులోకి అయ్యర్ అడుగుపెట్టే అవకాశం ఉంది.
ఇండియా-ఏ జట్టు ఇదే
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, హర్ష దూబే, అయూష్ బదోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, మనవ్ సుతార్, యశ్ ఠాకూర్. ఈ సిరీస్‌లో రాణించే ఆటగాళ్లు బీసీసీఐ సెలక్టర్ల దృష్టిలో పడే అవకాశం మెండుగా ఉంటుంది.
Read Also- Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!